కొడంగల్, ఎప్రిల్ 23 : దీర్ఘ కాలిక భూ సమస్యల శాశ్విత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం మండలంలోని పర్సాపూర్ గ్రామ రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు, సాదా బైనామాలు వంటి సేవలు సులభతరం కానున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగకుండా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తారని తెలిపారు.
రైతు సమస్యలను తెలుసుకునేందుకు గాను తసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భూ సమస్యలను మండల, డివిజన్ జిల్లా స్థాయిలో పరిష్కరించుకునే విధంగా భూ భారతిలో మంచి అవకాశం కల్పించామన్నారు. అనంతరం పట్టణ కేంద్రంలో నిర్మాణాలు చేపడుతున్న నూతన మున్సిపల్ కార్యాలయం, ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఇంటిగ్రేట్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎటువంటి నాణ్యాతా లోపాలు లేకుండా నిర్మాణం పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలొ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, గ్రంథాలయ చైర్మన్ రాజేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, తసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో ఉషశ్రీ, మండల వ్యవసాయాధికారి తులసితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.