ఖమ్మం రోటరీ నగర్‌కు చెందిన శ్రీనివాసరావు స్థానిక చౌకధరల దుకాణంలో రేషన్ కార్డును కలిగి ఉన్నాడు. రేషన్ కార్డులో నలుగురు సభ్యులు ఉండగా.. కుమార్తె రాధిక ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లింది. ముగ్గురు సభ్యులు రేషన్‌షాపునకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకున్నారు… అయితే రాధిక కూడా ఈ-కేవైసీ చేయించుకోవాలని రేషన్ డీలర్ ఆదేశించాడు. లేదంటే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులో రాధిక పేరు తొలగించబడుతుందని శ్రీనివాసరావుకు తేల్చిచెప్పాడు. రాధిక ప్రభుత్వం సహాయంతో అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్లిందని, ఇప్పుడు రేషన్‌కార్డులో పేరు తొలగిస్తే ఎలా అంటూ తండ్రి అయోమయంలో పడ్డాడు.
రఘునాథపాలెం, జూలై 22 : రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామానికి చెందిన రాజేశ్ రేషన్ కార్డు కలిగి ఉండగా.. కార్డులో తన కుమార్తెకు ఐదేళ్లు పూర్తయ్యాయి. రేషన్‌షాపునకు వెళ్లి డీలర్‌ను కలిసి ఈ-కేవైసీ చేయాలని అడిగితే సదరు డీలర్ ఎంత ప్రయత్నించగా.. ఆ చిన్నారిది ఈ-కేవైసీ కాలేదు. ఆధార్ సెంటర్‌కు వెళ్లి చిన్నారి ఆధార్‌కార్డును అప్డేట్ చేయించాలని డీలర్ సూచించాడు. అదే ప్రకారంగా రాజేశ్ తన కుమార్తెను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లి వేలిముద్రలు, ఐరిష్‌తో ఆధార్‌కార్డు అప్డేట్ చేయించాడు. తిరిగి రేషన్‌షాపునకు వెళ్లి ఈ కేవైసీ చేయించగా ఎంతకీ అవలేదు. దీంతో రాజేశ్ తన కుమార్తె పేరు తొలగిపోతుందనే భయంలో పడ్డాడు.
కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన సంపంగి పుల్లయ్యకు 78 ఏళ్లు. భార్య చనిపోగా స్థానిక రేషన్‌షాపులో ప్రతినెలా ఓటీపీ ద్వారా ఆరు కిలోల బియ్యం తీసుకుంటున్నాడు. ఈ-కేవైసీ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వేలిముద్రలు తీసుకోలేదు. ఐరిష్‌తో బయోమెట్రిక్ చేసినా కళ్లు స్కానింగ్ అవలేదు. ఆధార్సెంటర్కు వెళ్తే అక్కడా ఇదే పరిస్థితి. ఆధార్‌కార్డు అప్డేట్ కావడం లేదు. కానీ, రేషన్షాపులోని ఈ పాస్ మిషన్‌లో పుల్లయ్య కార్డు ఎంటర్ చేసి పేరును పరిశీలించగా.. ఈ-కేవైసీ కాలేదని చూపిస్తున్నది. దీంతో పుల్లయ్య తన కార్డు తొలగిపోతుందని భయాందోళన చెందుతున్నాడు.
ఇలా ఈ-కేవైసీ చేయించుకోవడంలో కేవలం శ్రీనివాసరావు, రాజేశ్, పుల్లయ్య వంటి రేషన్ కార్డుదారులకు మాత్రమే ఎదురైన సమస్య కాదు. రేషన్ కార్డులు కలిగిన అనేక మంది ఈ-కేవైసీ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకమార్లు రేషన్‌షాపునకు ఈ-కేవైసీ కోసం వెళ్లినా కాని పరిస్థితి నెలకొంది. ఇలా ఖమ్మం జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఈ-కేవైసీ కోసం రేషన్‌షాపుల చుట్టూ తిరిగి పలు సమస్యల కారణంగా కేవైసీ కాక మిన్నకుండిపోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ-కేవైసీకి ఈనెలాఖరు వరకే గడువు విధించడంతో వేలిముద్రలు, ఐరిష్ కాని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్‌కార్డుల్లో చనిపోయిన వారు, నకిలీ రేషన్ కార్డులను ఏరివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-కేవైసీ విధానంతో అసలు లబ్ధిదారుల పేర్లు తొలగిపోతాయేమోననే భయాందోళనకు గురవుతున్నారు.
ఖమ్మం జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు అన్ని రేషన్ షాపులకు నెలాఖరు వరకు తెలిపి, ప్రక్రియ పూర్తి చేయాలని రేషన్ డీలర్లను అధికారులు ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ పూర్తవగా.. ఈ నెల 31వ తేదీ వరకు ఈ-కేవైసీ కోసం షాపులను తీసి ఉంచాలని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఈ కేవైసీ పూర్తికాని వారు రేషన్, ఆధార్ కార్డులతో వెళ్లాలని, వాటి ఆధారంగా డీలర్లు ప్రక్రియ పూర్తి చేస్తారని కార్డుదారులకు సూచించారు.
ఈ కేవైసీ తప్పనిసరి..
ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 81.98 శాతం ఈ-కేవైసీ పూర్తయినది. రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుడు రేషన్ షాపునకు వెళ్లి ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందుకుగానూ ఈ నెల 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు తెరిచి అందుబాటులో ఉంటాయి. ఈ-కేవైసీ చేయించుకోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాల లబ్ధి, రాయితీలు లభిస్తాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిరంతరాయంగా అందేందుకు ప్రతి కుటుంబ లబ్ధిదారుడు చేయించుకోవాలి.
– మల్లికార్జున్, ఇన్చార్జి డీఎస్వో, ఖమ్మం
మరో ఏడాది గడువు పెంచాలి..
ప్రభుత్వ సహాయంతో మా పాప అమెరికా ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లింది. మా కుటుంబ రేషన్ కార్డులో పేరు కలిగిన మా పాప ఈ-కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. ఈ-కేవైసీ కోసం అమెరికా నుంచి రాలేదు కదా. ఇప్పుడేమో జిల్లా సివిల్ సైప్లె అధికారులు కార్డులోని సభ్యులందరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేదంటే పేర్లు తొలగిస్తామని చెప్తున్నారు. ఈ కేవైసీకి మరో ఏడాది కాలం గడువు పెంచాలి.
– సట్టు శ్రీనివాసరావు, రేషన్ లబ్ధిదారుడు, ఖమ్మం