మల్కాజిగిరి, ఏప్రిల్ 8: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున 65 మంది లబ్ధిదారులకు రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్‌ను ఆయన అందజేశారు. ఎంపికకు ముందు వారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి సంతృప్తి చెందిన వారిని ఎంపిక చేశారు. ఇందులో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లకు చెందిన పురుషులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారు. ప్రస్తుతం మా ర్కెట్లో వ్యాపారపరంగా ఉపయోగంగా ఉండే మినీ సూపర్ బజార్, క్యాబ్‌లు, ట్రాక్టర్, వస్ర్తాల షాపు, ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్, ఇంటర్నెట్, టిఫిన్ సెంటర్, టెంట్ హౌజ్, గో ఫర్ లారీ, డీటీపీ సెంటర్, క్యాటరింగ్, రవాణా యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసుకున్నారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఒక్కొక్కరికీరూ.10లక్షలతో యూనిట్లను ఏర్పాటు చేయడానికి సమ్మతించారు. దళిత బంధును అమలు పరుస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ‘ప్రజా దర్బార్’లో హామీ ఇచ్చారు. యూనిట్ల పనితీరును అధికారులు ఆరు నెలల పాటు పర్యవేక్షించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పార్టీలకు అతీతంగా పారదర్శకంగా జరిగింది.
‘దళిత బంధు’ ద్వారా వచ్చిన రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కోసం ఒక యూనిట్‌ను ఏర్పాటు చేస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇది నిజమేనా అని అనిపిస్తున్నది. సెంట్రింగ్, రూఫ్ కాంక్రీట్ మిక్సింగ్ మిషన్‌ను ఏర్పాటు చేస్తాను. సీఎం కేసీఆర్‌కు జేజేలు.
– శోభారాణి, మల్కాజిగిరి
ఊహించని పరిణామం ఇది. ‘దళిత బంధు’కు నన్ను ఎంపిక చేస్తారని అనుకోలేదు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయడం ఆశామాషీ కాదు. ఎంపిక పారదర్శకంగా జరిగిందనటానికి నా ఎంపిక నిదర్శనం. ఎలక్ట్రికల్, బ్యాటరీ షాపును పెట్టుకుంటాను.
– గణేశ్, బీజేపీ జిల్లా కార్యదర్శి, మల్కాజిగిరి
దళితబంధు పథకంలో ఎంపిక, అందురు మన వారేనన్న ఉద్దేశంతో పారదర్శకంగా జరిగింది. నియోజక వర్గానికి వంద మందిని ఎంపిక చేశాం. 65 మందికి రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్ అందించడం ఆనందంగా ఉంది. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం.
– మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే, మల్కాజిగిరి