
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లారు. మంత్రులు, ఉన్నతాధికారుల బృందాన్ని వెంట తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఘనస్వాగతం పలికారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ రెండు రోజులు పర్యటించే అవకాశం ఉన్నది.
ఈ పర్యటనలో కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్టు సమాచారం. అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలిసే అవకాశం ఉన్నది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కొనుగోలుకు ఒప్పించేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కూడా ఆదివారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. వీరంతా సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కేంద్ర మంత్రులను, అధికారులను కలవనున్నట్టు సమాచారం.