సిద్దిపేట, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుతోపాటు ఘనపూర్ (వనదుర్గా ప్రాజెక్టు)కు క్రాప్‌హాలిడే ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపుగా 80 వేల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
సింగూరు కింద సంగారెడ్డి జిల్లాలో 40 వేల ఎకరాలు, సింగూరు నుంచి ఘణపుర్ ఆనకట్టకు వచ్చే నీటితో మరో 40 వేల ఎకరాలు సాగవుతుంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సాగు, తాగునీటికి ఈ నీటిని వినియోగిస్తారు. హైదరాబాద్ తాగునీటిని ఇక్కడి నుంచే పంప్ చేస్తారు. ప్రస్తుతం క్రాప్ హలీడే ప్రకటించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నారు.
కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. 2014 డిసెంబర్ 17న ఘనపూర్ ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. కాలువల ఆధునీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపునకు వినియోగించారు. ప్రాజెక్టును వనదుర్గ ప్రాజెక్టుగా మార్చారు. సింగూరు ప్రాజెక్టు నీటిని ఉమ్మడి మెదక్, నిజమాబాద్ జిల్లాలకు కేటాయించారు. ప్రస్తుతం ఘనపూర్ ఆనకట్ట నుండి యాసంగికి సాగు నీరు విడుదల చేయబోమని నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
సింగూరు ప్రాజెక్టు మరమ్మతులతో కామారెడ్డి జిల్లాతోపాటు నిజామాబాద్ జిల్లాకు తాగునీటి తిప్పలు తప్పవు. ప్రధానంగా జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 21 మండలాల్లోని 819 గ్రామాలకు నీటి ఎద్దడి తప్పదు. సింగూరు ద్వారా హైదరాబాద్‌కు 6.96 టీఎంసీలు, మిషన్ భగీరథ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు 5.70 టీఎంసీల తాగునీటిని వినియోగిస్తారు. సింగూరు ఖాళీ చేస్తుండటంతో సమస్య పెరగనున్నది.
నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. కాలువ నీళ్లు వస్తే ఈ యాసంగి 4 ఎకరాలు నాటేసేటోడిని. కాలువ రాక బోరు దగ్గర రెండు ఎకరాలు వేస్తున్న. ఇంకో రెండు ఎకరాలు బీడే ఉంటది. శివారు మీద చాలా భూములు బీడు ఉంటున్నయి. నీళ్లు ఇస్తలేరు కాబట్టి.. ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలె.
-అకెం నరసింహులు, రైతు, కిష్టాపూర్, మెదక్ జిల్లా
నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. కాలువ వస్తదేమో అంటే నీళ్లు విడువం అంటున్నరు. రెండు ఎకరాలు బీడు పెడుతున్న. కాలువ వస్తే యాసంగి, ఆనకాలం వేస్తుంటి. ఇప్పుడు కాలం మంచిగా అయినా కూడా నీళ్లు రావని చెప్పేసరికి బీడు వెడుతున్న. బోర్లు ఉన్న కాడ జరంత తప్ప, భూములు అంతట బీడే ఉంటయి. ప్రభుత్వమే ఏమన్న పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
-కిష్టయ్య, రైతు, కిష్టాపూర్, మెదక్ జిల్లా