హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజలను మోసగిస్తున్నట్టు మరోసారి రుజువైంది. ‘ఇదీ మీ ప్రజాప్రభుత్వం. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటం. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన 44 మంది తెలంగాణవాసుల కుటుంబాలకు అండగా నిలిచినం. ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించినం’ అంటూ ఫిబ్రవరి 28న బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు అబద్ధమని తేలిపోయింది. మృతులు/క్షతగాత్రుల్లో కేవలం 29 మందికి సంబంధించిన చెక్కులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నది. మిగిలిన వారికి సంబంధించిన పరిహారం చెల్లించకుండా అరిగోసపెడుతున్నది.
మదీనాలో 2025 నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 44 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో యాత్రికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల్లో 18 మంది హైదరాబాద్ విద్యానగర్‌లోని నసీరుద్దీన్ కుటుంబానికి చెందినవారు ఉన్నారు. దీంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి గత ఫిబ్రవరి 28న మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి మృతుల కుటుంబీకులకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ, మృతులు/క్షతగాత్రుల్లో 29 మందికి సంబంధించిన చెక్కులు మాత్రమే పంపిణీ చేశారు. నసీరుద్దీన్ కుటుంబంలో ఆయన బిడ్డ, మనుమడికి సంబంధించిన పరిహార చెక్కులు మాత్రమే అందజేశారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ అధికారులు తమ కుటుంబంలోని మిగిలిన 16 మంది మృతులకు సంబంధించిన రూ.85 లక్షల పరిహారం చెల్లించలేదని, సీఎం చెక్కులు పంపిణీ చేసిన రోజు తనను కనీసం ఆ వేదిక వద్దకు కూడా రానీయకుండా అడ్డుకున్నారని నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ తెలిపారు. ఆ పరిహారంపై తొలుత తహసీల్దార్ నుంచి నివేదిక అందలేదని చెప్పిన ఇన్చార్జి ఆర్డీవో.. ఇప్పుడు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నారని వాపోయారు. పరిహారం కో సం 3 నెలలుగా తిరుగుతున్నా ఇప్పుడు, అ ప్పుడని చెప్పడమే తప్ప చెక్కులు మాత్రం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్స్‌గ్రేషియా చెక్కులు ఇవ్వకుండా ఇన్చార్జి ఆర్డీవో రామకృష్ణ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, లేనిపోని సాకులు చెబుతున్నారని సిరాజుద్దీన్ వాపోయారు. దీంతో న్యాయం కోసం ఈ నెల 5న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామని తెలిపారు. పరిహార చెక్కులు ఇవ్వకుండా హజ్ కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అన్ని వివరాలు అందజేసినా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని సిరాజుద్దీన్ కోరారు.
మదీనా బస్సు ప్రమాదంలో మృతులందరికీ సంబంధించిన పరిహారం చెల్లించామని పదేపదే చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ నెల 4న హజ్ యాత్రికుల వాహన శ్రేణి ప్రారంభోత్సవ సందర్భంలోనూ ఆ విషయాన్ని ఉటంకించారు. కానీ, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా సిరాజుద్దీన్‌కు లభించిన సమాచారంతో రేవంత్‌రెడ్డి సర్కార్ డొల్లతనం బట్టబయలైంది. మృతులు/క్షతగాత్రుల్లో కేవలం 29 మందికే రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ మృతులు/క్షతగాత్రులందరికీ పరిహారం అందజేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడంపై సిరాజుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.