Teachers | హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్యావారోత్సవాలను సోమవారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో రూ.1,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీచర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలిస్తున్నామని, రాష్ట్రంలోని 19లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు వారి చేతిలో ఉన్నందున అదనంగా పనిచేయాలని సూచించారు. బడుల్లో గంటకొట్టేవాళ్లు ఊడ్చేవాళ్లు.. మంచినీళ్లు ఇచ్చేవాళ్లు లేరని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్ కిట్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని, నాణ్యతలేని వస్తువులు సరఫరా చేసే కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, జైళ్లో వేయించే బాధ్యత తనదని హెచ్చరించారు.

01
పేద విద్యార్థులు అర్ధాకలితో స్కూళ్లకు వస్తున్నారని వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తామని సీఎం చెప్పారు. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది. తెలంగాణలో కాలం చెల్లిన సిలబస్‌నే ఇంకా కొనసాగిస్తున్నాం. దీనిని మార్చేందుకు నూతన విద్యావిధానాన్ని తీసుకొస్తున్నాం. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ప్రవేశపెడుతున్నాం. వచ్చే ఏడాది ఇంటర్‌బోర్డును విద్యాశాఖలో విలీనం చేస్తాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్తమ టీచర్లను సన్మానిస్తాం. తామ్రపత్రం అందజేస్తాం’ అని సీఎం ప్రకటించారు. విద్యాశాఖకు 15శాతం నిధులు కేటాయించలేకపోయామని, దశలవారీగా కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్సిటీల వైస్చాన్స్లర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు విద్యాశాఖ చుక్కలు చూపించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి మధ్యాహ్నం 2గంటలకే ఎల్బీ స్టేడియానికి చేరుకున్న విద్యార్థులు అక్కడి షెడ్ల కింద సేదతీరాల్సి వచ్చింది. రాత్రి 8.30 గంటల వరకు సభ జరుగగా, దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. అంతేగాక కార్యక్రమానికి హాజరైన వారికి చిన్నారులు, విద్యార్థుల చేత మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేయించడం గమనార్హం. ఈ సందర్భంగా సంచులను విద్యార్థులు మోసుకొచ్చి సభకు వచ్చిన వారికి పంపిణీ చేయడం కని అక్కడున్న వారిని కలచివేసింది.