హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): ‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు విషయంలో ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి. 2024లోనే బిల్లు పార్లమెంట్లో ఆమో దం పొందినా.. మనువాద బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నది. ఇంకెంతకాలం దేశంలోని మహిళా లోకాన్ని మోసం చేస్తారు’ అని మాజీ ఎంపీ, ఐద్వా (అఖిల భారత ప్రజాతం త్ర మహిళా సంఘం జాతీయ ప్యాట్రన్ బృం దాకరత్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆదివా రం ఐద్వా 14వ జాతీయ మహాసభలు ప్రా రంభమయ్యాయి. తొలిరోజున ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద ఉన్న బస్‌భవన్ ప్రాంతంలో జరిగిన బహిరంగసభలో బృందాకరత్ మాట్లాడారు. మహిళలపై హింస, అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులే చట్టసభల్లో ప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని, అలాంటి వారు బీజేపీలోనే అధిక సంఖ్యలో ఉన్నారని ఆరోపించారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉం టుందని స్పష్టంచేశారు. దేశంలో ఏటా7,000 మంది హిందూ మహిళలు వరకట్నాలకు బలవుతున్నారని, వారి గురించి ఆర్ఎస్ఎస్, బీజే పీ ఎందుకు మాట్లాడటం లేదని ప్ర శ్నించారు.
మహిళలపై పెరిగిన హింస: పీకే శ్రీమతి
సంఘ్‌పరివార్ పాలనలో దేశంలో మహిళ లు, చిన్నారులపై దాడులు అధికమయ్యాయ ని ఐద్వా అఖిలభారత అధ్యక్షురాలు పీకే శ్రీమతి ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలను అణచివేయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్రలను సంఘటిత శక్తితో మహిళాలోకం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్ఆర్పీ, సీఏఏ విఫలమవడంతో ఇప్పుడు ‘ఎస్ఐఆర్’ ముసుగులో పేదలు, మహిళల ఓట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేస్తున్నదని ఆరోపించారు.
మనువాదంపై తెలంగాణ నుంచే యుద్ధం: మల్లు లక్ష్మి
మనువాదులు మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తెలంగాణ నుంచే మనువాదంపై యుద్ధం మొదలు పెడుతున్నామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.2,500, వ్యవసాయ కార్మికులకు ఏటా రూ.12 వేలు హామీలను అమ లు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐద్వా ఐక్యపోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ పోరాటాలకు పెట్టింది పేరని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి తెలిపారు.
పోరాటాలే సమానత్వానికి మార్గం:సినీనటి రోహిణి
మహిళలు పోరాటాల ద్వారానే సమానత్వాన్ని సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, సినీనటి ఎం రోహిణి అభిప్రాయపడ్డా రు. ముందు మన ఇంటి నుంచే అభ్యుదయం తో కూడిన సమానత్వం ప్రారంభం కావాలని, మార్పును ఆహ్వానించాలని సూచించా రు. ఐద్వా మహాసభల్లో ఆమె మాట్లాడారు. కుటుంబాలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యతను మహిళలే తమ భుజసందాలపై వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రారంభ సదస్సులో ఐద్వా మహాసభల ఆహ్వాన సంఘం చైర్పర్సన్ శాంతాసిన్హా, ఐద్వా ప్రధాన కార్యదర్శి ధావలే పాల్గొన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే మహిళల వెనుకబాటు: జూలకంటి
పాలకుల నిర్లక్ష్యమే మహిళల వెనుకబాటుకు ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే, ఐద్వా జాతీయ మహాసభల రిసెప్షన్ కమిటీ గౌరవాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పురుషుల కన్నా ఎకువ శ్రమచేస్తూ గుర్తింపు లేక, అసమాతలకు గురవుతున్న మహిళలు సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు