రామగిరి, జూలై 18 : బనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉందని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనకచర్లపై సమావేశం జరిగి ఉంటే ఆ సమావేంలో తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రానికి వరద, మిగులు జలాలపై స్పష్టమైన వాటాలను తేల్చాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారు. అట్టి బిల్లును మూడు నెలల్లోపు తేల్చాలని సుప్రీంకోర్టు సైతం సూచించింది. అయినప్పటికీ రాష్ట్రపతి గాని, కేంద్రం గాని బిల్లును ఆమోదిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? స్పష్టతనివ్వలేదు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగలు ఇస్తామని మేనిఫెస్టో ద్వారా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రకటన చేయించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరుద్యోగులు చేసే ప్రతి పోరాటానికి సిపిఐఎం అండగా ఉంటుందని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న మల్లేశ్ అనే యువకుడిని యువతి బధువులు హత్య చేశారు. కులం, పరువు పేరుతో రాష్ట్రంలో ఇప్పటివరకు 42 హత్యలు జరిగాయి. ఇటువంటి దారుణ ఘటనలో చోటుచేసుకోకుండా ప్రభుత్వం స్పందించి కులాంతర వివాహ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గ్రామాలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు లేని బాధితులు 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలను గుర్తించి 120 గజాల స్థలాన్ని కేటాయించాలన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, మహిళలకు రూ.2,500, రాజీవ్ యువ వికాస పథకం అమలు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి 10 నుండి 12 గంటల పని విధానాన్ని అమలు చేసి శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, గ్రామ, పట్టణాల్లోని ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు కోసం ఉద్యమించబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేశ్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, ప్రభావతి, వి.వెంకటేశ్వర్లు, ఎండి.హాశం, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.