సుప్రసిద్ధ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా అక్టోబర్ 31న నియమితులైన వేళ కొన్ని ఆలోచనలు అనివార్యంగా ముంచుకొస్తున్నాయి. ఆయన బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా గొప్ప ప్రతిభను చూపి ప్రపంచమంతటా పేరుపొందారు. ప్రవేశంతోనే వరుసగా మూడు సెంచరీలు సాధించటం అందరికళ్లను మిరుమిట్లు గొలిపిన రికార్డు కాగా, బంతిని కేవలం ఫిక్ చేసి బౌండరీ దాటించే ‘మణికట్టు మాంత్రికు’డన్నారు అందరూ. ఫీల్డింగ్లోనైతే వేగంగా పరుగెత్తి బంతిని ఆపటం, పైకి లేవకుండా అట్లా వంగి ఉండే బంతిని ఎంత దూరంనుంచైనా సూటిగా వికెట్ కీపర్ చేతులలోకి విసరగలగటం అందరినీ అబ్బురపరిచేది. ఒక దశలో తన బ్యాటింగ్ కొంత మందగించినా, కేవలం ఫీల్డింగ్ బలంతో జట్టులో కొనసాగించారన్నారు. హైదరాబాద్‌కు సంబంధించి అబిద్ అలీ, జయసింహాల తర్వాత తిరిగి మెరిసిన క్రికెట్ ఆటగాడు అజారుద్దీనే. అందువల్లనే తనను భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ కూడా వరించింది.
అటువంటి వ్యక్తి లోగడనే రాజకీయాలలో ప్రవేశించి లోక్‌సభ సభ్యుడు కూడా అయిన తర్వాత, ఇప్పుడు అనూహ్యంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తను ఇంకా చట్టసభకు ఎన్నిక కావలసి ఉన్నది. ఆ లాంఛనం రాగల ఆరు మాసాలలో పూర్తికాగలదని భావించాలి. తన చుట్టూ ఇప్పటికే కొంత రాజకీయం తిరిగింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఆయనకు టికెట్ ఇస్తారని, అంతకుముందు ఎమ్మెల్సీ చేస్తారని పలువార్తలు వెలువడ్డాయి. కొద్ది నెలల క్రితం గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన వారికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్నందున గవర్నర్ ఆమోదం, కోర్టు అభ్యంతరాల విషయమై సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ, కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యుడైన అజర్‌ను నామినేట్ చేసి గవర్నర్‌కు పంపారు. ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో గల ఆ విషయం ఏమయ్యేదీ తెలియదు. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే, వచ్చే ఆరు మాసాల్లో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని, అప్పుడు వాటిలో ప్రత్యక్షంగా ఎన్నిక చేయగలమని ఇప్పుడు అంటున్నారు. అట్లా జరిగితే జరగవచ్చు కూడా. కనుక ఈ విధంగా మంత్రి అవుతున్నందుకు అజర్‌ను అభినందించాలి.
ఈ మొత్తం వ్యవహారం మాత్రం సాఫీగా జరుగుతూ రాలేదు. ఇంతకుముందు మొదట బీఆర్ఎస్కు చెందినవారిని అప్పటి గవర్నర్ ‘రాజకీయ సంబంధం’ అంటూ తిరస్కరించటం, ఆ వెనుక, కాంగ్రెస్ నామినేట్ చేసినవారిని ‘రాజకీయ సంబంధం’ ఉన్నా ఆమోదించటం దానిపై మొదట హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు జోక్యాలు, అయినప్పటికీ మరొకసారి అటువంటి ‘సంబంధం’ గలవారిని నామినేట్ చేయటం వంటివన్నీ మొత్తం విషయాన్ని మురికి మురికిగా తయారుచేశాయి. పరిస్థితులు, చట్ట నిబంధనలేమిటో తెలిసినవారే గనుక వాస్తవానికి అట్లా నామినేట్ అయినవారే స్వయంగా అందుకు నిరాకరించి ఉంటే గౌరవం మిగిలేది. కానీ, వారు ఎందుకు సరేనన్నారో తెలిసిందే గనుక, తమ గౌరవం మరింత దెబ్బతినటం మినహా మిగిలింది లేదు.
ఇది అభ్యర్థుల మాట కాగా, ఈ ప్రహసనానికంతా బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఢిల్లీలోని పార్టీ నేతలది. తమ అపసవ్యపు ఆలోచనలు, సంకుచిత ధోరణి, అసమర్థతల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరికి ఇప్పుడు అజారుద్దీన్‌ను చట్టసభ సభ్యుడు కాకుండానే మంత్రిగా నియమించారు. అజర్‌ను ఇంత హడావుడిగా మంత్రిని చేసింది ఎందుకో అందరికీ ఎవరూ చెప్పకుండానే అర్థమైనందున ఇంకా చెప్పవలసింది లేదు. మరో వారం రోజులలో ఉప ఎన్నిక జరుగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లలో సుమారు 33 శాతం మంది ముస్లింలు. వారి ఓటు సంపాదన కోసం మజ్లిస్‌తో పొత్తు కోసం ప్రయత్నించారు. అజారుద్దీన్‌కే టికెట్ ఇస్తారన్నారు. చివరికి ఏమైందో కేవలం కొన్నిరోజుల ముందు ఆయనను మంత్రి చేశారు.
రాజకీయాలలో ఇదంతా మామూలేనని అనవచ్చు. కానీ, ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తున్నది. అక్కడ ముస్లిం ప్రజలకు రెండు కారణాల వల్ల ప్రభుత్వం పట్ల అసంతృప్తి గత రెండేండ్లుగా పేరుకుపోతున్నది. ఒకటి, సాధారణ రూపంలోనే ముస్లింలు సహా సామాన్యులంతా కాంగ్రెస్ గ్యారెంటీలు, మేనిఫెస్టో అమలుకాకపోవటం వల్ల అసంతృప్తి చెందటం. రెండు, ముస్లింలు అయిన తమ కోసం ఆ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చేర్చిన ‘మైనారిటీ డిక్లరేషన్’ కూడా అమలు చేయకపోవటం. మేనిఫెస్టోలోని ఇతర అంశాలను అట్లుంచి, ఇప్పుడు ఒక మైనారిటీ నాయకునిగా, మైనారిటీ ఓట్లతో గెలువాలనుకుంటున్న కాంగ్రెస్‌కు అందుకోసం ఆసరాగా నిలుస్తున్న అజర్, వారి కోసం ఆ డిక్లరేషన్‌ను అమలు చేయించగలరా? చేయించగలిగితే మంచిదే. లేనట్టయితే, తనను ఈ ఎన్నిక ముందట, మైనారిటీల ఓట్లను ఆశించి, ఇంత హడావుడిగా మంత్రిని చేయటానికి అర్థం, ఫలం రెండూ ఉండవు. తన నియామకానికి, ఎన్నికతో నిమిత్తం లేదని అజర్ అన్నారు గాని, అది ఎవరూ నమ్మే మాట కాదు.
ఇంతకూ మైనారిటీ డిక్లరేషన్‌లో ఉన్నదేమిటి? అందులో అమలైందిఎంత? కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆ డిక్లరేషన్ రెండు పేజీలలో ఉంది. అందులో 5 భాగాలున్నాయి. అవి, 1) ఆర్థిక ప్రగతి, సాధికారత. తిరిగి అందులో 3 అంశాలున్నాయి. 2) విద్య, ఉపాధి. అందులో 4 అంశాలు. 3) హక్కులు, సంస్కృతి పరిరక్షణ. అందులో 4 అంశాలు. 4) మౌలిక సదుపాయాలు, సంక్షేమం. అందులో 2 అంశాలు. 5) అభివృద్ధికి ప్రోత్సాహం. అందులో 1 అంశం. ఆ విధంగా 5 భాగాలు, 14 అంశాలు. గత రెండేండ్లలో వీటన్నింటిలో ఏ ఒక్కటీ అమలైనట్టు లేదు. అవి అన్నీ విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు (6 నెలల్లోగా), బడ్జెట్ రూ.4 వేల కోట్లకు పెంచి సబ్‌ప్లాన్ ప్రకటన, యువకులూ మహిళలకూ సబ్సిడీ రుణాల కోసం ప్రతి ఏటా రూ.1,000 కోట్లు, ఎంఫిల్, పీహెచ్డీ చేసినవారికి రూ.5 లక్షల స
హాయం, 10వ తరగతి పూర్తయితే రూ.10 వేలు, ఇంటర్‌కు రూ.15 వేలు, గ్రాడ్యుయేట్లకు రూ.25 వేలు, పీజీకి రూ.లక్ష, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు, ఉర్దూ టీచర్లకు ప్రత్యేక డీఎస్సీ, మత బోధకులందరికీ నెలవారీ గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.12 వేలు, మైనారిటీల కమిషన్ చట్టం సవరణ, వక్ఫ్ బోర్డు బలోపేతం, శ్మశాన వాటికలకు భూముల కేటాయింపు, రక్షణ, ఇండ్లు లేనివారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఆడపిల్లల పెళ్లికి రూ.1,60,000, సెట్విన్ పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పాతబస్తీలో కులీ కుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సంబంధించినవి. ఇవేమీ అమలు కాలేదంటున్నది వారి నుంచి సాధారణ రూపంలో వినవస్తున్న మాట అయినందున నిర్దిష్టంగా జరిగిందేమిటో, జరగనిదేమిటో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక సందర్భంగా వివరాలు ప్రకటించి మైనారిటీలకు తెలియజేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఎన్నిక సమయంలోనే జూబ్లీహిల్స్‌లో ముస్లింల కోసం శ్మశాన స్థలం కేటాయింపు గందరగోళంగా మారి వారి నుంచి నిరసనలు ఎదురవుతున్నందున, మొత్తం డిక్లరేషన్ అమలుపై నివేదికను ఎన్నికకు ముందే ప్రకటించడం అవసరం.
గత రెండేండ్లలో డిక్లరేషన్ అమలు సంతృ ప్తిగా జరిగి ఉంటే, ఇప్పుడు వారి మద్దతుపై అనుమానాలు, వారిని ఒప్పించేందుకు ఒక ముస్లిం మంత్రిని రెండేండ్లు గడిచినాక హడావుడిగా నియమించటం వంటివి అవసరమయ్యేవే కావు. మైనారిటీలు కాని ప్రజల వలెనే మైనారిటీలు కూడా అమాయకులు కారు. సమాజంలో భాగస్వాములుగా తక్కినవారి వలెనే తాము కూడా మంచి చెడులను అనుభవిస్తూ, అన్నీ ఆలోచిస్తున్నారు. బీజేపీ నుంచి హాని ఉందనుకున్నచోట్ల, తమ భద్రత అన్నింటికన్న ముఖ్యం గనుక అభివృద్ధి మాట ఎట్లున్నా, ఆ ప్రమాదస్థితికి అనుగుణంగా ఓటు వేస్తున్న మాట నిజం. కానీ, తెలంగాణలో ఆ పరిస్థితి ఎప్పుడో పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బీజేపీ ప్రాబల్యం పెరిగి ముస్లింలకు సమస్య అవుతుందని మజ్లిస్ నాయకత్వం అప్పుడు ప్రచారం చేసింది గాని, అది నిజం కాదని బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రుజువైంది. మరొకవైపు ఆ పదేండ్లలో తమ బాగు కోసం చాలా జరిగిందని స్వయంగా ముస్లింలే చెప్తున్నారు.
అనగా , వారి ఆలోచనలలో ఉన్నది తమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం మాత్రమే. ఆ విధంగా వారి ఆలోచనలు, మైనారిటీలు కాని ఇతర ప్రజల ఆలోచనలు ఒక్కటే అవుతున్నాయి. మరొకస్థాయిలో చెప్పాలంటే, పైన అనుకున్నట్టు, ముస్లింలకు తమ కోసం ప్రకటించిన ప్రత్యేక డిక్లరేషన్ అమలు ఎంత అవసరమో, ప్రజలందరి కోసం ప్రకటించిన మ్యానిఫెస్టో కూడా అంతా అవసరం. వీటి అమలులో మంత్రిగా అజారుద్దీన్ పాత్ర ఏమి కావచ్చునన్నది వారు తప్పక గమనిస్తారు.
– టంకశాల అశోక్