MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 12: అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్, 13 సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు పాలన చేతగాక కేసీఆర్ కుటుంబంపై అభాండాలు మోపుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర నెలసరి ఆదాయం రూ. 4 వేల కోట్లని, ఎనిమిదేళ్లలో కేసీఆర్ రూ. 18 వేల కోట్లకు పెంచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో పథకాలు సవ్యంగా సాగాయని ప్రతీ నెలా ఠంచన్ లబ్ధిదారులకు పింఛన్లు అందించారని చెప్పారు. కాంగ్రెస్ పాలకులకు బూతులు, తిట్లు తప్ప పాలన చేతగాదని ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.లక్ష, తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనే ఇప్పటికి అమలు చేస్తున్నారని, రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని, వ్యాపారాలు మందగించాయని, రియల్ ఎస్టేట్ రంగం కూదేలయిందని, ఐటీ కంపనీలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, రైతు బందు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, పట్టణ బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, ఉపాధ్యక్షుడు అస్లాం ఖురేషీ, యువజన అధ్యక్షుడు మహ్మద్ అతిక్, నాయకులు సత్యం, సందయ్య, ఆంజయ్య, రాజ్‌కుమార్, గంగాధర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.