తెలంగాణే తానుగా… తనే తెలంగాణగా.. రాష్ట్ర ప్రయోజనమే పాలనగా.. ప్రజల మేలే పథకంగా భావించే కేసీఆర్‌కు కోపమొచ్చింది. ఒకవైపు దొడ్డుబియ్యం కొనబోమని కేంద్రం చెబుతుంటే, మరోవైపు వరే వేయాల్సిందిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల్ని తప్పుదారి పట్టిస్తుండటం కేసీఆర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘నన్నేమన్నా సరే రాష్ర్టాన్ని నాశనం చేస్తామంటే ఊరుకొనే సమస్యేలేదు.’ అంటూ ఆయన విశ్వరూపం చూపించారు. వడ్ల కొనుగోలు, పెట్రో ధరల పెరుగుదల, కేంద్ర సర్కారు నిర్వాకాల్లోని లోగుట్టును బట్టబయలు చేస్తూ బీజేపీని కడిగిపారేశారు. కొత్త రాష్ట్రం కదా.. ఘర్షణ ఎందుకని కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించామని, ఇక తామేమిటో చూపిస్తామని యుద్ధ ప్రకటన చేశారు.
నీళ్లిచ్చింది.. ఒక్క వరి వేసేందుకే కాదు
డిసెంబర్ వరకు వరి వేయొచ్చు. తొందర అవసరం లేదు. నిజంగా కేంద్రం తీసుకుంటాం అంటే సంతోషంగా అందరం వరి వేద్దాం. రైతులు యాసంగిలో ఏ పంటలు సాగుచేయాలనేది స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిది. వరి కాకుండా ఇతర పంటలు వేస్తే మంచి లాభం వస్తుంది. కొంతమంది మూర్ఖంగా, పిచ్చిగా మాట్లాడుతున్నారు. మరి నీళ్లు తెచ్చిర్రు.. ఎందుకు తెచ్చిర్రు? అంటూ వరి పంట వేయకుంటే ఎట్ల? అని అడుగుతున్నారు. నీళ్లు తెచ్చింది వరి వెయ్యమని కాదు. పంటలు వేసుకోమని. ఏ పంటలైనా వేసుకోవచ్చు. ప్రభుత్వం పెట్టుబడి ఇస్తుంది. కరెంటు ఇస్తుంది. నీళ్లు ఇస్తుంది. భూగర్భ జలాలు పెంచింది. పంటలు పండించి మంచిగా బతకమని ఇవన్నీ చేసింది. చాలా పంటలు ఉన్నాయి. అద్భుతమైన పంటలు పండుతాయి.
జీవితాలతో చెలగాటమాడితే ఊర్కోను
తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఊర్కోడు కేసీఆర్. నన్నంటే పడతా. రైతులను మోసం చేస్త, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తనంటే ఒప్పుకోను. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, ఆర్థిక క్రమశిక్షణ పాటించినం. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉన్నది. దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నాం. ఇది మా క్రమశిక్షణకు నిదర్శనం.
షెకావత్.. నాకిచ్చిన మాట నిలబెట్టుకోండి
తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన నీళ్ల వాటాను వెంటనే తేల్చాలె. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్ల్లవుతున్నా ఎందుకు తేల్చడంలేదు? అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాను పంచేలా ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని ఏడేండ్లుగా మొరపెట్టుకుంటున్నం. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను వాపస్ తీసుకుంటే చేస్తమన్నరు. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నం. అయినా రిఫర్ చేయలే. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను డిమాండ్ చేస్తున్న.. నాకు ఇచ్చిన మాట ప్రకారం.. నిజాయితీ ఉంటే తెలంగాణ నీటి వాటాను తేల్చండి. తెలంగాణకు ఎంత వస్తే.. అంత వస్తది. ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయడానికి ఏడేండ్లా? దీనికి మీ జవాబేంది? బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు? తెలంగాణకు నీళ్లు వద్దా? కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పేరిట డ్రామాలా? కేఆర్ఎంబీ ఒక తోక!
పార్టీ అన్నాక.. గెలుపు ఓటమి సహజం
రాజకీయపార్టీ అన్న తర్వాత ఓడుతం.. గెలుస్తం. ఇటువంటివి మస్తుగ జరుగుతుంటయ్. నాగార్జునసాగర్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా పోయింది. దానికేమి మాట్లాడుతరు? ఇదేమన్నా పెద్ద ఇష్యూనా! 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 110 ఎమ్మెల్యేల స్ట్రెంత్ మాది. బై ఎలక్షన్స్ అన్నప్పుడు రెండు గెలుస్తం, ఒకటి ఓడతం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు హుజూర్‌నగర్‌లో గెలిచినం. దేశంలో 25-30 సీట్లకు ఉపఎన్నికలు జరిగినయ్, బీజేపీకి అన్నీ పీకినయి. దేశంలో బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్టా? దాన్ని ఎట్ల తీసుకోవాలి? ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అనేక పరిణామాలు జరుగుతుంటయ్, మేము వాటిని లెక్కచేయం.
దేశానికి బీజేపీ ఒక్క మంచైనా చేసిందా!
మీ ఏడేండ్ల పరిపాలనలో ఏ ప్రజలకన్న మంచి చేసిన్రా? ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బోర్డర్ చూపిచ్చుడు, పాకిస్థాన్‌ను చూపిచ్చుడు, చైనాను చూపిచ్చుడు. ఆడకూడ ఎల్లెలకల పడ్డరు. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనావోడు ఊళ్లకు ఊళ్లే కడుతున్నడు. అక్కడ చేతకాదు.. తోక ముడిచారక్కడ. డ్రామా చేసి మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు. పిచ్చిపిచ్చి కథలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుడు. ఒక్కటన్న నిజం ఉన్నదా? దళితులకు, గిరిజనులకు, బీసీలకు, రైతులకు, నిరుద్యోగులకు ఏమైనా చేసిన్రా? ఒక్క మాటమీదనన్నా నిలవడ్డరా? రూ.15 లక్షలు ఇస్తమన్నరు ఇచ్చిన్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన్రా? ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా.. మీరు ఏ మాట మీద నిలబడ్డరు? మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలె, ఓట్లు దండుకోవాలె. ఇదా రాజకీయం?