ధనుర్మాసం, సంక్రాంతి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయాలంటారు. దీని వెనుక ఉద్దేశం ఏమిటి?
ప్రసన్న, కొత్తపేట
ప్రాణికోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ, వెలుగును అనుగ్రహించే దైవం సూర్యుడు. ఈ సృష్టి మనుగడకు ఆయనే మూల కారకుడు. దివాకరుడికి స్వాగతం పలుకుతూ చేసుకునేదే సంక్రాంతి పండుగ. ధనుర్మాసం నుంచి సంక్రాంతి శోభ మొదలవుతుంది. దక్షిణాయనం, ఉత్తరాయణం సంధికాలం ఈ ధనుర్మాసం. రానున్న ఉత్తరాయణ పుణ్య కాలానికి ఆరంభ సూచకంగా, ప్రత్యక్ష నారాయణుడికి ఆహ్వానం పలుకుతూ ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే సంప్రదాయం ఏర్పడింది. తొలి సంధ్య వేళలో లేలేత సూర్యకిరణాలు వాకిట్లో విస్తృతంగా ప్రసరిస్తాయి. ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యశక్తి లభిస్తుంది. అంతేకాదు, నడుం వంచుతూ, కూర్చుంటూ, లేస్తూ, చేతులు ఆడిస్తూ ముగ్గు పెట్టేక్రమంలో శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది.
ముఖ్యంగా చలి అధికంగా ఉండే ధనుర్మాసంలో సూర్యకాంతి చాలా అవసరం. ఈ మేరకు సంక్రాంతి వేళ ముగ్గులు పెట్టే సంప్రదాయం తప్పనిసరి చేశారు మన పెద్దలు. ముంగిలిని నిర్మల ఆకాశానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గుకోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా, వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు. ముగ్గు కేంద్రకాన్ని సూర్యుడికి సంకేతంగా చెబుతారు. సంక్రాంతి నాడు సూర్యభగవానుణ్ని ఆహ్వానిస్తూ రథం ముగ్గును విధిగా వేస్తారు. ఇలా ముగ్గుల వెనుక ప్రాధాన్యాన్ని తెలియజేశారు మన పెద్దలు. అంతేకాదు, వాకిట్లో పేడనీళ్లతో చల్లే కళ్లాపి క్రిమికీటకాలకు విరుగుడుగా పని చేస్తుంది. ముగ్గుపిండి కూడా అందుకు తోడ్పడుతుంది.