వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టమూ రానివ్వడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసుల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. ముద్గలపురాణంలో వినాయకచవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంది. కణ్వమహర్షి భరతుడికి గణపతి తత్త్వాన్ని, భాద్రపద శుక్ల చవితి వ్రత మహిమ గురించి వివరించినట్లు అందులో ఉంది. ప్రధానంగా మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గలపురాణం స్పష్టంగా చెబుతున్నది.
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈ విధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేసి, ఆ మృణ్మయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది.
మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీ తత్త్వం కలిగి ఉంటుంది. పృథ్వి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ, దాని తత్త్వం 1/2 వంతు, మిగిలిన నాలుగు భూతాల తత్త్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమిని తీసుకుంటే అందులో భూతత్త్వం 1/2 భాగం అయితే, 1/8 భాగం జలం, 1/8 భాగం అగ్ని, 1/8 భాగం వాయువు, 1/8 భాగం ఆకాశం ఉంటాయి. దీన్నే ‘పంచీకరణం’ అంటారు. ఒక్కో తత్త్వానికి ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటారు. భూతత్త్వానికి అధిష్ఠాన దేవత గణపతి, ఆకాశ తత్త్వానికి ఈశ్వరుడు (శివుడు), జల తత్త్వానికి నారాయణుడు, అగ్ని తత్త్వానికి అంబిక, వాయు తత్త్వానికి ప్రజాపతి (బ్రహ్మ) అధిదేవతలు. మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్త్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన దేవతల తత్త్వాలు అన్నీ కలిపి 1/2 భాగం ఉంటాయి.
‘ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ అన్నట్లు ఎన్నో రూపాల్లో, ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట. ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసే గణపతి మూర్తులను ఆరాధించడం వల్ల కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టి ధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్లలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్త్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి.
బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం- ఈ నాలుగింటి పరిపూర్ణ, దివ్య తత్త్వమే గణపతి స్వరూపం. ‘బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు’ అని పార్వతికి శివుడు బోధించినట్లు హేరంబ ఉపనిషత్తు వర్ణిస్తున్నది. బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వ సాధారణం. నాగాయుత బలుడు (పదివేల ఏనుగుల బలం కలవాడు), మహా బలశాలి అని వర్ణించడం పురాణాల్లో కనిపిస్తుంది. భీముడికి ఈ బిరుదు ఉంది. గజవదనుడైన గణపతి బలానికి సంకేత రూపం. ఇంకొక కోణంలో, ఏనుగు ఐశ్వర్యానికి సూచన. గజలక్ష్మి రూపానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి. గణపతిని సంపదలకు దేవతగా, ప్రదాతగా భావిస్తారు. లక్ష్మీ గణపతి ఉపాసనలో ఈ తత్త్వాన్నే చెబుతారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా, శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి.
యోగశాస్త్రంలో వినాయకుణ్ని మూలాధారచక్ర అధిష్ఠాన దేవతగా భావిస్తారు. మూలాధారంలో సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకొని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. సాధకుడు యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేల్కొలపాలి. దీంతో మిగిలిన ఐదు చక్రాలు కూడా ఉత్తేజితం అవుతాయి. చివరగా, హంస రూపంలో మనిషి శరీరంలో సంచరించే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. కపాలమోక్షం ద్వారా అక్కడి నుంచి ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇంతటి యోగప్రక్రియ జరగటానికి మూలాధారం ‘మూలాధారానికి ఆధిష్ఠాన దేవతగా ఉన్న గణపతి’.
సుషుమ్న నాడిని అనుసరించి ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో ‘ఇడ’ జ్ఞానానికి (బుద్ధి) సంకేతం కాగా, ‘పింగళ’ సిద్ధికి సంకేతం. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార స్వరూపమైన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడని భావం. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనటంలో అంతరార్థం కూడా ఇదే.