దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటున్నదా?. అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులు తగ్గిపోవడం జీడీపీ పతనానికి సంకేతమేనా? ధరల కట్టడి కష్టతరమైపోయిందా?. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్.. అటు జీడీపీ, ఇటు ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది మరి.
Ajay Seth | న్యూఢిల్లీ, నవంబర్ 20 : దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో పడిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెప్తుండటం గమనార్హం. గతంతో పోల్చితే ఈసారి జీడీపీ గణాంకాలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ అంటుండటం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని cwసంతరించుకుంటున్నది. ఈ నెల 30న అధికారిక జీడీపీ గణాంకాలు విడుదల కానున్న క్రమంలో బుధవారం ఇక్కడ వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సేథ్.. కీలక వ్యాఖ్యల్నే చేశారు మరి. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ గణాంకాలు పెద్దగా తగ్గకపోవచ్చంటూనే 6.5-7 శాతంగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశ జీడీపీ 8.2 శాతంగా నమోదైంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ వేసిన అంచనా కూడా 7.2 శాతంగా ఉన్నది. మరి దానికంటే తక్కువకే జీడీపీ లెక్కల్ని సేథ్ చెప్తుండటం.. భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటున్నదనడానికి సంకేతమేనన్న అభిప్రాయాల్ని వినిపించేలా చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో అభివృద్ధి పనుల కోసం పెట్టే ఖర్చులూ తగ్గిపోయాయని అజయ్ సేథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన బడ్జెట్లో ప్రభుత్వ మూలధన వ్యయం లక్ష్యాన్ని రూ.11.11 లక్షల కోట్లుగా మోదీ సర్కారు పెట్టుకున్నది. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ.9.5 లక్షల కోట్లుగా ఉన్నది. అయితే ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్ కాలవ్యవధి)లో 37.3 శాతమే ఖర్చు పెట్టగలిగామని, నిరుడు ఇదే వ్యవధిలో నిర్దేశిత లక్ష్యంలో 49 శాతం ఖర్చు జరిగిందని సేథ్ గుర్తుచేశారు. దీంతో రకరకాల అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరుగలేదని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో గవర్నమెంట్ క్యాపెక్స్ ముందుకు కదలకపోవడం ఆర్థిక ఇబ్బందికర పరిస్థితుల్నే సూచిస్తుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం కూడా పోయినసారి పెట్టినంతే అభివృద్ధి పనుల ఖర్చులుండవచ్చని సేథ్ సంకేతాలిస్తుండటం గమనార్హం.
ఆహార ధరలు ఆందోళనకరంగా ఉన్నాయని అజయ్ సేథ్ అన్నారు. గత నెల అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 6.21 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ పెట్టుకున్న 6 శాతం లక్ష్యాన్ని మించి ఇది ఉండటం.. రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్ల కోతలకున్న అవకాశాల్ని బాగా తగ్గించేసింది. టోకు ధరల సూచీ కూడా పెద్ద ఎత్తునే ఎగబాకింది. ఈ క్రమంలో ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర సమస్యగానే పరిణమించిందని సేథ్ వ్యాఖ్యానించారు. అయితే ఓవరాల్‌గా ద్రవ్యోల్బణం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఏమీ ఉండకపోవచ్చనే విశ్వాసాన్నే వెలిబుచ్చారు. కానీ వరుసగా పెరుగుతున్న ఆహార, వస్తూత్పత్తుల ధరలు అటు మార్కెట్‌ను, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగానే తయారవుతున్నాయి. కిలో కూరగాయలు రూ.60-100 పలుకుతుండగా, పప్పుధాన్యాలు రూ.100-180కి అమ్ముడుపోతున్నాయి. వంటనూనెలు, మాంసం, గుడ్లు, చేపలు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. అయినప్పటికీ ధరల కట్టడిలో ప్రభుత్వ చర్యలు శూన్యమన్న విమర్శలు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
దేశ జీడీపీ ఈ జూలై-సెప్టెంబర్‌లో 6.5 శాతంగానే నమోదు కావచ్చని ప్రముఖ భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. భారీ వర్షాలు, కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన నిరాశాజనక ఆర్థిక ఫలితాలే వృద్ధిరేటు అంచనాలు తగ్గేందుకు కారణంగా ఇక్రా పేర్కొన్నది. ఈ క్రమంలో పారిశ్రామిక రంగం ముఖ్యంగా గనులు, విద్యుదుత్పత్తి రంగాల్లో మందగమనం ఛాయలు కనిపిస్తున్నాయని చెప్పడం గమనార్హం. కాగా, తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జీడీపీ 6.7 శాతంగా ఉన్నది. మరోవైపు నగర-పట్టణ మార్కెట్లలో డిమాండ్ పడిపోయిందంటున్న నేపథ్యంలో ఈ అంచనా ప్రాధాన్యతను సంతరించుకున్నది.