అనంతగిరి, డిసెంబర్ 26 : భారతదేశ రాజకీయాల్లో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజా ప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా శుక్రవారం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరి సహకారంతో యూపీఏ ప్రభుత్వంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్ర ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్రోద్యమ పితామహుడు మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాలకు తీసేస్తూ దేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నీరుగారుస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో సిపిఐ వందేండ్ల వార్షికోత్సవ ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 2026 జనవరి 18న ఖమ్మంలో జరిగే జాతీయస్థాయి సిపిఐ వందేండ్ల ఉత్సవ ముగింపునకు వేల సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యారాసాని రవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగభద్రం, మండల యువజన సంఘం అధ్యక్షుడు డేగ వీరయ్య, శాంతినగర్, అనంతగిరి గ్రామ శాఖ కార్యదర్శి, శాంతినగర్ సర్పంచ్ ఉమా, ఉప సర్పంచ్ స్వాతి, వార్డు సభ్యురాలు స్నేహ, నరేశ్, వెంకటేశ్వర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.