(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పది గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని దివాలా దిశగా పరుగులు పెట్టిస్తున్నది. హామీల అమలు పేరిట ఇప్పటికే కొత్త అప్పులు, పింఛనర్ల సంక్షేమ నిధి డబ్బులను వాడుకొన్న సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు.. ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా నానా యాతన పడుతున్నది. ఒకటో తారీఖు వచ్చి మూడునాలుగు రోజులు గడిచినప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు జమ కాలేదని జాతీయ మీడియా ‘టైమ్స్‌నౌ’ ఓ కథనంలో వెల్లడించింది. ఖజానా ఖాళీ కావడమే దీనికి కారణంగా తెలిపింది. జీతాలు ఆలస్యమవుతాయన్న కనీస ప్రకటనను కూడా సుఖు సర్కారు చేయకపోవడాన్ని ఎండగట్టింది. వేతనాల ఆలస్యంతో దాదాపు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్టు వివరించింది.
పండుగ సీజన్లో కష్టం
ఈ వారం నుంచే పండుగల సీజన్ మొదలవుతున్నదని, జీతాలు పడకపోతే కుటుంబంతో పండుగలను ఎలా జరుపుకోవాలంటూ పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు విడుదల చేయకుండా సుఖు సర్కారు జాప్యం చేయడంపై మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు ఆర్థికంగా కుదేలయ్యేలా చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పే ‘ఖటాఖట్’ ఉచితాల వల్లే రాష్ర్టానికి ఈ పరిస్థితి దాపురించిందని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ ఆరోపించారు. కాగా, దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ర్టం అప్పు రూ.86,589 కోట్లకు చేరింది.
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు పింఛన్లు కట్ బిల్లు ప్రవేశపెట్టిన హిమాచల్ కాంగ్రెస్ సర్కారు
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్లు నిలిపివేయాలని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ దక్కదు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో వారిపై అనర్హత వేటు పడింది. వీరి పింఛన్లను నిలిపివేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది.
జీతాలు జమ చెయ్యాలి
నిత్యావసర ధరలు పెరిగాయి. పైగా పండుగల సీజన్ వచ్చింది. ఇలాంటి సమయంలో సమయానికి జీతాలు వేయకుంటే కుటుంబంతో ఎలా బతుకుతాం. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల వేతనాలను విడుదల చేయాలి.
– కుమార్ దాస్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ కన్వీనర్