చుంచుపల్లి, సెప్టెంబర్ 28 : చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన స్థాయి, బోధనా విధానాన్ని పరిశీలించారు. పదో తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి ప్రధానోపాధ్యాయుడు రవికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం పాత కొత్తగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఓపీ రోగుల వివరాలు, వైద్య సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ సేవలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు ముందుగానే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ నాగరాజు, ఎంఈఓ నీరజ, వైద్యాధికారి, నర్సులు, సిబ్బంది ఉన్నారు.

చుంచుపల్లి పాఠశాల, ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ