LPG Gas Subsidy | న్యూఢిల్లీ, మే 11: సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనున్నది. ఇప్పటికే గ్యాస్ ధరలను భారీగా పెంచిన కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇప్పుడు సబ్సిడీకి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నది. దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు సబ్సిడీపై కొత్త సమీక్షను చేపట్టాయి. రూ. 10 లక్షలకుపైగా ఆదాయం ఉన్న ఎల్పీజీ వినియోగదారులు త్వరలో సబ్సిడీని కోల్పోయే అవకాశం ఉంది.
వంటగ్యాస్ సిలిండర్లను పొందడానికి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి డెలివరీ అథెంటికేషన్ కోడ్(డీఏసీ) గందరగోళం తర్వాత చమురు కంపెనీలు ఎల్పీజీ సబ్సిడీ అర్హతకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం ప్రారంభించాయి. రూ. 10 లక్షలు లేదా అంతకుమించిన వార్షికాదాయం ఉన్న కుటుంబాలు గృహవినియోగ వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ప్రయోజనాలను త్వరలో కోల్పోయే అవకాశం ఉంది. ఆదాయ పన్ను రికార్డులను వినియోగించి నిర్వహిస్తున్న కొత్త ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.
ప్రకటించిన కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిని దాటిన వినియోగదారులను చమురు కంపెనీలు గుర్తించడం ప్రారంభించాయి. తమ సబ్సిడీని నిలిపివేస్తున్నట్లు చమురు కంపెనీల నుంచి వినియోగదారులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఏకీభవించని వినియోగదారులు ఏడు రోజుల్లోపల 1800-2333-555 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించడం లేదా సంబంధిత చమురు కంపెనీకి చెందిన ఆన్లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని చమురు కంపెనీలు చెబుతున్నాయి. నిర్ణీత వ్యవధిలోగా ఎటువంటి స్పందన రాకపోతే సబ్సిడీ ఆటోమేటిక్‌గా నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఆదాయ పన్ను అధికారుల ప్రకారం వినియోగదారుడి లేదా కుటుంబ సభ్యుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సంవత్సరానికి రూ. 10 లక్షలకు మించి ఉందని చమురు కంపెనీలు పంపిన సందేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆ కుటుంబం ఇకపై సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లకు అర్హతను కోల్పోవచ్చు. అభ్యంతరాలు తెలియచేయడానికి లేదా వివరణలు కోరడానికి వినియోగదారులకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని వినియోగదారులు ప్రతి 14.2 కిలోల గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై దాదాపు రూ. 59.05 సబ్సిడీని పొందుతున్నారు. ఏడాదికి 12 నుంచి 13 సిలిండర్లపై సబ్సిడీ లభిస్తున్నది. ఏడాది గరిష్ఠంగా 15 సిలిండర్లకు సబ్సిడీ పరిమితిని విధించారు. సబ్సిడీ ప్రయోజనం లేకుండా అదనపు సిలిండర్ల సరఫరా జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా సబ్సిడీ విధానం అలాగే కొనసాగుతున్నది.