హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో సెలూన్లు, లాండ్రీలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లు బకాయిలు రూ.260 కోట్లకు చేరాయి. ఒక్కో షాపుకు సగటున మీటర్ బిల్లు రూ.30 వేలు మించిపోయింది. దీంతో విద్యుత్తు అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. కనెక్షన్లను తొలగిస్తున్నారు. మరోవైపు కిరాయి భవనాల్లో షాపులను నిర్వహిస్తున్న లబ్ధిదారులకు సదరు భవన యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. బిల్లు కట్టండి లేదంటే ఖాళీ చేయండి అంటూ హుకుం జారీచేస్తున్నారు. వెరసి రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణులు, రజకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. షాపులను మరో చోటికి మార్చుకుంటే మీటర్లను మార్చి కనెక్షన్ ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. సర్కాkH తీరుతో 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం ఉత్త ముచ్చటగానే మారిపోయింది.
రూ.260 కోట్లు పెండింగ్..అధికారుల వేధింపులు..
అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులు, రజకులకు ఆర్థికంగా చేయూతనందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని తీసుకొచ్చింది. 2021 ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతున్న ఈ పథకం కింద 71 వేల మంది రజకులు, 36 వేల మంది నాయీబ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు కమర్షియల్ విద్యుత్తు కనెక్షన్లను సైతం ప్రభుత్వం అందించింది. ఎన్నికల ముందు ఈ పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఉచిత విద్యుత్తుకు సంబంధించి వాషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్‌కు నిరుడు బడ్జెట్ రూ.150 కోట్లను, నాయీబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా చెల్లించలేదు. మొత్తంగా రెండు సొసైటీలకు కలిపి ప్రస్తుతం రూ.260 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.
భవన యజమానుల ఒత్తిడి..
పట్టణాల్లో సెలూన్లు అత్యధికంగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కాగా ఉచిత విద్యుత్తు పథకం కోసం ప్రత్యేకంగా మీటర్ తీసుకునేందుకు భవన యజమానులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో గత బీఆర్ఎస్ సర్కార్ అద్దె భవనాలకు సంబంధించిన మీటర్లను వారికి అందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతినెలా 250 యూనిట్ల విద్యుత్తు వినియోగానికి అయ్యే బిల్లును విద్యుత్తు బిల్లులో సబ్సిడీ కింద మినహాయించేది. 250 యూనిట్లకు మించి వాడితేనే బిల్లు జారీచేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. 250 యూనిట్లకు సంబంధించిన చార్జీని బిల్లులో సబ్సిడీగా చూపుతున్నారు తప్ప, ఆ మొత్తాన్ని ప్రధాన బిల్లు నుంచి మాత్రం మినహాయించడం లేదు. గత 24 నెలలుగా ఇదే పరిస్థితి. దీంతో ఒక్కో మీటర్‌పై సగటును రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నట్టు చూపుతున్నది. దీంతో బిల్డింగ్ యజమానులు సెలూన్ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు కట్టండి? లేదా షాపులు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారు. మరోవైపు విద్యుత్తు అధికారులు సైతం బిల్లు కట్టాలంటూ వేధిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. లేదంటే కరెంట్ కనెక్షన్లను కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కనెక్షన్లు నిల్
గతంలో లబ్ధిదారుడు తన యూనిట్‌ను మూసివేసినా, షాపును వేరే ప్రాంతానికి తరలించినా ఆ విషయాన్ని బీసీ సంక్షేమశాఖకు, తెలంగాణ డిస్కమ్స్‌కు తెలియజేసి, కొత్తగా మారిన చోట మీటర్ కనెక్షన్‌ను పొందే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం విద్యుత్తు అధికారులు షాపుల అడ్రస్‌లను మార్చుకున్న లబ్ధిదారులకు కొత్త కనెక్షన్లను ఇవ్వని దుస్థితి నెలకొన్నది. అధికారుల తీరుతో ఉచిత విద్యుత్తుకు దూరమవుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేవారు. కానీ ప్రభుత్వం ఆ సైట్‌నే రద్దు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో మాదిరిగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
తక్షణం బిల్లుల బకాయిలు చెల్లించాలి
నాయీబ్రాహ్మణులు, రజకులకు గత ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది. ఆ పథకాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. బకాయిలను చెల్లించడమే లేదు. మీటర్లపై కరెంటు బిల్లులు పెరిగిపోవడంతో కిరాయి భవనాల్లో కొనసాగుతున్న షాపులపై యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఖాళీ చేయాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. మరోవైపు బకాయిలు పెరగడంతో విద్యుత్తు అధికారులు మీటర్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. కొత్త కనెక్షన్లను కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించాలి. బకాయి బిల్లులను చెల్లించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. మున్సిపల్ ఎన్నికల్లో మా తడాఖా చూపుతాం.
-రాచమల్ల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ నాయీ బ్రాహ్మణ సంఘం