హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన జాతిపిత మహాత్మాగాంధీ కార్యాచరణ ఆదర్శనీయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ఆయనకు నివాళి అర్పించారు. సత్యం, అహింసా మార్గాలే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్ముడి స్ఫూర్తి గొప్పదని చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో గాంధీజీ అనుసరించిన శాంతియుత విధానాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. గాంధీజీ అనుసరించిన శాంతి, సౌభ్రాతృత్వం, లౌకిక విధానాన్ని ఆచరిస్తూ నూతన రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తున్నదని పేర్కొన్నారు.