హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పసలేని ప్రసంగంతో సమయం వృథా చేశారని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎక్కడిక్కడ నిలదీయడమే గాక ఆధారాలతో ప్రభుత్వ తీరును ఎండగడుగుతున్నది. ఈ క్రమంలో అసెంబ్లీలో శనివారం ఇదే అంశంపై మంత్రి పొంగులేటి ప్రత్యేక చర్చ పెట్టారు. దాదాపు 4గంటల పాటు ఏకబిగిన ప్రసంగించారు. ఒకవైపు తప్పు జరిగిందని అంగీకరిస్తూనే, మరోవైపు బీఆర్ఎస్పై నిందారోపణలకు దిగారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత దూషణలకే ఎక్కువ సమయం కేటాయించారు. అయితే పొంగులేటి తీరుపై స్వయంగా ముఖ్యమంత్రే సీరియస్ అయినట్టు తెలిసింది. 4గంటలపాటు మాట్లాడినా విషయం ప్రజల్లోకి వెళ్లలేదని అసహనం వ్యక్తం చేశారని సమాచారం. సభా సమయం వృథా తప్ప ప్రభుత్వానికి ఒరిగిందేమీ లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీవర్గాలే తెలుపుతున్నాయి. దీంతో 22ఏపై మాట్లాడేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారని, అందుకే సభను 16కు వాయిదా వేయించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
వాస్తవంగా 22ఏ అంశంపై చర్చ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తారని అంతా భావించారు. అదీగాక శాసనమండలి సమావేశాలకు అప్పటికే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా ఇప్పటివరకు ఎప్పుడైనా మండలి, అసెంబ్లీ సమావేశాలను ఒకేసమయంలో వాయిదా వేయడం కూడా ఆనవాయితీగా కొనసాగుతున్నది. కానీ ఈసారి అందుకు భిన్నంగా మండలి సమావేశాలను నిరవధిక వాయిదా పడినా కూడా అసెంబ్లీ సెషన్‌ను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాన్ని 16కి వాయిదా వేస్తున్నట్టు ప్యానల్ స్పీకర్ బాలునాయక్ ప్రకటించారు. వాస్తవంగా 15వ తేదీన ఏర్పాటు చేసుకునే అవకాశమున్నా 16కి వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది. 22ఏపై మరింత ప్రిపరేషన్ కోసమేనని చర్చ కొనసాగుతున్నది. మరోవైపు ఎల్ నినో అంశంపై చర్చ ఉంటుందని తెలుస్తున్నది.