సిటీబ్యూరో : మహా నగరాన్ని ముంచెత్తుతున్న ముంపు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్ వరదలకు ఒక్క మూసీనే కారణమని అంటోంది. గల్లీకో నాలా.. ఇంచుకో ఆక్రమణ.. విస్మరించిన చెరువుల సుందరీకరణ , నాలాల అభివృద్ధి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మూసీ పునరుజ్జీవనంతో అర్బన్ ఫ్లడ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతున్నది.
కేవలం మూసీ నదిని బాగు చేస్తేనే హైదరాబాద్ మహానగరానికి వరద గండం తప్పుతుందంటూ మభ్యపెడుతున్నది. శుక్రవారం మూసీ ప్రజెంటేషన్ సందర్భంగా 2020 వరదలకు 50 మంది.. ఆ తర్వాత 2025 వరదల్లో ఇద్దరు చనిపోయినట్లు వెల్లడించారు. ఇద్దరు గల్లంతు కాగా..వీరంతా నాలాల్లో పడి చనిపోయినట్లు చెప్పారు. వాస్తవంగా ఏమిటంటే నాలా వరద ప్రవాహ ప్రమాదాలే తప్ప.. ఏ ఒక్కరూ మూసీలో పడి చనిపోలేదు. మూసీ వరదల వల్లే ఇప్పటివరకు చనిపోయినట్లు దాఖలాలు లేవు. కానీ వరదల ప్రాణనష్టాన్ని మూసీకి ఆపాదిస్తున్న కాంగ్రెస్ తీరు విస్మయానికి గురి చేస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం పనులను కాంగ్రెస్ సరారు అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికి వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని ప్రధాన నాలాల్లో పూడిక తీయకపోవడంతో గతేడాది కురిసిన వర్షాలకు కాలనీలు చెరువులను తలపించాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 1.5 లక్షల కోట్ల అంచనాతో చేపట్టే మూసీ రివర్ ఫ్రంట్ చుట్టూనే కథ నడిపిస్తోంది.
‘మూసీ బాగుంటే నగరం మునగదు’ అనే అర్థం లేని లాజికును తెరపైకి తెచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నగర వాసులు మండిపడుతున్నారు. కేవలం ఏఐ డిజిటల్ మ్యాపులు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రాజెక్టు వల్ల ఏదో అద్భుతం జరిగిపోతుందన్నట్లు మూసీ ప్రజెంటేషన్‌లో చిత్రీకరించారు. కానీ అర్బన్ ఫ్లడింగ్కు ప్రధాన కారణమైన ఇంటర్నల్ నాలా, వరద నీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణపై మాత్రం మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు.
నాలాల వెడల్పు, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో పైపులైన్ల నిర్మాణం వంటి కీలక అంశాలను పకనబెట్టి, కేవలం బ్యూటిఫికేషన్ పేరుతో హడావుడి చేయడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. మహానగర ప్రజలను వరద భయం వెంటాడుతుంటే, ప్రభుత్వం మాత్రం కేవలం మూసీ పునరుజ్జీవం ద్వారానే అన్నీ చకబడతాయని నమ్మబలకడం చూస్తుంటే.. ‘వ్యాధి ఒకటైతే.. మందు మరొకటి’ అన్నట్లుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మూసీ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ -11 పనులు చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై పౌర సమాజం భగ్గుమన్నది. ఎలాంటి ప్రణాళికలు లేకుండా రెండేండ్ల కింద ఫేజ్-3లో చేపట్టిన కూల్చివేతల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో ఫేజ్ 3లోని మూసానగర్, శంకర్ నగర్ నిరుపేదలను మొదటి టార్గెట్‌గా అత్యవసరం లేకున్నా.. ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న గూడులను 2024 అక్టోబర్‌లో దయనీయంగా కూల్చేశారు.
అప్పటికీ మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై ఎలాంటి డీపీఆర్ లేదు. అక్కడి ప్రజల ఆమోదం ఏ మాత్రం తీసుకోలేదు. ఇష్టానుసారంగా రేవంత్ సర్కార్ రెండేండ్ల కిందట నిరుపేదలను బలవంతంగా కట్టుబట్టలతో బయటకు పంపించింది. చిన్నారులు తమ ఇండ్లను కూల్చివేయొద్దంటూ వేడుకున్నా.. కనికరం లేకుండా జేసీబీలు, సుత్తెలు, రాడ్లు, గడ్డపారలతో నివాసాలను బద్దలు కొట్టి నేల మట్టం చేయించారు.
మూసీ ప్రాజెక్టు అభివృద్ధిని 5 జోన్లుగా విభజించిన ప్రభుత్వం మొదటి రెండు జోన్లను వదిలేసి కేవలం జోన్-3లోనే కూల్చివేతలు చేయడంపై పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఫేజ్ -1లో మొత్తం సుమారు 21 కిలో మీటర్లు ఉంది. ఫేజ్- 2లో 6 కిలోమీటర్లు, ఫేజ్ 3లో 4 కిలో మీటర్లు, 5లో 8 కిలో మీటర్లతో మొత్తం 55 కిలో మీటర్ల మేర మూసీ మిగతా IVవ పేజీలో
సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ):సరిగ్గా వందేండ్ల తర్వాత అక్టోబర్ 2020లో కురిసిన కుండపోత వర్షాలు, అందులో గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాతంతో గ్రేటర్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఇండ్లు, కాలనీలలో వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు బతుకుజీవుడా అంటూ జీవనం సాగించారు. దాదాపు 40వేల కుటుంబాలు అల్లాడిపోయాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో వరుణుడి బీభత్సం తర్వాత సమగ్ర అధ్యయనం చేసి… వరద నీటికి శాశ్వత చర్యలు చేపట్టాలని భావించింది. ఎస్ఎన్డీపీ తొలి విడత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులకు చేపట్టి..రూ.531కోట్లతో 29 ప్రాంతాలలో వేలాది కాలనీల వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది.
తద్వారా 150 కాలనీలను వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపింది. 43 కిలోమీటర్ల పనుల పూర్తితో 5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. కానీ ఘనత వహించిన కాంగ్రెస్ సర్కారు ఎస్ఎన్డీపీ పనుల పురోగతితో పాటు రెండవ దశ ఎస్ఎన్డీపీలను కనీసం ఒక్క చోట కూడ పూర్తి చేయలేకపోయింది. సౌత్ ఏషియన్ నగరాల్లో 2050 వరకు 40 శాతం వర్షపాతం పెరుగుతుందని, మూసీ పునరుజ్జీవనం తప్పనిసరి అంటున్న సర్కారు..మూసీతో పాటు అసలు వరదలకు కారణమవుతున్న నగర మౌలిక వసతుల కల్పనలో ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు వెయ్యి సరస్సుల నగరంగా వెలుగొందని హైదరాబాద్, నేడు రెండు సెంటీమీటర్ల వర్షానికే వరదల నగరంగా మారుతోంది. వాన నీరు బయటకు వెళ్లే దారి లేక, రోడ్లపైనే నిలిచిపోయి కాలనీలను ముంచెత్తడాన్ని అర్బన్ ఫ్లడింగ్ అంటారు. ఇది ప్రకృతి వైపరీత్యం కంటే ఎక్కువగా మానవ తప్పిదాల వల్లే సంభవిస్తోంది. వాస్తవానికి అర్బన్ ఫ్లడ్ ఎందుకు వస్తుందంటే నగరాల్లో భూమి మొత్తం సిమెంట్ రోడ్లు, భవనాలతో నిండిపోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం ఉండదు. పల్లెల్లో 80శాతం నీరు భూమి పీల్చుకుంటే నగరాల్లో 90 శాతం నీరు ఉపరితలంపైనే ప్రవహిస్తుంది.
ఈ నీరు బయటకు వెళ్లాలంటే పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. కానీ హైదరాబాద్‌లో గడిచిన రెండేండ్లుగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేస్తున్న దాఖలాలు లేవు..చెరువుల ఆక్రమణలు, నాలాల అక్రమణలు, శివారు పురపాలికల్లో డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ లేదు. ముఖ్యంగా ఎస్ఎన్డీపీ పనులకు మంగళం పాడింది. నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలు, ఓపెన్ స్పేస్‌లను పెంచాలన్న ధ్యాస లేదు. అన్నింటి కంటే మించి నాలాల్లోకి వ్యర్థాలను , పూడికతీత పనులను సక్రమంగా చేపట్టడం లేదు.