Kidney Stones | మన శరీరంలోని అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. శరీర ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని వడకట్టడంలో, శరీరం నుండి వ్యర్థాలను, అదనంగా ఉన్న నీటిని తొలగించడంలో, శరీరంలో ఎలక్ట్రోలైట్ ల స్థాయిలను అదుపులో ఉంచడంలో మూత్రపిండాలు మనకు సహాయపడతాయి. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణ, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరమయ్యే హార్మోన్లను కూడా మూత్రపిండాలు విడుదల చేస్తాయి. మూత్రపిండాలు అనేక విధులను నిర్వర్తించినప్పటికీ వాటి ముఖ్య విధి మాత్రం రక్తాన్ని వడకట్టడమే. ధమని నుండి రక్తం మూత్రపిండాల్లో ఉండే నెఫ్రాన్లలోకి ప్రవేశిస్తుంది. గ్లోమెరులర్ వడపోత అనే సంక్షిష్ట ప్రక్రియ ద్వారా ఇక్కడ రక్తం వడకట్టబడుతుంది. వ్యర్థ పదార్థాలు, అదనంగా ఉండే నీరు శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు పంపబడతాయి.
ఇలా రక్తాన్ని వడకట్టినప్పుడు మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాలు, ఖనిజాలు పేరుకుపోతాయి. ఇవి గట్టి పడి రాళ్లలాగా మారతాయి. వీటినే మూత్రపిండాల్లో రాళ్లు అంటారు. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే కొందరికి మాత్రం వారికి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయన్న సంగతే తెలియదు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను చూపిస్తుంది. ఈ సంకేతాలను బట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని గ్రహించాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు శరీరం చూపించే అసాధారణ సంకేతాల వివరాలను వైద్యులు వెల్లడిస్తున్నారు. మూత్రంలో రక్తం.. ఈ లక్షణాన్ని హెమటూరియా అని పిలుస్తారు. రాళ్లు కదిలి మూత్రనాళం పొరకు రాపిడి కలిగినప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఇది తీవ్రమైన సమస్య కానప్పటికీ అంతర్లీన అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. కనుక మూత్రంలో రక్తం గమనించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు మూత్ర విసర్జన సమయంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా కూడా ఉంటుంది. ఇది సాధారణం కానందున వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు కొన్నిసార్లు మూత్రనాళాల్లో ఇన్పెక్షన్ కు దారి తీస్తాయి. దీంతో జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక జ్వరానికి గల కారణాన్ని అంచనా వేయడం కూడా చాలా ముఖ్యం. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం వల్ల దుర్వాసనతో కూడిన మూత్రం వస్తుంది. మూత్రనాళాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. కనుక మూత్ర విసర్జన సమయంలో మూత్రాన్ని గమనించడం కూడా చాలా ముఖ్యం. మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం వల్ల నీరసం ఎక్కువగా ఉంటుంది. చిన్న పనిచేసినప్పటికీ వెంటనే అలసిపోతుంటారు. కనుక తరచూ నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారు వైద్యున్ని సంప్రదించి అలసటకు గల కారణాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
మూత్రనాళాల్లో ఉండే నరాలను మూత్రపిండాల్లో ఉండే రాళ్లు ప్రభావితం చేస్తాయి. దీంతో కాళ్లు, వీపు, తొడలు, గజ్జలు వంటి భాగాల్లో తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తరచూ తిమ్మిర్లు రావడం అసాధారణ లక్షణం కాదు. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం. మూత్రనాళాల్లో ఉండే నరాలపై రాళ్లు ఒత్తిడిని కలిగించినప్పుడు కూర్చోవడానికి, ఎక్కువసేపు నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. నిలబడడం కూడా కొన్నిసార్లు కష్టతరంగా మారుతుంది. ఇటువంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక మూత్రపిండాల పనితీరును వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.