‘జ్యోతిష్యం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ‘రాధేశ్యామ్’. నమ్మకం, అపనమ్మకం మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ భూమికపై కథ నడుస్తుంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రానటువంటి హృద్యమైన ప్రణయగాథ ఇది’ అన్నారు చిత్ర దర్శకుడు కె.కె.రాధాకృష్ణకుమార్.‘జిల్’ సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపుపొందారాయన. ద్వితీయ ప్రయత్నంగా ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు కె.కె.రాధాకృష్ణకుమార్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి..
సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర నేను రచయితగా, సహాయదర్శకుడిగా చాలా రోజులు పనిచేశాను. చాలా ఏళ్ల క్రితమే ఇద్దరం ఈ కథ అనుకున్నాం కానీ ముగింపు తట్టలేదు. దాంతో కొన్ని సంవత్సరాల పాటు ఆ కాన్సెప్ట్ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటిగారి అనుమతితో ఈ కథకు తుదిమెరుగులుదిద్దాను. ప్రభాస్‌కు చెప్పడంతో ఆయన ఓకే అన్నారు. నిర్మాతలు కూడా అంగీకరించడంతో ఈ సినిమా సెట్స్మీదకొచ్చింది.
ఈ సినిమా కథ అనుకున్నప్పుడే పాన్ఇండియా రేంజ్లో అత్యున్నత సాంకేతిక హుంగులతో తెరకెక్కించాలనుకున్నాం. తొలుత అనుకున్న కథతోనే సెట్స్మీదకొచ్చాం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కథలో ఎలాంటి మార్పులు చేయలేదు.
చాలా ఉద్వేగానికి గురయ్యారు. రెండున్నరగంటల పాటు నరేషన్ విని ‘సినిమా చేద్దాం డార్లింగ్’ అని మాటిచ్చారు. తొలుత ఈ కథను నేను ఓ హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్నా. ప్రభాస్ ఇచ్చిన సలహాతో యూరప్ నేపథ్యానికి మార్చాను. యూరప్ నేపథ్యంలో వింటేజ్ లవ్‌స్టోరీగా ఎవరూ సినిమా చేయలేదు కాబట్టి చాలా కొత్తగా ఉంటుందని ప్రభాస్ సూచించారు. ఇటలీ, జార్జియాలో ప్రధాన ఘట్టాల్ని తెరకెక్కించాం.
కీరో అనే పేరుతో యూరప్‌లో ఓ ప్రఖ్యాత జ్యోతిష్యుడు వుండేవారు. భారత్‌ను దర్శించి హిమాలయా యోగుల సాంగత్యంలో ఆయన జ్యోతిష్యాన్ని నేర్చుకున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం యూరప్‌లోని అత్యంత ప్రముఖులకు ఆయన జోస్యం చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో సినిమాలో ప్రభాస్ పాత్రను రాసుకున్నా. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని కూడా కథలో జోడించాం. సమాజంలో జాతకాల్ని నమ్మేవారుంటారు. నమ్మనివారు కూడా ఉంటారు. ఈ రెండు వర్గాల వారికి ఈ కథ కనెక్ట్ అవుతుంది.
ఆ విషయం సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. జ్యోతిష్యం తాలూకు ప్రామాణికతపై వేల సంవత్సరాలుగా చర్చ నడుస్తున్నది. అవసరం, విశ్వసనీయత లేకుంటే ఏదైనా సరే కాలగమనంలో అంతరించిపోతుంది..ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్ముతున్నారంటే ఎంతో కొంత నిజం ఉన్నట్లే కదా? అలా అయితే ఎంత వరకు నమ్మొచ్చు? ఇలాంటి అంశాల్ని ఈ సినిమాలో చర్చించాం.
అలాంటిదేమీ లేదు. ఓడ తాలూకు సీన్స్ ఉన్నాయి కాబట్టి అలా అనిపించింది. అంతేకానీ కథాపరంగా టైటానిక్‌తో ఎలాంటి సంబంధం ఉండదు.
రోమియోజూలియట్, లైలామజ్ను ప్రేమకథల స్థాయిలో ఉంటుందని చెప్పాం. ఆ కథల మాదిరిగాన ఇదొక అందమైన ప్రణయకావ్యం. ఏ ప్రేమకథలోనైనా సంఘర్షణే హృదయాల్ని కదిలిస్తుంది. ఈ కథలో ఉండే కాంప్లిక్ట్ పాయింట్ కూడా అంత బలంగా ఉంటుంది. అందుకే రొమియోజూలియట్తో పోల్చాం. అంతమాత్రానా ఇది విషాదాంత ప్రేమకథ మాత్రం కాదు.