మంత్రి వర్గంలో ఒక మతం వ్యక్తికి స్థానం కల్పిస్తే ఆ మతం వాళ్లందరికీ మంత్రివర్గంలో స్థానం లభించినట్టేనా? ‘మా బతుకులు ఎలా తెల్లారినా పరవాలేదు, మా జీవితాలు రోడ్డున పడ్డా పరవాలేదు, మా పిల్లలకు చదువు, ఉపాధి, మాకు నిలువ నీడ లేకపోయినా పరవాలేదు, మా మతం వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు మాకు అది చాలు’ అని ఆ మతం వాళ్లంతా వారికి ఓటు వేస్తారా?
కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మీడియా ఇలానే ఊహిస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో లక్షకు పైగా ముస్లింల ఓట్లున్నాయి. ఫలితాల్లో వీరు కీలక పాత్ర వహిస్తారు. హైడ్రా పేరుతో పేదలను రోడ్డున పడేసిన కాంగ్రెస్ పాలకులు మైనారిటీల మనసు దోచుకోవడానికి వారి స్థితిగతులను మార్చడానికి బదులు ముస్లింలలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే చాలు, వారి ఓట్లు గుండుగుత్తగా కాంగ్రెస్ జోలెలో పడిపోతాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వయంగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసినా జనం తిరస్కరించారు. ఇప్పుడు ఆయన శాసనసభ్యులు కాకపోయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది అపర చాణుక్య వ్యూహమని కాంగ్రెస్ మీడియా ఆకాశానికెత్తింది. అజారుద్దీన్ కాంగ్రెస్ అనుబంధం ఈ రోజుది కాదు. ముస్లిం ఓట్ల కోసం ఆయన్ని కాంగ్రెస్ దేశమంతా తిప్పుతున్నది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ తమిళి సై ప్రతి బిల్లును తొక్కిపెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకురాలిగా వ్యవహరించారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ప్రచారం జరుగుతున్న సమయంలో ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి కాంగ్రెస్ తీసుకున్నా ప్రస్తుత గవర్నర్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కాంగ్రెస్‌కు పూర్తి సహకారం లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా మైనారిటీ వర్గం నుంచి మంత్రి వర్గంలో ఎవరికీ స్థానం లేకపోయినా, ఉప ఎన్నికల కోసం హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వగానే ముస్లింలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారని కాంగ్రెస్ భావిస్తున్నదేమో. కానీ, ప్రజలు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారు. అంతేకానీ మంత్రి వర్గంలో ముస్లింను చేర్చుకున్నారని ఓటు వేయరు. దాదాపు 18 నెలల నుంచి షాదీ ముబారక్ దరఖాస్తులకు అతీ గతీ లేదు. పెన్షన్ 4 వేలు ఇస్తామని చెప్పి పైసా పెంచలేదు. తులం బంగారాన్ని మరిచిపొమ్మంటున్నారు. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్న హామీని మరిచిపోయారు. హామీలను కాంగ్రెస్ నాయకులు మరిచిపోయినట్టుగానే ఓటర్లు కూడా మరిచిపోయి అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు మాకు అది చాలని ఎగిరి గంతేస్తారని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. ఒక వర్గం నుంచి ఒకరిని అందలమెక్కించడం ద్వారా ఆ వర్గం వారంతా సంతోషంతో మైమరిచిపోతారని కాంగ్రెస్ భావించడం మొదటిసారి కాదు.
2010లో ఉమ్మడి ఏపీలో ఒకసారి ఇలానే బోల్తా పడ్డారు. తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ చేసి తిరిగి వెనక్కి వెళ్లడంతో తెలంగాణ శాసనసభ్యులందరూ రాజీనామా చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 12 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు. బీజేపీకి ఇద్దరు శాసనసభ్యులు ఉంటే కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. 13 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే నిజామాబాద్ అర్బన్‌ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అక్కడినుంచి కాంగ్రెస్ తరపున అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి.శ్రీనివాస్ పోటీ చేశారు. అప్పటికే వైఎస్ మరణించారు. రెండు సార్లు పీసీసీ అధ్యక్షునిగా నేనే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చానని ధర్మపురి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో ధర్మపురి గెలిస్తే సీఎం అవుతారని కూడా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారందరినీ గెలిపించాలని కేసీఆర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తెలంగాణవాదులు కృషిచేశారు. ధర్మపురి గెలిస్తే సీఎం అవుతారని గట్టి ప్రచారం ఉండటం వల్ల మీడియా మొత్తం ధర్మపురి గెలుపుపై నమ్మకం పెట్టుకున్నది.
ధర్మపురి సీఎం అయితే వారి కుటుంబానికి ప్రయోజనం, గెలుపు వారికి ప్రతిష్ట కానీ, తెలంగాణవాదం గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు అని ఓటర్లు భావించి సీఎం అభ్యర్థి ధర్మపురిని ఓడించి తెలంగాణ వాదం కోసం బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణను గెలిపించారు. ఓటర్లు అన్ని కోణాల్లో ఆలోచించి తమ ఓటు హక్కు ఉపయోగించుకుంటారు కానీ, ఎవరో ఒక వ్యక్తి ప్రయోజనం కోసం తమ ఓటు హక్కు ఉపయోగించరు.
ఉమ్మడి ఏపీలో 2004 ఎన్నికలకు ముందు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఎంతమంది పుష్కర స్నానాలు చేశారో పార్టీ కార్యాలయంలో స్వయంగా అప్పటి సీఎం చంద్రబాబు రోజూ మీడియా సమావేశంలో చెప్పేవారు. పుష్కర స్నానాలు చేసినవారంతా టీడీపీకి ఓటు వేస్తారనేది వారి అంచనా. ఒక దశలో ఈ సంఖ్య రాష్ట్ర జనాభాను మించిపోయింది. అంతకుముందు చంద్రబాబు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆఫ్రో ఆసియా గేమ్స్ నిర్వహించారు. జాతీయస్థాయిలో విస్తృతంగా ప్రచారం. ముగింపులో అప్పటి ప్రధాని వాజపేయి వచ్చారు. ఈ క్రీడలతో యువత ఓట్లు మొత్తం టీడీపీకే అని టీడీపీ ప్రచారం చేసింది. నిజానికి ఈ విస్తృత ప్రచారం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసింది. అప్పటికే వరుసగా మూడు, నాలుగేండ్ల నుంచి వర్షాలు లేక కరువు ఉన్నది. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో అట్టహాసంగా భారీ ఖర్చుతో క్రీడోత్సవాలు నిర్వహించడం ప్రజల్లో వ్యతిరేక ప్రభావం చూపింది. 2004 ఎన్నికల్లో టీడీపీ చరిత్రలోనే అత్యల్ప సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ 47 సీట్లకు పరిమితమైంది.
జనం పరిస్థితిని పట్టించుకోకుండా ఆకాశంలో విహరిస్తే జనం అదే రీతిలో స్పందిస్తారు. రెండేండ్ల నుంచి రాష్ట్రంలో పాలన పడకేసింది. పేదలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నది. పేదల సమస్యలు పట్టించుకోకుండా ముస్లింకు మంత్రి పదవిస్తే ముస్లింల సమస్యలన్నీ మాయమవుతాయని కాంగ్రెస్ భావిస్తే ప్రజలను తక్కువగా అంచనా వేసినట్టే. దేశంలో ఓటు హక్కు వచ్చిన కొత్తలో ఒక మోతెబరి ఎవరికి ఓటు వేయమంటే ప్రజలు వారికి ఓటు వేసే పరిస్థితులుండేవి. ఆ రోజులు పోయాయి. ప్రజలకు ఆలోచనా శక్తి ఉన్నది. తామేమిటో ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు.