పెద్దేముల్, నవంబర్ 28 : గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలో కలెక్టర్ నామినేషన్లకు సంబందించిన క్లస్టర్ల వారీగా కేంద్రాలను పరిశీలించారు. మంసాన్పల్లి క్లస్టర్లో మంసాన్పల్లి, కొండాపూర్, చైతన్య నగర్, దుగ్గాపూర్, మదనంతాపూర్ అదే విధంగా మంబాపూర్ క్లస్టర్లో మంబాపూర్, జనగాం, మారేపల్లి, మారేపల్లి తండా గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల కేంద్రాలను అదే విధంగా కందనెల్లి క్లస్టర్లో కందనెల్లి, కందనెల్లి తండా, రుక్మాపూర్ , రేగోండి గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు , పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధృవ పత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. నామినేషన్ల ఫారాలను సృష్టంగా చూసి వాటి ల్లో ఏవైన తప్పులు ఉంటే సరి చేసుకునే విధంగా అభ్యర్థులకు సహకరించాలన్నారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థులకు వ్యయాలకు సంబందించి బ్యాంక్ ఖాతాలు ఉండాలని ఆయన సూచించారు. సర్పంచ్, వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగా ఖర్చులు పెట్టాలనే విషయం అభ్యర్థులకు సృష్టంగా తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు. నామినేషన్ల కేంద్రాల పరిశీలనలో ఎంపీడీఓ రతన్ సింగ్, రిటర్నింగ్ , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.