పెద్దపల్లి, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ)/ మంథని/ మంథని రూరల్: కాంగ్రెస్ పాలనలో చెక్ డ్యాంలపై కుట్రలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసం జరుగుతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శత్రుదేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లి మానేరులో నిర్మించిన చెక్‌డ్యాం ధ్వంసం కాగా, పుట్ట మధుకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక చెక్‌డ్యాంను బాంబు పెట్టి పేల్చారని, ఆ ఘటన మరువకముందే మళ్లీ అడవి సోమనపల్లి చెక్‌డ్యాం ధ్వంసం చేశారని మండిపడ్డారు.
చుట్టుపక్క గ్రామాలైన అడవిసోమనపల్లి, వెంకటాపూర్, నాగెపల్లి, మల్హర్ మండలం వల్లెంకుంటతోపాటు మానేరు పరీవాహక ప్రాంతం వెంట ఉన్న కాంగ్రెస్ సంబంధించిన సర్పంచులే ధ్వంసం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడి ఇసుకను దోపిడీ చేసేందుకే పంచాయతీ ఎన్నికల్లో లక్షలాది రూపాయలను ఖర్చు చేశారని, వారు గెలిచిన వెంటనే ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. చెక్‌డ్యాం ధ్వంసంపై స్థానిక పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైనా పట్టించుకోకపోవడం మూర్ఖత్వమని విమర్శించారు. సమీప గ్రామాల ప్రజలతో కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, ఆసిఫ్, ఇర్ఫాన్, మబ్బు నాగరాజు, ఓదెలు, పోలు కనుకరాజు ఉన్నారు.
అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం ధ్వంసంపై మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు వీడియోకాల్ కాల్ చేశారు. ధ్వంసమైన చెక్‌డ్యాంను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే తట్టుకొని నిలిచిన చెక్‌డ్యాం, నీళ్లు నిల్వ ఉన్న సమయంలో ఎలా కొట్టుకుపోతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారని పుట్ట మధూకర్ చెప్పారు. చెక్‌డ్యాం శిథిలాలు దిగువకు పడకుండా ఎగువకు పడి ఉండడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ఇదే సమయంలో అక్కడున్న అడవిసోమన్‌పల్లి గ్రామస్తులు.. మాజీ మంత్రి హరీశ్‌రావును డ్యాం పరిశీలించేందుకు రావాలని కోరాగా, ఆయన వస్తానని చెప్పారు. చెక్‌డ్యాం ధ్వంసంపై రైతులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.