హనుమకొండ చౌరస్తా : దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై (Supreme Court Verdict) సీఎం రేవంత్రెడ్డి ( Revanth Reddy )స్పందన తెలిపాలని మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు, రిటైర్డు డీఎస్పీ దామెర నర్సయ్య కోరారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పూర్తిస్థాయిలో వెలువడక ముందే సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో నిండు శాసనసభలో ప్రకటించి, సుప్రీంకోర్టు సూచనలకు వ్యతిరేకంగా, అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేశారని గుర్తుచేశారు. దళిత క్రిస్టియన్స్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఇచ్చి, 20 రోజులు గడిచినా సీఎం నిర్ణయం తీసుకోకపోవడం, మౌనం వెనుక ఉన్న ఆంత్యర్యమేమిటని ప్రశ్నించారు. ముందుగా మత ప్రతిపాదికగా లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ బండి అశోక్ మాట్లాడుతూ మాదిగలు, రెడ్లు ఒకటేనని చెప్పుకున్న సీఎం రేవంత్రెడ్డి మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తూ, మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మాదిగనని చెప్పుకున్న దళిత ద్రోహి నారాచంద్రబాబు నాయుడు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగలేనని గ్రహించిన ముఖ్యమంత్రి ముందస్తుగా మాదిగల ఓటు బ్యాంకు కోసం వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. సమావేశంలో రిటైర్డు ఈఈ బండెల భద్రయ్య, మాల సంఘాల జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వినర్లు శేషాద్రి నాగులు, వంగేటి రాజమౌళి, పోతుల కొమ్మలు, సాదు కుమారస్వామి,కట్ట బాబు, గొర్రె రమేష్,కొరివి అనీల్, కునమళ్ల రవీందర్, బుజుగుండ్ల అనిల్, సదువాల సారంగపాణి, సురాసి విక్రమ్, జిట అనిల్, దార నర్సింగరావు పాల్గొన్నారు.