హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా క్లాసులకు హాజరుకానున్నారు. కోర్సులో భాగంగా మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ క్యాంపస్‌లో జనవరి 25 నుంచి 30 వరకు స్పెషల్ క్లాసులు జరుగనున్నాయి. వారం రోజులపాటు సాగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ముగిసిన తరువాత యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ అందుకొని ఫిబ్రవరి 2న హైదరాబాద్ తిరిగి రానున్నారు.
మరోవైపు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో దావోస్ వెళ్లిన రాష్ట్ర బృందానికి నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాకపోవడంతో కేవలం రూ.28,623 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటిచెప్పినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. సీఎం వెంట దావోస్ వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ర్టానికి తిరిగి ప్రయాణమయ్యారు.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలంటూ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ, యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలంటూ గురువారం ‘డిమాండ్స్ డే’ని పాటించినట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు తెలిపారు. కార్మికులు ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న హకులను కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ నిర్ణయించిందని వెల్లడించారు.