హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ ఇంధన అవసరాల కోసం బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గు తీసే పరిస్థితి ఉండబోదని, ప్రైవేట్ రంగం నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొవాల్సి ఉంటుందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రైవేట్ రంగ సంస్థల నుంచి ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొవడానికి కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంకితభావం, క్రమశిక్షణతో సింగరేణీయులు శ్రమశక్తితో పనిచేస్తే సింగరేణికి మరో వందేండ్లపాటు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. గత వందేళ్ళలో భారత్లో ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలు మూతపడగా..సింగరేణి మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని దిగ్గజ సంస్థల కంటే అధిక పనితీరు కనబరుస్తున్నదన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ 68 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అదేవిధంగా ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించబోతున్నామని ఆయన చెప్పారు. అదేవిధంగా వచ్చే మూడేండ్లలో ఒడిశాలో ప్రారంభించబోయే 10 బొగ్గు గనుల నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తే కంపెనీ 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తిని సాధించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.