పూర్వికులు తాళపత్రాలపై అక్షరాలు దిద్ది కావ్యాలు రాశారు. కాగితం వచ్చాక పత్రలిపికి కాలం చెల్లింది. కానీ, కాగితంపై గీయడం మొదలుపెట్టి పత్రహరితాన్ని చిత్రహరితం చేయడం నేర్చిందో విద్యార్థిని. బడిలో మొదలైన ఆ కళాప్రయాణంలో చిత్రాలతో ఎన్నో విచిత్రాలు చేసింది! రెగ్జిన్పై చీరను చిత్రించి మగ్గం మీద నేసిన ఏడు గజాల చీర అని అందరినీ నమ్మించింది! పత్రహరితంపై అక్షరం చెక్కడంలో, చిహ్నం రూపకల్పనలో, ముఖచిత్ర రచనలో రాణిస్తున్న అద్భుత చిత్రకారిణి మేకల అనురాధా దాస్ చిత్రకళా ప్రయాణం ఆమె మాటల్లోనే..
అమ్మానాన్న స్ఫూర్తితో చిన్నప్పుడే చిత్రకళలో అడుగుపెట్టాను. మేం పద్మశాలీలం. చేనేత మా కులవృత్తి. అమ్మకు బొమ్మలు గీయడం భలే ఇష్టం. పిల్లో కవర్ల మీద, చీరల మీద అల్లికలతో అద్భుతమైన బొమ్మలు ఆవిష్కరించేది. రంగులతో కలంకారీ పని చేసేది. అమ్మ చేసే కుట్లు, అల్లికలు, ముగ్గులు చూస్తూ చిన్నప్పుడు నేను కూడా బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. నేర్చుకో అని వాళ్లు ప్రోత్సహించింది లేదు. కానీ, వాళ్ల స్ఫూర్తితోనే చిత్రకళలోకి వచ్చాను. పాఠ్య పుస్తకాల మధ్యలో నెమలీకలు పెట్టేవాళ్లం. ఆకులు, పూలు కూడా పెట్టేవాళ్లం.

ఆ పూలు ఎండిపోతే కాగితాలపై అచ్చులు పడేవి. అందమైన ఆకారాలకు రంగులద్ది చక్కని బొమ్మలు చేసేది. ఇలా చేస్తున్నప్పుడు ఎండిన పూలను, ఆకులను పారేసేది. పూల రేకులు పొడిగా మారినా ఆకులు మాత్రం దళసరిగా, దృఢంగా ఉండేవి. వాటిపై కూడా రంగులద్దేదాన్ని. అలా ఆకులపై అందమైన చిత్రాలు గీయడం మొదలుపెట్టాను. ఎప్పుడూ రంగులద్దడమేనా? అనుకుని పచ్చి ఆకులను కార్వింగ్ చేశాను. అక్షరాలు, దేవతల రూపాలు, ప్రముఖుల ముఖ చిత్రాలు, చిహ్నాలను ఆకులపై చెక్కడం సరదాగా మొదలైంది. ఆ కళకు ప్రశంసలే కాదు నాకు మంచి గుర్తింపూ తెచ్చిపెట్టింది.

స్కూల్లో చదువుకునే రోజుల్లోనే లోయర్ డ్రాయింగ్ సర్టిఫికెట్ కోర్స్, హయ్యర్ డ్రాయింగ్ సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేశాను. ఈ ఎక్స్పోజర్ వల్ల అనేక పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్స్ ఉంటుందని తెలిసింది. ఆ శిక్షణ పూర్తి చేయాలంటే హైదరాబాద్‌లోనే ఉండాలి. మాది సంగారెడ్డి జిల్లా సదాశివపేట. మా ఊరు నుంచి అంత దూరం వెళ్లి, అక్కడ ఉండి చదివే అవకాశం లేదు. ఆ కోర్సు మీద ఆశలు వదులుకున్నాను. పెండ్లి అయిన తర్వాత హైదరాబాద్‌లో ఉన్నాం. దీంతో టీటీసీ పూర్తి చేసే అవకాశం వచ్చింది. శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ పొందాను. ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీఈడీతోపాటు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం సాధించాను. ప్రభుత్వం టీటీసీ శిక్షణకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లనే ఎంపిక చేస్తుంది. నేను ఆర్ట్ టీచర్ కాకపోయినా గతంలో శిక్షణ తీసుకున్నాను. నైపుణ్యం ఉంది. కాబట్టి నన్ను ఎంపిక చేసింది. మునిపల్లి మండలం, పెద్దగోపులారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాను. ఆ బాధ్యతలు నిర్వర్థిస్తూనే వేసవిలో ఆర్ట్ నేర్చుకునే వాళ్లకు టీటీసీ శిక్షణ ఇస్తున్నాను. చిన్నప్పుడు ఏ కోర్స్ అయితే చదవలేకపోయానని బాధపడ్డానో అదే కోర్సుకు శిక్షణ ఇచ్చే బాధ్యతలోకి వచ్చాను.

అన్ని రకాల మాధ్యమాలపై బొమ్మలు గీశాను. ప్రదర్శించాను. ఎన్నో బహుమతులూ వచ్చాయి. సన్మానాలు అందుకున్నాను. రికార్డులు వచ్చాయి. నాగేశ్వరరావు అనే ఆర్టిస్ట్ కాగితంపై ఓ దినపత్రికను యథాతథంగా చిత్రించాడు. అది చూసి ఆశ్చర్యపోయాను. ఇన్ని చేసినా అలాంటి ఆర్ట్ ఒకటి చేయలేకపోయానే అనిపించింది. నేను పద్మశాలీ కుటుంబంలో పుట్టాను. కాబట్టి చీరను రెప్లికా చేయాలనుకున్నాను. ఏడు గజాల రెగ్జిన్పై చీరను చిత్రించాను. అందమైన జరీ అంచులు, బూటాలు, పల్లూ యథాతథంగా చిత్రించాను. అది పూర్తయిన తర్వాత చూసిన వాళ్లందరూ శారీ అనుకున్నారు. దానిని ‘పొడవైన రెప్లికా ఆర్ట్’గా బ్రిలియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గుర్తించి, సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఈ కళా ప్రయాణంలో మరెన్నో మైలురాళ్లు అందుకోవాలని ఉంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానన్న నమ్మకమూ ఉంది.