న్యూఢిల్ల్లీ, సెప్టెంబర్ 10 /(స్పెషల్ టాస్క్ బ్యూరో): ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది. దేశంలో మొట్టమొదటిసారి ఉద్యోగుల జీతాలను తగ్గించే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఈ మేరకు శనివారం జీవోను జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై సర్కారీ ఉద్యోగులు భగ్గుమన్నారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని, అంతేగానీ, తమ జీతాల్లో కోత పెట్టే అధికారం ఎవరు ఇచ్చారని ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కారు జీవోను వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రకటించింది.
అసలేం జరిగింది?
విధానపరమైన లోపాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడం, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లేకపోవడంతో కంపెనీలు, పెట్టుబడులు ఇతర రాష్ర్టాలకు తరలిపోవడం, అవినీతి, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని ప్రజాగ్రహం పెరుగడం, అప్పటికే పెరిగిన అప్పులు వెరసి హిమాచల్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. కొత్త అప్పులు ఎక్కడా పుట్టకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లించలేని దుస్థితికి సుఖు ప్రభుత్వం దిగజారిపోయింది. దీంతో సర్కారీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని వింత నిర్ణయాన్ని తీసుకొన్నది. ఈ మేరకు గత శనివారం హిమాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీసెస్(రివైజ్డ్ పే) రెండవ సవరణ నిబంధనలు-2025 కింద రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. 89 క్యాటగిరీలకు చెందిన 14,000 మంది ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ ఆ జీవోలో నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరి 3న చేర్చిన 7ఏ సెక్షన్ నిబంధనను తొలగిస్తూ ఈ సవరణ చేసింది. ఉద్యోగుల జీతాలు తగ్గించడం ద్వారా ఏటా రూ. 100 కోట్లు ఆదా చేయవచ్చని భావించింది.
గరిష్ఠంగా 15 వేలు కోత
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఒక్కో ఉద్యోగి తన వేతనంలో కనిష్ఠంగా రూ. 5,000 నుంచి గరిష్ఠంగా రూ. 15,000 వరకు ప్రతినెలా కోల్పోవలసి ఉంటుంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమన్నారు. నోటిఫికేషన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని, అంతేగానీ, తమ జీతాల్లో కోత పెట్టే అధికారం ఎవరు ఇచ్చారని ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో ఉద్యోగుల ఆగ్రహజ్వాలలకు భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకొన్నది.
ఉద్యోగుల జీతాలు తగ్గించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల సమస్యలను, నిరుద్యోగ యువజనుల సమస్యను ఎంతమాత్రం పరిష్కరించలేకపోయిందని మండిపడ్డారు. సర్కారు నిర్ణయంపై సోషల్మీడియాలో నెటిజన్లు పెద్దయెత్తున విమర్శలు వ్యక్తం చేశారు.
అప్పుల ఊబిలో హిమాచల్
10 గ్యారెంటీల పేరిట ఓటర్లకు అరచేతిలో స్వర్గాన్ని చూయించి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తర్వాత గ్యారెంటీల అమలును అటకెక్కించింది. అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వం.. రాష్ర్టాభివృద్ధిని పక్కనబెట్టింది. గడిచిన మూడేండ్ల పాలనలో ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసింది. రాష్ట్ర అప్పులపై గత నెల వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కాగ్ ఓ సమగ్ర నివేదికను బయటపెట్టింది. రాష్ట్రం మొత్తం అప్పు రూ.95,633 కోట్లకు చేరుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం విధించిన పరిధి రూ.90,000 కోట్లు కాగా దాన్ని మించిపోయి రాష్ట్రం అప్పులు చేసిందని హెచ్చరించింది. 2023-24 సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 6,342 కోట్ల వరకు రుణాలు తీసుకొనే అవకాశం ఉంటే, సుఖు ప్రభుత్వం మాత్రం రూ. 9,043 కోట్ల రుణాలు తీసుకొన్నదని కాగ్ వెల్లడించింది.
మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
వచ్చే జీతాలను బట్టే పిల్లల స్కూలు ఫీజులు, రుణ వాయిదాల ఖర్చులను ఉద్యోగులు ప్లాన్ చేసుకొంటారు. జీతాల్లో కోత విధిస్తే, వారి జీవితాలే తలకిందులైపోతాయి. ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలను మళ్లీ చేయవద్దు.
– ఫెడరేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సంజీవ్ శర్మ.
నెక్స్తెలంగాణ??
హిమాచల్లో 10 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరిట ఓటర్లను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీల అమలును పక్కనబెట్టింది. పైగా నిరుద్యోగ సమస్యను, రైతుల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యింది. రాజకీయ, ఆర్థిక సమస్యలతో ఒకవైపు కర్ణాటక అతలాకుతలమవుతుంటే, తెలంగాణలో యూరియా కష్టాలతో రైతులు, ఎగ్జామ్స్లలో అవకతవకలతో యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలనాపరమైన అవినీతి, రియల్ ఎస్టేట్ పతనం, కంపెనీలు, పెట్టుబడులు తరలివెళ్లిపోవడం రాష్ట్ర ఆర్థికాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. గత 20 నెలల్లోనే రేవంత్ ప్రభుత్వం రూ. 2.2 లక్షల కోట్లు అ ప్పు చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి. ‘హిమాచల్ బాటలోనే తెల ంగాణ కూడా పయనిస్తున్నదా? అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.