హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ పరిధి లోపల ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటుచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరిస్తున్నదని, రాబోయే వందేండ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. శుక్రవారం రాత్రి అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలను నియంత్రించే బాధ్యత కూడా హైడ్రా తీసుకోనున్నదని వెల్లడించారు. నాలాలు ఆక్రమణ చేయాలంటేనే గుండెల్లో గుబులు పుట్టేలా వ్యవస్థను తీసుకొస్తున్నట్టు వివరించారు. 58 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవప్మెంట్ ప్రాజెక్టు చేపడుతున్నామని, ఇందుకు గ్లోబల్ టెండర్లు పిలిచామని వివరించారు. మిరాలం చెరువుపై 2.6 కిలోమీటర్ల సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తామని, 30 రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. చెరువులో లండన్ ఐ లాంటి టవర్ను నిర్మిస్తామని పేర్కొన్నారు.