ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీభూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్షాతీరేకలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పోడు వ్యవసాయం జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి.
పట్టాల పంపిణీలో భాగంగా రైతుల నుంచి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దరఖాస్తులు తీసుకుంటారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అధికారులు అర్హులైన వారికి పట్టాలు జారీ చేస్తారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాలు పంపిణీ చేయనుండటంతో తమకు సర్కారు సాయం అందడంతో పాటు ఇతర ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా బుధవారం ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గిరిజన రైతులు క్షీరాభిషేకం చేశారు.