హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రిలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా వైటీడీఏ అధికారులు సకల జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి కాలువ నిర్మాణ పనులను జలమండలి (హైదరాబాద్ మెట్రో వాటర్వర్క్స్) నిర్వహిస్తున్నది. ఆలయ సమీపంలో రూ.17 కోట్లు వెచ్చించి, రెండు మురుగు నీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నారు. వీటిని మూవింగ్ బెడ్ బయో రియాక్టర్ (ఎంబీబీఆర్) అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టెంపుల్ కాంప్లెక్స్ సమీపంలో ఒకటి, గండి చెరువు వద్ద మరొకటి ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కొక్కటి 2.40 ఎంఎల్డీ సామర్థ్యంతో పనిచేయనున్నాయి. వీటిని త్వరలో ప్రారంభించనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు.