నిజామాబాద్, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో విధంగా పాకులాడుతోంది. కర్షకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లుగా భారీగా ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అందుతోన్న సాయం ఇసుమంతైనా ఉండటం లేదు. రైతుభరోసా, ఆత్మీయ భరోసా, యూరియా సరఫరా, విత్తనాల పంపిణీ, పంటల కొనుగోళ్లు ఇలా ఏ ప్రక్రియ సవ్యంగా జరగడం లేదు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా ముందుకు సాగిన రైతు అనుకూల కార్యక్రమాలు ఇప్పుడు గందరగోళంలోకి నెట్టి వేయబడింది. సమయానికి అందని యూరియా, విత్తనాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగకపోవడంతో ఇక్కట్ల పాలవుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం సమయానికి రావడం లేదు. ప్రతి సీజన్లో ఒక్కో విధమైన విధానాలతో పెట్టుబడి సాయం అమలు చేస్తున్నారు. 2026 యాసంగిలో కేవలం ప్రతి రైతుకు రెండు ఎకరాల్లోపే సాయం చేశారు. వానాకాలంలో అందరికీ రైతుభరోసా అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు యాసంగి పంట కాలాలు ముగిశాయి. వడ్లకు బోనస్ రూపంలో రూ.500 ఇస్తామని మేనిఫెస్టోలో అధికార పార్టీ పెట్టింది. మాట మార్చి కేవలం సన్న వడ్లకే అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్లుగా సన్న వడ్లకైనా బోనస్ డబ్బులు వస్తాయని భావిస్తే అవి కూడా అడపాదడపా ఎగ్గొట్టడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోన్న ప్రజా పాలన మొదలై 32 నెలలు పూర్తైంది. మూడో ఏటా త్వరలోనే అడుగు పెట్టబోతోంది. ఈ సుదీర్ఘ కాలంలో రైతులకు అడుగడుగునా అధికార పార్టీ దగా చేసింది. ఇచ్చిన హామీలు వరుసగా ఎగ్గొట్టి మొండి చేయి చూపుతోంది. ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి రైతుల నోరు మూయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెబుతున్న మాటలకు మాటలకు… వాళ్లు చేస్తోన్న పనులకు సంబంధమే ఉండటం లేదన్న ఆరోపణలు రైతుల్లో స్థిరపడిపోయింది. రైతులకు కేసీఆర్ పాలనలో కొండంత అండ దొరికింది. కాంగ్రెస్ పరిపాలనలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
ఈ వానాకాలం సీజన్‌కు ఎల్‌నినో ముప్పు ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. రైతులంతా ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరుతున్నారు. మొన్న కురిసిన భారీ వానలకు తిరిగి వరి పంటలనే అత్యధికంగా రైతులు సాగు చేశారు. సాగు నీళ్లు అందుబాటులో లేక ఒక్కో రైతుకు అదనపు పెట్టుబడి భారం పెరిగింది. బోనస్ వర్తించాలంటే కేవలం 7రకాల వరి వంగడాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బోనస్ కోసం చాలా మంది గతంలో వేసిన నారుమడులు మార్చుకోవాల్సి వచ్చింది. తద్వార పెట్టుబడి ఖర్చులు భారమైంది. పెరిగిన యూరియా, విత్తనాల ధరతో ఆర్థికంగా చితికి పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో పెండింగ్‌లో ఉన్న సన్న వడ్ల బోనస్ చెల్లిస్తే ఊరట దక్కుతుందని రైతులంతా భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేస్తే సాగు కష్టాలు అధిరోహించేందుకు అవకాశం ఏర్పడుతుందని కర్షుకుల ఆశిస్తున్నారు.
రైతులకు సన్న వడ్ల బోసన్ యాసంగి సీజన్లో చిల్లి గవ్వ జమ కావడం లేదు. మేనిఫెస్టోలో వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో మొండి చేయి చూపించారు. గతేడాది 2025 యాసంగికి బోనస్ ఇవ్వలేదు. కేవలం వానాకాలంలో తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు ఎత్తేశారు. యాసంగి సీజన్‌కు సన్న వడ్లకు డబ్బులు ఎప్పుడు వస్తాయని రైతులు రెండేళ్లుగా ఎదురు చూడటానికే సరి పోతోంది. పైసా జమ కావడం లేదు. వరుసగా 2025, 2026 యాసంగిలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మోసం చేసింది.
బోనస్ రూపంలో రైతులకు అందాల్సిన డబ్బులు ఇవ్వలేదు. 2025లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.449 కోట్లు మేర బకాయిలు పేరుకు పోయాయి. నిజామాబాద్ జిల్లాలో రూ.360 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.89కోట్లుగా ఉంది. మొన్నటి యాసంగి సీజన్(2026)లో రైతులకు చెల్లించాల్సిన బోనస్ నిజామాబాద్ జిల్లాలో రూ.364.25కోట్లుగా ఉంది. కామారెడ్డి జిల్లాలో క్వింటా సన్న వడ్లకు బోనస్ రూ.115కోట్లుగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.479.25కోట్లు పేరుకు పోయింది. రెండేళ్లలో వరుసగా రెండు యాసంగి పంట కాలానికి బకాయి పడ్డ మొత్తాన్ని లెక్కిస్తే రూ.928.25కోట్లుగా నిలిచింది. రైతులకు దాదాపుగా వేయి కోట్లు మేర కాంగ్రెస్ సర్కారు బకాయి పడింది. ఏటా యాసంగిలో బోనస్ చెల్లించకపోవడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న కుట్రగా రైతులు భావిస్తున్నారు.