న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా చేసిన ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లో విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ప్లేయర్లను నిష్పక్షపాతంగా ఎంపిక చేయడం లేదని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నదని మనిక ఆరోపిస్తూ ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై ఆమె ఆరోపణలు చేసింది. సౌమ్యదీప్ శిక్షణ ఇస్తున్న అమ్మాయి కోసం ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో తనను ఓడిపోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌లో వివక్షతోనే తనను ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ వాదనలు విన్న జస్టిస్ రేఖ ఇద్దరు జడ్జిలతో పాటు ఒక క్రీడాకారుడితో కూడిన కమిటీ విచారణ చేయాలని బుధవారం ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 20కి వాయిదా పడింది.