-వర్ధెల్లి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా దానవాయిగూడెం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత నియోజకవర్గం. బడి గంట మోగే సమయం. కానీ ఆ రోజు సరార్ బడి ప్రాంగణం ఎప్పటి ఉదయంలా లేదు. పిల్లలు బడికి వచ్చారు. కానీ గేటుకు తాళం వేసి ఉన్నది. బడి గేటు బయట ఒక తండ్రి నీళ్లింకిన కండ్లతో ఉన్నాడు. అతడి కుటుంబమంతా చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకొని చావడానికి సిద్ధమై ఉన్నది. ఆ తండ్రి పేరు చల్లా అయోధ్య. ప్రభుత్వ బడులకు మళ్లీ ప్రాణం పోసిన కాంట్రాక్టర్. సొంత డబ్బు చాలకపోతే అప్పు తెచ్చి బడిని నిలబెట్టాడు. నెలలు గడిచినా రావాల్సిన రూ.11 లక్షల బిల్లు జాడ లేదు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన అయోధ్య బడికి తానే తాళం వేసి చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకొని రోడ్డెకాడు.
అది శనివారం దిన పొద్దు. ఇంకా తెల్లవారలేదు. మెదక్ జిల్లా తిమ్మకపల్లిలో ఓ ఇంటి ముందట మృతదేహం ఉన్నది. అతడి పేరు కొండి దశరథ్. వయసు 45 ఏండ్లు. ముందురోజు రాత్రి వరకూ ఫోన్లో అధికారులను బతిమిలాడిన మనిషి, తెల్లారేసరికి ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. భర్త శవం పకన భార్య భారతి అచేతనంగా కూర్చున్నది. అతడు చేసిన నేరం ఏమిటి? సరార్ బడిని బాగుచేయడం! అందుకు పాలకులు వేసిన శిక్ష ఏమిటి? మరణ శిక్ష! ఎంత బిల్లు అంటే.. రూ.20 లక్షలు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రభుత్వానికి ఈ రూ. 20 లక్షలు చిన్న ఫైల్ నంబర్ మాత్రమే కావొచ్చు. కానీ దశరథ్కు అదే జీవితం.. అదే మరణమైంది.
చిన్న చిన్న కాంట్రాక్టర్లు.. విద్యాకమిటీ చైర్మన్ మూడేండ్ల కింద అప్పు తెచ్చి కడితే.. మీకు చెప్తున్నా. మా ఊరిలో రూ.19 లక్షలు.. రూ 20 లక్షలు బాకీ. వాడి బాధలు చూడలేక నేను రూ.5 లక్షలు ఇచ్చిన. గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నది. చేసిన పనులకు బిల్లులు ఇవ్వండి.
-శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. అధికారిక కుర్చీలో కూర్చొని చేసిన వ్యాఖ్యలివి!
ఇది కేవలం దశరథ్ వేదనో, అయోధ్య ఆవేదనో మాత్రమే కాదు. ‘మన ఊరు – మన బడి’ పథకం మాటున గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న భయానక నిశ్శబ్ద విషాదం. రూ.515.73 కోట్ల బకాయిలు.. 42 చితి మంటలు.. 1,500 కుటుంబాల కన్నీటి గాథలను వెలుగులోకి తేవడానికి ‘నమస్తే తెలంగాణ’ గ్రామాల్లో పర్యటించింది. మన ఊరు-మన బడి పథకం కాంట్రాక్టర్ల గుండె చెప్పుడు విన్నది. వారి కుటుంబాల బాధ, గాథను ఒడిసి పట్టుకొని అక్షర బద్దం చేసిన పరిశీలనాత్మక కథనమిది.
ప్రభుత్వ లెకల్లో జనవరి 2026 నాటికి ‘మన ఊరు- మనబడి’ పథకం పెండింగ్ బిల్లులు రూ.515.73 కోట్లు. ఇది ప్రభుత్వానికి ఒక అంకె మాత్రమే. మొత్తం బకాయిల్లో సింహభాగం.. అంటే రూ.369.08 కోట్లు కేవలం చిన్న కాంట్రాక్టర్లకే చెల్లించాల్సి ఉన్నదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సరార్ బడికి రంగులద్ది, అప్పుల్లో కూరుకుపోయిన కాంట్రాక్టర్లు.. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకొని ఇప్పటివరకు 42 మంది బలయ్యారు. ఇది కేవలం నిధుల కొరత కాదు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడుతున్న పచ్చి కక్షసాధింపుల రాజకీయ ఆటవిక క్రీడ. గత ప్రభుత్వం తెచ్చిన పథకం అనే ఒకే ఒక కారణంతో అమాయక కాంట్రాక్టర్ల పొట్టగొట్టడం ఏరకమైన పాలన? కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్లు చకచకా విడుదల చేస్తున్న రేవంత్ చిన్న కాంట్రాక్టర్ల ఫైళ్లను మాత్రం సెక్రటేరియట్ గదుల్లో అటకెక్కించింది.
రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు – మన బడి పథకం కింద పాఠశాలల్లో విద్యుదీకరణ, తాగునీరు తదితర 12 రకాల వసతులు కల్పించే పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది లాభదాయకమైన పని కానే కాదు. నామినేటెడ్ పద్ధతిలో రూ.30 లక్షల లోపు పనులకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు యువకులు, గ్రామస్తులు స్పందించారు. ప్రభుత్వంపై నమ్మకంతో పనులు పూర్తిచేస్తే.. నమ్ముకున్న ప్రభుత్వం మారిపోయింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.320 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా చేతులెత్తేసింది. జనవరి 2026 నాటి లెకల ప్రకారం, మన ఊరు-మన బడి పథకం కింద చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.369.08 కోట్లు ఉన్నాయి. నిరుడు చిన్న కాంట్రాక్టర్లు తెగించి సెక్రటేరియట్‌లోని ఆర్థిక మంత్రి చాంబర్ వద్ద ధర్నా చేస్తే.. ప్రభుత్వం జీవో 38 జారీచేసి రూ.50 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. మార్చిలో విడుదలైన ఆ మొత్తం ఏ మూలకూ సరిపోలేదు. ఇంకా రూ.320 కోట్లదాకా బిల్లులు సెక్రటేరియట్, ఆర్థిక శాఖల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.
2023 మార్చి 8న వనపర్తిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. మొదటి విడతలో 9,123 పాఠశాలలను ఎంపిక చేసి, రూ.3,492 కోట్లతో పనులు చేపట్టగా ఆ తర్వాత ప్రభుత్వం మారింది. పథకం పేరు మారింది. కానీ నేటికీ రూ.515.73 కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెకలే చెప్తున్నాయి. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద కొనుగోళ్లకు సంబంధించి మరో రూ.210.64 కోట్లు బాకీ ఉన్నాయి. దాదాపు 1,500 మంది చిన్న కాంట్రాక్టర్లకు రెండేండ్లుగా రూపాయి కూడా అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత, పాత పథకాన్ని కొనసాగించే బదులు ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరుతో కొత్త పథకాన్ని తెచ్చింది. పాఠశాల నిర్వహణ బాధ్యతను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగించింది. కానీ పాత పథకం కింద మొదలైన, సగం ఆగిపోయిన నిర్మాణాలను ఎవరు పూర్తి చేయాలి? ఎవరు బిల్లులు చెల్లించాలి? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఒక్క మెదక్ జిల్లాలోనే రూ 10.57 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రూ.7.5 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, బోథ్ మండలం కౌట పాఠశాలలో రూ.96 లక్షల నిర్మాణం మూడు నెలలుగా పునాదులకే పరిమితమైంది. కాంట్రాక్టర్ బిల్లులు రావన్న భయంతో పని ఆపేశాడు. ప్రభుత్వాలు మారి, పథకాల పేర్లు మారినంత మాత్రాన కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రద్దయిపోతాయా? నిర్మల్‌లో గుండెపగిలి చనిపోయిన ఆమెర్ బిన్ హమీద్, మెదక్ జిల్లా కౌడిపల్లిలో జగన్ అనే కాంట్రాక్టర్ రూ. 22 లక్షలు ఖర్చుచేసి, నాలుగు తులాల బంగారం అమ్మేసినా అప్పులు తీరక, నాలుగు గుంటల పొలాన్ని అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. అచ్చంపేటలో థర్డ్ క్లాస్ కాంట్రాక్టర్ శేఖర్ మూడేండ్లుగా రూ.1.5 కోట్ల బిల్లుల కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ మానసిక క్షోభతో బతుకుతున్నాడు. మరో కాంట్రాక్టర్ తన ఊరి భూము లు, ఇండ్లు తాకట్టుపెట్టి రూ.18 లక్షలు ఖర్చు చేసినా, పని పూర్తయి రెండేండ్లయినా చిల్లిగవ్వ అందలేదని, అప్పుల బాధతో ఊర్లో ఉండే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. హైదరాబాద్‌లో పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన కాంట్రాక్టర్లు, బిల్లులు రాక తోటి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో పాఠశాలకు తాళం వేసి నిరసన
కాంట్రాక్టర్ల మరణ ఘోషపై ముందుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు. ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు నిధులివ్వకుండా, పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన పెద్ద కంపెనీలకు మాత్రం త్వరగా నిధులు విడుదల చేసిందని తెలిపారు. బిల్లు కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన కాంట్రాక్టర్లపై పోలీసు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పేద పిల్లల బడులు బాగు చేసిన చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టవద్దని బట్టి విక్రమార్కకు లేఖరాశారు. సభలో సీఎం రేవంత్‌రెడ్డికీ సూచించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా పలుమార్లు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార చాంబర్ వద్ద కాంట్రాక్టర్లు చేసిన ధర్నాలు వారి ఆఖరి ఆక్రందనకు నిదర్శనం. కానీ ఏండ్ల తరబడి ప్రజావాణిలో వినతిపత్రాలు, మంత్రుల చాంబర్ల ముందు నిరసనలు, అసెంబ్లీలో ప్రస్తావనలు.. ఇవన్నీ జరిగినా, గ్రామాల్లో పడిగాపులు పడుతున్న చిన్న కాంట్రాక్టర్ల చేతికి డబ్బు చేరడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం, గత ప్రభుత్వం చేపట్టిన పథకాలకు నిధుల కేటాయింపు, పర్యవేక్షణలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతూనే బకాయిలు క్రమంగా విడుదల చేస్తున్నామని చెప్తున్నది. అయితే ఈ వివరణ ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ఏమాత్రం ఊరటనివ్వడం లేదు.
అప్పుల బాధకు 42 మంది కాంట్రాక్టర్ల చా వులు, వారి కుటుంబాల కన్నీటి లెకలకు క చ్చితంగా ఈ పాలకులే సమాధానం చె ప్పాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇ ప్పటికైనా కక్షసాధింపు చర్యలు పకనబెట్టి రూ.320 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. బిల్లులు ఆలస్యమవుతున్న కొద్దీ గుండెలు బరువెకుతున్నాయని, కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మన ఊరు-మన బడి కింద పాఠశాల నిర్మా ణం చేపట్టి మూ డేండ్లు అవుతున్నా కాంగ్రెస్ ప్రభు త్వం నుంచి ఇం కా సగం బిల్లు రావాల్సి ఉన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మన ఊరు-మనబడి కింద రూ.కోట్లు ఖర్చుపెట్టి చా లా మంది కాంట్రాక్టర్లు అప్పులు తీసుకొచ్చి నిర్మాణం చేశారు. కేసీఆర్ హయాం లో సగం బిల్లులు వచ్చినయ్. మిగతా స గం బిల్లు కోసం చెప్పలు అరిగేలా తిరుగుతున్నం. రూ.32 లక్షలు మంజూరు కా గా.. రూ.16 లక్షల బిల్లు వచ్చింది. ఇంకా రూ.16 లక్షల బిల్లు రావాలి.. తెచ్చిన అప్పులకు వడ్డీ తడిసి మోపెడవుతున్నది. కాంగ్రెస్ పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా బిల్లు మంజూరు చేయడం లేదు.
– దేవేందర్‌రెడ్డి, కోటకదిర, మహబూబ్‌నగర్ రూరల్ మండలం
మన ఊరు మన బడి కార్యక్రమంలో శాసనసభ ఎన్నికల ముందు మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేసినం. రూ.18 లక్షల బిల్లు అయింది. ఇప్పుటి వరకు ప్రభుత్వం పైసా చెల్లించలేదు. రూ.18 లక్షలకు వడ్డీ చెల్లించేందుకు బంగారం తాకట్టు పెట్టిన. మా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. మెదక్ జిల్లాలో నాతో పాటు అనేక మంది కాంట్రాక్టర్లం బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నం.
– డీ జగన్, కౌడిపల్లి, మెదక్ జిల్లా
మా ఆయన దశరథం.. బిల్లులు వస్తయ్.. ఒక్క పైసా నష్టం రాదు అని అధికారులు చెప్పిన మాటలు నమ్మిండు. మా దగ్గర ఉన్న 25 గుంటల పొలమే జీవనాధారం. ఆ పొలం రిజిస్ట్రేషన్ పెట్టి రూ.11 లక్షలు అప్పు తెచ్చిండు. ఆ డబ్బుతో మెదక్ బాలికల కళాశాల భవనం కట్టిండు. పని మొత్తం చేసి అప్పగించిండు. కానీ, బిల్లులు మాత్రం రాలే. అప్పు ఇచ్చినోళ్లు రోజూ ఇంటికొచ్చి అడిగేటోళ్లు. వడ్డీలు పెరుగుతూనే పోయినయ్. మా ఆయన రాత్రింబవళ్లు అదే దిగులు పడుతుండేటోడు. చివరికి అసెంబ్లీ దగ్గరకు పోయి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మా గోడు చెప్పాలనుకున్నడు. కానీ, వినడం వది లి కేసులు పెట్టిండ్రు. ఆ టెన్షన్ తట్టుకోలేక జూన్ 26న గుండెపోటుతో చనిపోయిండు. మా పెద్దమ్మాయి రక్షిత డిగ్రీ చదువుతున్నది. చిన్నమ్మాయి అమూల్య ఇంటర్ చదువుతున్నది. వాళ్ల చదువులు ఎట్లా సాగాల్నో తెలుస్తలేదు. మా ఆయన చనిపోయినంక గ్రామస్తులే చందాలు వేసుకొని అంత్యక్రియలు చేసిండ్రు.
– భారతి, దశరథం భార్య, తిమ్మక్కపల్లి, మెదక్ జిల్లా
‘మన ఊరు-మనబడి’లో రెండు పాఠశాలలు బాగు చేయించిన. రామాయంపేట షావుకారి దగ్గర రూ.3 వడ్డీకి రూ 6 లక్షలు అప్పు తెచ్చిన. సింగంపేట చిన్నబడికి రూ.3.70లక్షలు, మల్లెపల్లి బడికి రూ.2.50 లక్షలు ఖర్చుపెట్టిన. జనవరి 2024లో ఒక బిల్లు, మార్చి 25న ఒక బిల్లు సాంక్షన్ అయ్యింది. కానీ, ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా రాలేదు. నాలుగు నెలల నుంచి వడ్డీ కట్టకపోవడంతో షావుకారి చెక్‌బౌన్స్ కేసు వేసిండు. సెక్రటేరియట్‌కు పోతే బయటికి పంపిస్తున్నారు. మెదక్ జిల్లాలో రూ.11 కోట్ల మేర డబ్బు లు పెండింగ్ ఉన్నాయి. చెక్‌బౌన్స్ కేసు లో కోర్టు ఏం చెప్తుందోనని భయంగా ఉ న్నది. ఊర్లో బాగా బతికిన వాళ్లం. బడి కోసం పోయి అప్పుల పాలైన.
– మాణిక్యం, కొండాపూర్, మెదక్ జిల్లా