హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టుగా ఉన్న సహకార బ్యాంకులు ఇప్పడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగాయి. ఇతర దేశాలు సైతం తెలంగాణ సహకార బ్యాంకుల విధానాలను అనుసరిస్తున్నాయి. గత తొమ్మిదేండ్లలో ఈ బ్యాంకులు గణనీయ వృద్ధిని సాధించాయి. నాటి సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు నాయకత్వంలో అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిచాయి. పలు సంస్కరణలతో రైతులకు అద్భుత సేవలను అందిస్తూ సహకార బ్యాంకులపై వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించాయి. దీంతో రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థను అనేక అవార్డులు వరించాయి.
9 ఏండ్లలో 30 వేల కోట్లకుపైగా వృద్ధి
తెలంగాణలో 2014 నాటికి రూ.13,156 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల వ్యాపార పరిమాణం 2023లో రూ.43,264 కోట్లకు చేరింది. అంటే.. గత తొమ్మిదేండ్లలోనే రూ.30,108 కోట్ల బిజినెస్ పెరిగింది. ఇందులో టెస్కాబ్ వ్యాపారం రూ.6,307 కోట్ల నుంచి రూ.20,940 కోట్లకు, డీసీసీబీల వ్యాపారం రూ.6,849 కోట్ల నుంచి రూ.22,324 కోట్లకు వృద్ధి చెందింది. 2014 నాటికి తెలంగాణలో 292గా ఉన్న సహకార బ్యాంకుల శాఖల సంఖ్య గత సంవత్సరం చివరి నాటికి 437కు, వినియోగదారుల సంఖ్య 11.01 లక్షల నుంచి 32.94 లక్షలకు పెరిగింది. దీంతో డిపాజిట్లు రూ.5,257 కోట్ల నుంచి రూ.15,581 కోట్లకు చేరాయి. అంటే.. గత తొమ్మిదేండ్లలో రూ.10,324 కోట్ల డిపాజిట్లు పెరిగాయి.
ఉద్యోగులకు వరంలా
ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలోని సహకారం బ్యాంకు ఉద్యోగులకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించింది. ఎలాంటి అవకతవకలు, ఆరోపణలు లేకుండా 7,165 ఉద్యోగాలను భర్తీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక హెచ్ఆర్ పాలసీని ప్రవేశపెట్టింది. క్రమం తప్పకుండా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి ఐబీపీఎస్ ద్వారా పారదర్శకంగా పదోన్నతులు కల్పించింది.
సహకార బ్యాంకింగ్‌పై కొండూరి ముద్ర
తెలంగాణలోని సహకార బ్యాంకులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపును పొందడం వెనుక కొండూరి రవీందర్రావు కృషి ఎనలేనిదని ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు. టెస్కాబ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటి రూపురేఖలను మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగారు. 2005 నుంచి మూడు పర్యాయాలు గంభీరావుపేట ప్రాథమిక సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షునిగా 19 ఏండ్లు పనిచేశారు. 2015లో టెస్కాబ్ చైర్మన్‌గా ఎన్నికయ్యాక నాటి సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోని సహకార బ్యాంకుల బలోపేతానికి చర్యలు చేపట్టారు. అందుకోసం అనేక దేశాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వచ్చారు. తద్వారా సహకార బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు.
విప్లవాత్మక సంస్కరణలు
తెలంగాణ సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో కొండూరి రవీందర్రావు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించారు. ప్రాథమిక సహకార సంఘాలు మొదలుకొని టెస్కాబ్ వరకు అన్ని బ్యాంకుల్లో కార్యకలాపాలను కంప్యూటీకరించడంతోపాటు సైబర్ దాడులను ప్రతిఘటించేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఖాతాదారులకు తొలిసారి రూపే ప్లాటినం కార్డులను జారీ చేయడంతోపాటు మొబైల్ ఏటీఎం సేవలను అందించారు. ఈ విధానాలను అనుసరించేందుకు కేంద్రంతోపాటు పలు రాష్ర్టాల ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. టెస్కాబ్ను సందర్శించి ఆ విధానాలపై అధ్యయనం చేశాయి.
అవార్డులే అవార్డులు
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తనదైన ముద్రను వేసింది. దీంతో పలు జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణను వరించాయి. 2020-21లో టెస్కాబ్ను దేశంలోనే ఉత్తమ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా నాబార్డు ప్రకటించింది. ఆ తర్వాత 2016-17, 2017-18లో వరుసగా రెండు సార్లు నాఫ్కాబ్ ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును కైవసం చేసుకున్న టెస్కాబ్.. 2020-21లో మూడో స్థానంలో, 2021-22లో రెండో స్థానంలో నిలిచింది. 2018-19లో బెస్ట్ హెచ్ఆర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డును, 2023లో ‘బ్యాంకో బ్లూ రిబ్బన్-2022’ అవార్డును గెలుచుకున్నది.