హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిపై విద్యుత్తు బకాయిల పేరిట మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి పథకాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడాప్రాంగణాల నిర్వహణకు వినియోగించిన విద్యుత్తు బిల్లులు ఏండ్ల తరబడి పేరుకుపోవడంతో పంచాయతీలపై ఇప్పటికే పెనుభారం పడింది. పంచాయతీరాజ్ (పీఆర్) శాఖ లెకల ప్రకారం ఈ బకాయిలు దాదాపు రూ.1,700 కోట్ల మేరకు ఉండగా.. డిసమ్లు మాత్రం రూ.6 వేల కోట్లకుపైగా బకాయిలున్నాయని చెప్తున్నాయి.
ఈ బిల్లుల చెల్లింపునకు గ్రామాభివృద్ధి నిధులనే వినియోగించాలని రేవంత్రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తున్నది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు, బ్లీచింగ్, పారుల అభివృద్ధి తదితర పనుల కోసం 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులను విద్యుత్తు బకాయిల చెల్లింపునకు మళ్లించాలన్న నిర్ణయాన్ని కొత్త సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర నుంచి నేరుగా పంచాయతీలకు వచ్చే ఈ నిధులను విద్యుత్తు బకాయిల చెల్లింపునకు మళ్లిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు.
పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలపై గ్రామ సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తే గ్రామాల్లో అత్యవసర పనులు ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి పైపుల మరమ్మతులు, దోమల నివారణ లాంటి చిన్నచిన్న పనులకు ఒక రూపాయి కూడా మిగులదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో కార్యదర్శులు నిధులు డ్రా చేయకుండా ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నట్టు సమాచారం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.
తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ లాంటి ప్రాథమిక సేవలకు ఆర్థిక సంఘం నిధులను వినియోగించవచ్చని, విద్యుత్తు ఖర్చు కూడా అదే పరిధిలోకి వస్తుందని అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగానే బకాయిల చెల్లింపులకు సూచనలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను విద్యుత్తు బకాయిలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించకుండా కేంద్ర నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నదని ఆరోపించారు. ఒకవైపు బకాయిల కోసం డిసమ్ల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు, ఇంకోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతాయన్న ఆందోళన మధ్య పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు.
రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడాప్రాంగణాలు, హరితహారం మొకల సంరక్షణ లాంటి కార్యక్రమాలకు పెద్దఎత్తున విద్యుత్తు వినియోగం అవుతున్నది. దీంతో గ్రామ పంచాయతీ పరిమాణాన్ని బట్టి ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు బిల్లులు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఈ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్పంచ్ ఎన్నికలు ఆలస్యమవడం, నిధుల కొరత, ఆర్థిక సంఘం నిధుల విడుదల్లో జాప్యం తదితర కారణాలతో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. వాటిని వెంటనే చెల్లించాలని డిసమ్లు ఒత్తిడి పెంచుతుండటంతో పంచాయతీరాజ్ శాఖ ఆ బాధ్యతను గ్రామ కార్యదర్శులపై మోపినట్టు సమాచారం. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను డిజిటల్ కీ ద్వారా విద్యుత్తు శాఖకు బదిలీ చేయాలని అంతర్గతంగా వారిని ఆదేశించడంతోపాటు బకాయిల చెల్లింపులు ఆలస్యమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.