చెరువు పక్కన ఊరు, నది పక్కన నగరం నిర్మించుకున్న నాగరికులం మనం. భూమే కాదు నీరూ మన హక్కే. నీటి పక్కన ఉండేవాళ్లే నిజమైన భూమిపుత్రులు. సకల సంపదల హైదరాబాద్ నగరం మూసీ కుదురులోంచి ఎదిగింది. నదిని జీవనాధారం చేసుకుని బతికే పేదోళ్లెందరో! అందుకే మూసీ హైదరాబాద్ ఆత్మ! పేదల కడుపునింపే తల్లి! అయితే, దళారులకు మాత్రం బంగారు గుడ్లు పెట్టే బాతు. అందుకే అమాంతం మింగి లాభపడాలనుకుంటున్నరు పాలకులు. అందుకే హైదరాబాద్ జలసిరి మూసీని తెగనమ్మే కుట్ర జరుగుతున్నది. దానికి పెట్టిన అందమైన పేరే మూసీ సుందరీకరణ! మూడు దశాబ్దాల క్రితం ఇదే నది చుట్టూ ‘నందనవనం’ పేరిట చంద్రబాబు రియల్‌ఎస్టేట్‌కు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తే.. జనం తిరగబడ్డారు. ‘మూసీ బచావో ఆందోళన్’ చేపట్టారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వమూ అదే రియల్ఎస్టేట్ పాటు పడుతున్నది. తాజా ప్రయత్నాలకు కాంగ్రెస్ మార్క్ పేరు ‘గాంధీ సరోవర్’!
ప్రఖ్యాత ఇంజినీర్ అలీ నవాజ్ యావర్ జంగ్ 1920లో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), 1927 నాటికి హిమాయత్ సాగర్ నిర్మాణం పూర్తి చేశాడు. అయినప్పటికీ, మూసీకి పలుమార్లు వరదలు వచ్చాయి. దీంతో ఇన్ని ప్రణాళికలు వేసినా మూసీకి ఎందుకు వరద పోటెత్తుతున్నది? ఇండ్లు ఎందుకు మునుగుతున్నాయ్? ప్రణాళికలో ఏదైనా లోపమా? లేక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి చెరువులు ఎగువన ఇంకా నిర్మించాల్సి ఉందా? అనే చర్చ సాధారణంగా రావాలి.
అయితే, ఇలాంటి చర్చను పక్కనబెట్టి మూసీ ఒడ్డున పేదల ఇండ్లే వరదలకు కారణమనే అవాస్తవాలను రేవంత్ ప్రభుత్వం వల్లె వేస్తున్నది. అయితే, ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఈ అబద్ధాల వెనుక ఒక నికార్సైన నిజం ఉన్నది. అదేంటో తెలుసా? మూసీ ఒడ్డున బతుకుతున్న పేదల కాళ్ల కింద ఉన్న భూమి సర్కార్ వారికి కావాలి. ఆ భూములను ఆక్రమించాలి. ఆ తర్వాత అమ్ముకోవాలి. అనంతరం సొమ్ము చేసుకోవాలి.
ఇదే రేవంత్ ప్రభుత్వం అసలు లక్ష్యం!
హైదరాబాద్ నగరం పెరుగుతున్న క్రమంలో ఆ పెరుగుదలకు అనుగుణంగా వ్యవస్థలను మెరుగుపరచలేదు. విశ్వేశ్వరయ్య రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్న కన్జర్వేటివ్ జోన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, డ్రైనేజీలు, ఇండస్ట్రియల్ ఏరియాలు, నివాస ప్రాంతాలు, నాలాలను నిజాం ప్రభుత్వం సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ ద్వారా అమలు చేసింది. ఆ తర్వాత వచ్చిన సంస్థలేవీ నగర విస్తీర్ణానికి తగ్గట్టుగా మౌలిక వసతులను కొత్తగా నిర్మించలేదు. జనావాసాలు పెరిగినా అదే డ్రైనేజీ వ్యవస్థపై ఆధారపడింది. అంతేకాదు నిజాం కాలంలో వరదల నుంచి నగరాన్ని రక్షించడంతో పాటు వందేండ్లపాటు తాగునీటి అవసరాలు తీర్చడానికి అలాగే దిగువన ఇరవై వేల ఎకరాల సాగునీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు నిర్మించారు. వీటి నిర్మాణం తర్వాత నగరంపై 1908 స్థాయిలో వరద మరోసారి పోటెత్తలేదు. 1908 నాటి వర్షపాతం (153.2 మిల్లీమీటర్లు) కంటే ఏడాది కిందట కురిసిన వర్షం (192 మిల్లీమీటర్లు)కు నగరం అతలాకుతలమైంది. అయితే, 1908లో వరదలు రిజర్వాయర్లు లేకపోవడం వల్ల సంభవించాయి. అయితే, ఇప్పుడు ఆ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నప్పటికీ నిరుడు నగరానికి వరద ప్రమాదం ఎందుకొచ్చింది?
జనంపై జలఖడ్గం
మూసీలో భూములున్నాయి. మూసీ పక్కనా భూములున్నాయి. ఆ భూములకు పేదలకు అనుబంధం ఉంది. దానిని తెంచే ఒకే ఒక ఆయుధం జల ఖడ్గం. ఆ ఖడ్గంతోనే మాపై దాడి చేశారని నిరుడు సంభవించిన వరదల సందర్భంలో మూసీ బాధితులు ఆరోపించారు. ఆ ఆరోపణలేవీ అబద్ధాలు కావు. ఎగువన కురిసే వాన నీటిని నిల్వచేసి, వానలు లేని కాలంలో బ్యాలెన్సింగ్‌గా దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేయాలని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు. నిత్యం నీరు వదులుతూ ఉంటే ఆ రిజర్వాయర్ల నుంచి నగరానికి ఎన్నటికీ హాని ఉండదు. అయితే, రేవంత్ ప్రభుత్వం అలా చేయలేదు. ఫలితంగా.. వరద ముప్పు రాకుండా రక్షణగా కట్టుకున్న ఆ రిజర్వాయర్లే హైదరాబాద్‌లో ఏడాది కిందట వరదలకు కారణమయ్యాయి. మూసీ బాధితులు ఆరోపించినట్టుగా ఈ ‘వరద కుట్ర’ నిజమే. గత మూడు దశాబ్దాలుగా బస్తీలపై అనేక అందమైన పేర్లతో ఈ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి.
నందనవనం.. ఇదో రియల్ ఎస్టేట్ వనం!
మూసీ పునరుజ్జీవం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ అమలు చేస్తానని 1997లో ప్రకటించింది. మూసీ నదిని వెడల్పు చేసి వరదలు రాకుండా చేయాలని, నదిలోకి కలుషితాలు చేరకుండా ఆపాలని, అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చెప్పింది. అలా ‘నందనవనం’ పేరిట ఓ ప్రాజెక్టును ముందరేసుకొన్నది. దీని ఏర్పాటు కోసం.. జియాగూడ నుంచి పురానాపూల్ వరకు నాలుగు అయిదు కిలోమీటర్ల పొడవున నదిలో మట్టి నింపి నిర్మాణాలు చేపడుతామన్నది. నదిని బాగు చేస్తానని చెప్తూ.. పూడ్చడమేంటని అప్పటి నగర ప్రజలు ప్రశ్నిస్తే… ‘పూడ్చిన కాడికి అమ్ముతాం. వచ్చిన డబ్బుతో అందంగా తయారు చేస్తాం’ అని అధికారులు చెప్పారు. అమ్మిన భూమిలో రియల్ ఎస్టేట్ కంపెనీలు నదికి ఇరువైపులా స్కై స్క్రాపర్స్ కడుతాయని, అభివృద్ధి జరుగుతుందని కొత్త ముచ్చట చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ మోసమని గ్రహించిన పలు ఎన్జీవోలు నందనవనం ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా ఉద్యమించాయి.
అలా ‘మూసీ బచావో ఆందోళన్’ మొదలైంది. ‘మేము ఇక్కడే బతుకుతాం. ఇదే మా ఆధారం’ అని ప్రజలు తెగేసి చెప్పారు. ప్రజల తిరుగుబాటుతో నందనవనం మోసం ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్ట్ వెనక్కు పోయిన తర్వాత హఫీజ్ కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. ప్రభుత్వానికి ఓ డీపీఆర్ సమర్పించి, సాలార్జంగ్ మ్యూజియం ఎదురుగా మూసీ నదిలో మేడ కడతానని కోరాడు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నదిలో మూడు అంతస్తులు, దాని మీద నాలుగు అంతస్తులతో ఒక పడవ ఆకారంలో బిల్డింగ్ కడతానని ఆయన చెబితే పెద్ద చేపే తగిలిందన్నట్టు అధికారులు, ప్రభుత్వ పెద్దలు అనుకూల నిర్ణయాలు చేశారు. తెల్లారే ఈ సంగతి బయటయపడింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు.. ఆ కంపెనీకి భూమిని లీజుకు ఇవ్వకుండా వెనక్కి తగ్గాడు.
సేవ్ మూసీని తెగనమ్మారు
మూసీని చెరబట్టాలన్న చర్యలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్న బస్తీ ప్రజలు ‘సేవ్ మూసీ’ అంటూ పెద్ద నినాదాన్ని కొనసాగించారు. ఈ నినాదాన్ని తెలివిగా వైఎస్సాఆర్ ప్రభుత్వం హైజాక్ చేసింది. అలా ‘సేవ్ మూసీ’ నినాదం కాస్తా ప్రాజెక్ట్ అయింది. సేవ్ మూసీ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీని మూడు జోన్లుగా విభజించి పలు నిర్మాణాలు చేపడతామని, నదిని కాలుష్యం నుంచి కాపాడుతామని, కబ్జాలు ఆపుతామని అప్పటి వైఎస్సార్ సర్కార్ హామీ ఇచ్చింది. నదిని ఎవరూ ఆక్రమించకుండా కాపాడుతామన్న ప్రభుత్వం మూడో జోన్ అయిన మెట్రో జోన్ (చాదర్‌ఘాట్ నుంచి ఉప్పల్ వరకు)లో ఉన్న భూముల్ని ప్రైవేట్ వాళ్లకు అమ్ముతానని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ‘కాపాడేదేముంది? అంత అమ్మినంక’ అని అప్పటి ప్రజలు వ్యతిరేకించినా ప్రభుత్వం రైతులకు వాటాలు ఇచ్చి వెంచర్లు వేసింది. భూములు అమ్మింది.
కన్జర్వేటివ్ జోన్ ఇప్పుడు కమర్షియల్
మూసీ భూముల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ ప్రైవేట్ లాబీ అవకాశం వచ్చినప్పుడల్లా రకరకాల పేర్లతో ఆయా ప్రభుత్వాల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు ప్రజల అప్రమత్తతతో ఆగిపోయాయి. కానీ, మళ్లీ రేవంత్ రెడ్డిని ముందుపెట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు మళ్లీ డెవలప్మెంట్ గేమ్ మొదలుపెట్టాయి. సేవ్ మూసీ పేరుతో 2005లో అప్పటి వైఎస్సాఆర్ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌లో కన్జర్వేషన్ జోన్ (బాపూఘాట్ నుంచి జియా గూడ వరకు) మొదటి జోన్‌గా ఉంది.
నిజానికి కన్జర్వేషన్ జోన్ అంటే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే, ఇప్పుడు ఆ కన్జర్వేషన్ జోన్లోనే గాంధీ స్మారకం, ఎత్తైన వంతెనలు, భారీ నిర్మాణాలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నది. ఈ విషయాలు బయటకు రావొద్దనే రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ డీపీఆర్‌ని బయట పెట్టడం లేదు. వైఎస్సాఆర్ ‘సేవ్ మూసీ’ ప్రాజెక్ట్‌లోని రెండో జోన్ హెరిటేజ్ జోన్ (పురానాపూల్ నుంచి చాదర్‌ఘాట్). ఈ జోన్లో ఉన్న నిజాం కాలపు నిర్మాణాలు తొలగించబోమని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యాటకంగా వాటిని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పింది. ఇప్పుడా మాట ఎక్కడా రేవంత్ రెడ్డి అనట్లేదు. ప్రభుత్వ పెద్దలెవరూ అనట్లేదు. అధికారులూ నోరు తెరువడం లేదు. అంటే చారిత్రక కట్టడాలు, వారసత్వానికి రేవంత్ ప్రభుత్వం ధ్వంసరచన చేయనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘మూసీ ఎండిపోతున్నది. ఏడాది పొడవునా నీళ్లు పారిస్తా. ఆ నీళ్లలో బోటింగ్ చేయిస్తా’ అంటూ సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ, ఆ మూసీ ఎందుకు ఎండిపోతున్నదో మాత్రం రేవంత్‌కు తెలియట్లేదు. మూసీ పునరుజ్జీవనం పేరుతో రియల్ ఎస్టేట్ ఎత్తుగడలు మొదలైనప్పుడే ప్రజలు మూసీకి నిజమైన పరిష్కారాలు కనిపెట్టారు. ఎస్టీపీలు నిర్మించాలని, డ్రైనేజీ వాటర్ కలకుండా చూడాలని సూచించారు. నదికి ఇరువైపులా వేల ఇండ్లు ఉన్నాయని, బోర్లు వేసి నీటిని విపరీతంగా తోడడం వల్ల మూసీ ఎండుతున్నదని నీటి రంగ నిపుణుడు, పర్యావరణవేత్త ప్రొఫెసర్ కొడాట్కర్ తేల్చారు. ఇంటింటికీ సరిపడా నీళ్లను పైపుల ద్వారా సరఫరా చేస్తే మూసీ సజీవంగానే ఉంటుందని ఆయన చెప్పారు. మూసీలో నీళ్లు పారిస్తానని చెప్పే రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అదేదో ఇంటింటికీ నల్లా నీటిని ఇస్తే చాలని ప్రజలు వేడుకుంటున్నారు. అదే జరిగితే.. మూసీ నది బతుకుతుంది. దాని ఒడ్డున పేదలూ బతుకుతారు. అయితే, సర్కారు అలా చేస్తుందా? ఒకవేళ చేస్తే, రియల్ఎస్టేట్ దందా ఎట్లా మరి?!
కేసీఆర్ ఉన్నప్పుడు వరద రాలేదేం?
2016లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నగరంలో 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, మూసీకి వరదేమీ పోటెత్తలేదు. అయితే, నిరుడు 192 మిల్లీమీటర్ల వర్షపాతానికే వరద పోటెత్తింది. ఎందుకు? నిత్యం నీరు వదులుతూ ఉంటే ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి నగరానికి ఎన్నటికీ హాని ఉండదు. అయితే, రేవంత్ ప్రభుత్వం అలా చేయలేదు. కారణం.. మూసీ భూములు కావాలి. అవి దక్కాలంటే వరద పేరిట పేదోళ్ల ఇండ్లను ఖాళీ చేయించాలి. దీని కోసం రేవంత్ ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చిన అందమైన పేరే మూసీ సుందరీకరణ.
1908లో వచ్చినట్టు మూసీకి మరోసారి వరదలు రాకూడదని
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌కు ఎగువన రెండు
రిజర్వాయర్లు నిర్మించాలని సూచించారు. ఆయన
చెప్పినట్టే నిజాం ప్రభుత్వం సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ ద్వారా ఈ పనులకు పూనుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్
నగరానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది.
