హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. ఈ పథకంలో కోత పెట్టేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. ఒక కోర్సులో ఎన్ని సీట్లున్నా 240 సీట్లకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మిగతా సీట్లలో చేరిన వారు సొంతంగా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒక కాలేజీలో ఏ క్యాటగిరీ, బీ క్యాటగిరీ సీట్లుండగా, తాజాగా మరో కొత్త క్యాటగిరీ పుట్టుకు రానున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి తేవాలని భావించింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో రేషనలైజేషన్ అమలు చేస్తామని సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ రేషనలైజేషన్ అంతరార్థం ఇదేనని కాలేజీల యాజమాన్యాలూ పేర్కొంటున్నాయి. ఈ విధానంతో సర్కారుపై పడే ఫీజు రీయింబర్స్మెంట్ భారం 50% తగ్గుతుందని అంచనా. ఇప్పటివరకు ఏటా రూ.2,400 కోట్ల భారం సర్కారుపై పడుతుండగా, ఈ విధానంతో భారం రూ.1,200 కోట్లకు తగ్గనుందని తెలిసింది. మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ భారం నుంచి బయట పడేందుకే ఈ విధానాన్ని సర్కారు ముందుకు తెచ్చిందని కాలేజీల యజమాన్యాలు చెప్తున్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ కోర్సులో 1,350 సీట్లున్నాయి. ప్రస్తుతం మొత్తం సీట్లుకు ఫీజు రీయింబర్స్మెంట్ సర్కారే చెల్లిస్తున్నది. నూతన విధానం అమల్లోకి వస్తే సీఎస్ఈలో 240 సీట్లకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది. మిగతా 1,110 సీట్లకు వర్తించదు. ఈ కోర్సుల్లో చేరిన వారే మొత్తం ఫీజులను ఆ కళాశాలకు చెల్లించాలి.
ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని మరో కాలేజీలో కన్వీనర్ కోటాలో 1,100 సీట్లున్నాయి. ఈ కాలేజీలోనూ 240 సీట్లకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. మిగతా 860 సీట్లల్లో చేరిన విద్యార్థులే ఫీజులు సొంతంగా చెల్లించాలి.
ఫీజు రీయింబర్స్మెంట్ రేషనలైజేషన్ కోసం సర్కారు ఈ వారంలోనే ఓ కమిటీని వేయనున్నది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ సెక్రటరీ, సాంకేతిక విద్య కమిషనర్, ఆరుగురు కళాశాలల ప్రతినిధులతో ఈ కమిటీ వేయనున్నట్టు సమాచారం. ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి విద్యాసంస్కరణల క్యాబినెట్ సబ్ కమిటీకి, ప్రభుత్వానికి నివేదికను అందజేస్తుంది. దీనిని సర్కారు ఆమోదిస్తే కొత్త ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులోకి వస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నూతన పద్ధతిని అమలు చేయాలన్న యోచనలో సర్కారు వర్గాలున్నాయి.
రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలకు సర్కారు ఇస్తామన్న రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎలా పంపిణీ చేయాలన్న ప్రశ్న తలెత్తింది. ఇది అంతిమంగా పంపకాల పంచాయితీకి దారితీసింది. రూ.200 కోట్లు తమకే ఇవ్వాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రధాన వాటా తమకే కేటాయించాలని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. తమ సంగతేమిటని బీఈడీ, నర్సింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు సమానంగా పంచితే ఒక్కో కాలేజీకి రూ.5-7 లక్షలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. ఇదిలా ఉంటే కొన్ని కాలేజీలు ఎక్కువ మొత్తం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం తెలిసిన మరికొన్ని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇంత మాత్రం దానికేనా? ఇందుకోసమేనా? బంద్‌కు పిలుపునిచ్చింది అంటూ ఓ ప్రైవేట్ కాలేజీ కరస్పాండెంట్ తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. నిరవధిక బంద్ విరమించకుండా ఉండాల్సిందని ఆయనఅభిప్రాయపడ్డారు.