నాయకుడు దక్షత ఉన్నవాడైతే.. లక్షలకైనా.. కోట్లకైనా సార్థకత
సమాజాన్ని మేల్కొల్పిన తీరు అద్భుతం
ఉద్యమసారథే.. స్వరాష్ట్ర రథసారథి
నిబద్ధతతో ప్రగతిబాట పట్టిస్తున్న ద్రష్ట
అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన స్రష్ట
సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వ పతాక సీఎం కేసీఆర్ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సమై క్య రాష్ట్రంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని కేసీఆర్ మేల్కొల్పిన తీరు.. ఉద్యమాన్ని రగిలించి రాష్ర్టా న్ని సాధించిన తీరు చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సాధికారత ఉన్న ఉద్యమసారథినే స్వరాష్ట్ర రథసారథిగా ఎన్నుకొన్న ప్రజల నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకొంటూ.. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను కేసీఆర్ నిర్వర్తిస్తున్నారని చెప్పారు. సోమవారం బడ్జెట్ ప్రసంగంలో హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు
నాయకుడు దక్షత ఉన్నవాడైతే లక్షలకైనా.. కోట్లకైనా సార్థకత చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖజానాకు ఎంత ధనం వచ్చి చేరిందన్నది కాదు.. ఆ ధనం ప్రజల జీవితాల్లో ప్రతిఫలించిందా? లేదా? అన్నదే ముఖ్యమని, బడ్జెట్ అంటే అంకెల సముదాయంకాదు.. ప్రజ ల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణ అని నిరూపించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అన్ని రకాల ప్రతికూలతల మధ్య తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా నిలిపింది సీఎం కేసీఆర్ దార్శనికత, అవినీతి రహిత పరిపాలన అని స్పష్టంచేశారు. 75 ఏండ్ల దేశ చరిత్రలో రూ.50 వేల కోట్లను రైతులకు పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అభివృద్ధితో సంక్షేమాన్ని అనుసంధానం చేసి, తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో దళితజాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్.. దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని తెలిపారు. తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతి ప్రమాణాలతో పోలిస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదని.. ఇంత గుణాత్మకమైన మార్పునకు ప్రేరణగా నిలిచిన సీఎంకు ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని చెప్పా రు. మహిళలు విద్యావంతులైతే యావత్‌జాతి విజ్ఞానవంతమవుతుందని నమ్మిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. అందుకోసమే 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేశారన్నారు. కేసీఆర్ కృషిని 15వ ఆర్థిక సం ఘం ప్రత్యేకంగా కొనియాడిందని గుర్తుచేశారు.
సాగునీటి రంగంలో అద్భుతాల ఆవిష్కరణ
‘మట్టికైనా.. మానుకైనా.. మనిషికైనా జీవం పోసేది నీళ్లే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నీళ్ల కోసం అనుభవించిన గోస మాటలకు అందనిది. మలిదశ తెలంగాణ పోరాటనినాదమే ‘నీళ్లు-నిధులు- నియామకాలు’.. సీఎం కేసీఆర్ తెలంగాణ నీటి ఆర్తిని తీర్చడాన్ని ఒక తపస్సులా భావించి, ఏడున్నరేండ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిషరించారు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉన్న తెలంగాణలో 2021 నాటికి 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభించిందని చెప్పారు. నాయకుడికి చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే కానిదేమీ లేదని అనడానికి సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధే నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలు -ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్‌లు, ఆనకట్టలు, కత్వలు, చిన్న, పెద్ద లిఫ్టులను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు.
ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో దేశంలోకెల్లా అతి పెద్దదైన రిజర్వాయర్ మల్లన్నసాగర్‌ను ఫిబ్రవరి 23న సీఎం కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించారని గుర్తుచేశారు. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతీఘాతక శక్తులు ఆటంకాలు సృష్టించినా, కోర్టుల్లో 350కు పైగా కేసులు వేసినా, సీఎం కేసీఆర్ సంకల్ప బలం ముందు నిలువ లేకపోయాయని చెప్పా రు. మల్లన్నసాగర్ గోదావరి జలాలతో కొమురెల్లి మల్లన్న పాదాలను కేసీఆర్ అభిషేకించారని గుర్తుచేశారు. కరెం టు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందన్నారు. చరిత్రలో ఎంతో మంది సీఎంలు అధికార పీఠాన్ని ఎక్కి దిగినా.. కరెంటు సమస్య పరిష్కారం ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమైందని, ఇందుకు కారణం ఆయన రైతు బిడ్డ అని హరీశ్ తెలిపారు.
చరిత్రే సాక్ష్యం
‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతీదీ కొత్తగా నిర్వచించుకోవాల్సిందే, నూతనంగా నిర్మించుకోవాల్సిందే. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలను తెలంగాణ కోణంలో రూపొందించుకోవాల్సిందే’ అని హరీశ్‌రావు చెప్పా రు. అందుకే సీఎం కేసీఆర్ తొలి శాసనసభ సమావేశంలోనే మాట్లాడుతూ ‘తెలంగాణ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలి. కొత్తగా రూపుదిద్దుకోవాలి’ అని అన్నారని ఆయన గుర్తుచేశారు. పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, అవినీతికి ఆసారం లేని విధంగా టీఎస్ఐపాస్, టీఎస్‌బీపాస్, ధరణి, డిజిటల్ నగదు బదిలీ వంటి పారదర్శక విధానాలు అమలుచేయడం వల్ల రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచారని తెలిపారు. సవాళ్లను అధిగమిస్తూ, క్లిష్టమైన సమస్యలను పరిషరిస్తూ ప్రజల అండదండలతో తెలంగాణను అద్భుతమైన ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేశానికి తెలంగాణ టార్చ్‌బేరర్ అన్నట్టుగానే ‘నేడు తెలంగాణ ఆచరించింది, రేపు దేశం అనుసరిస్తుంది’ అనే కేసీఆర్ మాట అక్షర సత్యమన్నారు. ఈ ఏడున్నరేండ్ల చరిత్రే దానికి సాక్ష్యమని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక వైభోగం
సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించడమేకాదు.. దానికి అపూర్వ వైభవం తీసుకురావాలనే గట్టి సంకల్పం కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పంచ నారసింహక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధ్దిచెందిన క్షేత్రం యాదాద్రిని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రఖ్యాత వైష్ణవ ఆగమ పండితులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల ప్రకారం, సశాస్త్రీయంగా యాదాద్రి దేవాలయ నిర్మాణం శరవేగంగా పూర్తిచేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ ఆలయ నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.