దుబాయ్, జూలై 8 : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారింది. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ దాడులు నిర్వహించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన జలసంధిలో ఇంధన రవాణాను పునరుద్ధరించే ప్రయత్నాలను నౌకలపై జరిగిన దాడులు భగ్నం చేశాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభమైన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖమేనీ అంత్యక్రియలు గురువారం ముగియనున్నాయి. ఖమేనీ అంత్యక్రియల తర్వాత జలసంధిని పూర్తిగా తెరువడం, తన అణు కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవడం వంటి అత్యంత క్లిష్టమైన అంశాలపై ఇరాన్ దృష్టి సారించి తుది ఒప్పందం చేసుకోవలసి ఉంది. చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ఏ ఒక్క దేశమూ ప్రకటించనప్పటికీ ఈ పరస్పర దాడులతో చర్చల కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల శకం ముగిసింది. దీని వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మేము తలొగ్గం అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేసినందుకు భారీ మూల్యం చెల్లించేలా చేయడానికి అమెరికా దళాలు దాడులు చేశాయి అని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లు, ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డు ఉపయోగించే 60కిపైగా చిన్న పడవలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు కమాండ్ పేర్కొంది. జలసంధిలో వాణిజ్య నౌకలకు ఈ చిన్న పడవలు ముప్పుగా పరిణమించాయి. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పాటించని పక్షంలో ఇరాన్‌ను జవాబుదారీని చేయడానికి అమెరికా సైన్యం సన్నద్ధంగా ఉందని కమాండ్ తెలిపింది. ఒక విడత దాడులు ముగిశాయని కమాండ్ ప్రకటించింది.
బందర్ మహషహర్సహా అనేక ప్రదేశాలలో పేలుళ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది. ఒక గార్డ్డ్ సభ్యుడు మరణించినట్లు కూడా పేర్కొంది. అణు విద్యుత్ కర్మాగార సముదాయం ఉన్న బుషెహర్‌పై కూడా దాడులు జరిగినట్లు మీడియా పేర్కొంది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్‌కు నిలయమైన బహ్రెయిన్, అమెరికా సైనిక దళాలకు స్థావరమైన కువైట్ రెండూ బుధవారం ఉదయం క్షిపణి హెచ్చరికలను జారీచేశాయి. ఈ రెండు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు గార్డ్ ఒక ప్రకటన జారీచేసింది.
దాడులకు ముందు తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురు అమ్మకానికి అధికారం ఇచ్చిన లైసెన్సును అమెరికా రద్దు చేసింది. చైనాకు మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇరాన్ అక్రమంగా చమురు అమ్ముతున్నట్లు అమెరికా అనుమానిస్తున్నది. ఒమన్ తీరానికి దూరంగా ఉన్న ఒక ట్యాంకర్‌పై దాడి జరిగి అది మంటల్లో చిక్కుకుందని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. హెచ్చరికలను విస్మరించినందుకే ఆ ట్యాంకర్‌పై దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. కాని, ఆ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ నేరుగా ప్రకటించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలలో పాకిస్థాన్‌తోపాటు కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ఇరాన్‌ను పూర్తిగా చట్టపరంగా బాధ్యురాలిగా పరిగణిస్తున్నది.
ఇక చర్చల వల్ల ప్రయోజనం లేదు.. మరోసారి దాడి చేస్తాం: ట్రంప్
యుద్ధాన్ని నిలిపివేయడానికి ఇరాన్‌తో కుదుర్చుకున్న తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. హొర్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా తాజాగా దాడులు ప్రారంభించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. తుర్కియేలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ నాయకులను నీచులు, రోగులుగా నిందించారు. ఇరాన్‌తో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి తాను ఇష్టపడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

కేవలం మూడు వారాల క్రితమే ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) గురించి విలేకరులు ప్రశ్నించగా నా వరకు ఆ ఎంవోయూ ముగిసిపోయింది. ఇకపై వారితో వ్యవహరించడం నాకు ఇష్టం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 3 శాతం పెరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో దీని ప్రభావం ఏమిటన్నది తెలియరాలేదు. యుద్ధాన్ని అంతం చేసేందుకు తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు మాత్రం మెరుగుపడలేదు. అమెరికా అధ్యక్షుడు బుధవారం ఇరాన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు నీచులు, రోగులు, దుర్మార్గులు, హింసాత్మక వ్యక్తులు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే దాన్ని కూడా ప్రయోగిస్తారు అంటూ ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఇరాన్‌కు తాను ప్రధాన లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై తన ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను సమర్థించుకుంటూనే ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేలా అనుమతించకూడదని ఆయన హెచ్చరించారు. అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ తనను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతున్నదని తాను నమ్ముతున్నానని, అయినప్పటికీ తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.
ట్రంప్‌నకు ఇరాన్ హెచ్చరిక
ఈ ప్రాంతం చిన్న దేశాల రాజకీయ జూదానికి చోటు కాదు అని ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ సలహాదారుడు అలీ అక్బర్ వెలాయతి హెచ్చరించారు. అమెరికా రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా ప్రతిఘటన కూటమి వేలు తుపాకీ ట్రిగ్గర్పైన ఉందని ఆయన పేర్కొన్నారు. :ఈ ప్రాంతం చిన్న దేశాల రాజకీయ జూదానికి తగిన ప్రదేశం కాదని మేము గతంలోనే హెచ్చరించాము. అలాగే ఇటువంటి సాహసోపేత చర్యలకు తక్షణమే ప్రతిస్పందన ఉంటుందని మేము పదేపదే నిరూపించాము అని వరుస ఎక్స్ పోస్ట్‌లలో వెలాయతి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) రద్దు చేయడం అనేది ప్రాంతాన్ని మరోసారి అగ్నిగుండంగా మార్చే ఒక మౌఖిక ఆదేశంగా ఆయన అభివర్ణించారు.