నందిపేట్, జనవరి 4 : నందిపేటలో ఆర్టీసీ డిపో ఏర్పాటుపై అడుగులు దశాబ్దాలుగా ముందుకు పడడంలేదు. డిపో ఏర్పాటు కోసం 31ఏండ్ల క్రితం ఉద్యమం చేపట్టగా డిపో నిర్మాణానికి పాలకులు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి నిర్మాణంపై ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. ఇన్నాళ్ల తర్వాత బస్ డిపో నిర్మాణం కోసం మళ్లీ ఉద్యమానికి మండలవాసులు సిద్ధమవుతున్నారు. ఉద్యమాలతోనే ఏదైనా సాధించుకోవచ్చని విషయాన్ని బలంగా నమ్ముకొని డిపో ఏర్పాటు కావాలని ముందుకెళ్తున్నారు. అప్పటి ఉమ్మడి మండలం నందిపేట్, డొంకేశ్వర్ మండలాల ప్రజలంతా చందాలు పోగు చేసి డిపో కోసం స్థలం కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించారు. స్థలానికి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు.
కానీ ఇదంతా తమ భూమి అని చెప్పుకోవడం తప్ప ఆర్టీసీ ఇప్పటికీ చేసిందేమీలేదు. డిపో ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని సాధన కమిటీ ముందుకు వస్తోంది. పార్టీలు, వర్గాలకు అతీతంగా నందిపేట్, డొంకేశ్వర్ మండలాల ప్రజలు డిపో ఏర్పాటుకోసం కదంతొక్కనున్నారు. ఇందుకోసం ఈ నెల 6న నందిపేట్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు సంబందించిన కరపత్రాలు సోషల్మీడియాలలో చక్కర్లు కొడుతున్నాయి. జనం నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తున్నది.
డిపో ఏర్పాటు కోసం డిపో సాధన కమిటీ ఒక పక్క ఆర్టీసీతో కొట్లాడుతూ మరో పక్క న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. డిపో ఏర్పాటు లేదా ఇచ్చిన స్థలం తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఇటీవల హైకోర్టులో దావా వేశారు. డిపో ఏర్పాటు కాకపోతే స్థలం తిరిగిఇచ్చేస్తే ఆ స్థలాన్ని ఇతరాత్ర అవసరాలకు వాడుకుంటామని ఆర్టీసీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
నందిపేట్‌లో ఆర్టీసీ డిపో అవసరమని అధికారులు ప్రకటించడంతో మండలవాసులు ఎంతో సంతోషపడ్డారు. డిపో కోసం స్థలం కావాలని అడగడంతో ఒక్కో రేషన్ కార్డుకు రూ. 5 రూపాయల చొప్పున డబ్బులు పోగు చేశారు. ఈ డబ్బులతో బస్టాండ్‌కు సమీపంలోనే 5.39 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆర్టీసీకి 1994 మే 5న రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. స్థలం తీసుకున్న ఆర్టీసీ డిపో నిర్మాణాన్ని మరిచిపోయింది. దీంతో మండలవాసులు వినతిపత్రాలు, వినతులు ఇచ్చి వేసారిపోయి ఉద్యమ బాటపట్టారు. సుమారు మూడునాలుగేండ్ల పాటు రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. చివరికి స్థానిక యువకులు పార్టీలకు అతీతంగా బస్టాండ్ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు దిగివచ్చిన ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ముందుకువచ్చి శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నది. అప్పటి నుంచి మరో అడుగు ముందడుగు పడలేదు.
నందిపేట్‌లో డిపో ఏర్పాటుకు అప్పటికన్నా ఇప్పుడు ఎన్నో రేట్ల అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై నిర్మితమైన వంతెనతో నిర్మల్ జిల్లా లోకేశ్వర్, ముథోల్ మండలాల నుంచి సుమారు 25 గ్రామాల ప్రజలు మార్కెట్ కోసం నందిపేట్‌కు వస్తున్నారు. ఆ ప్రాంతాల నుంచి నందిపేట్ రోజు ఐదారు ట్రిప్పుల బస్సుల్లో జనం కిక్కిరిసిపోయి ప్రయాణం చేస్తున్నారు. అలాగే తల్వేద వాగుపై నిర్మించిన వంతెన ద్వారా నవీపేట్ మండలంలోని నాళేశ్వర్, తుంగిని, బినోలతో పాటు చుట్టుపక్కల ఐదారు గ్రామాల నుంచి జనం నందిపేట్‌కు వస్తున్నారు. ఇలా 30 ఏండ్ల కన్నా రెట్టింపుస్థాయిలో జనం తాకిడి నందిపేట్‌కు పెరిగింది. సుమారు 60 గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న నందిపేట్‌లో డిపో ఏర్పాటైతే ఆర్టీసీకి ఎంతో లాభం చేకూరుతుంది. కనీసం నందిపేట్ నుంచి హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఇక్కడివారు ఆర్మూర్ లేదా నిజామాబాద్‌కు వెళ్లి హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తున్నది.
నందిపేట్‌లో బస్సు డిపో ఏర్పాటు చేస్తే పట్టణానికి ప్రజల రాకపోకలు ఇంకా పెరుగుతాయి. ఇక్కడ మార్కెట్ కూడా పెరుగుతుంది. వ్యాపారులకు కలిసివస్తుంది. ఆర్టీసీకి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
– చేపూర్ లింబాద్రి, వ్యాపారి, నందిపేట్
నందిపేట్‌లో బస్సు డిపో ఏర్పాటైతే హైదరాబాద్, నిర్మల్, భైంసా, బోధన్, నాందేడ్ ప్రాంతాలకు నేరుగా ఇక్కడి నుంచి బస్సులు నడపవచ్చు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు నేరుగా బస్సులు లేకపోవడంతో ట్యాక్సీలను అద్దెకు తీసుకొని వెళ్తున్నారు.
– పిప్పెర శ్రీను, రైతు, బజార్ కొత్తూర్