హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా, చాలా నీచంగా, చాలా దారుణంగా మాట్లాడుతున్నడు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తా అంటవ్.. ‘మా వ్యూహం మాకుంది, మా జాతీయ అధ్యక్షుడు మాకు చెప్పిండు’ అని బహిరంగ ప్రకటనలు చేసిండు. అయినా మేం కేర్ చేయలేదు. ఏనుగు పోంగ ఎన్ని కుక్కలు మొరుగుతలేవ్ అనుకున్నం. నన్ను జైలుకు పంపిస్తవా నువ్? బలుపా.. అహంకారమా? ఏం కండ్లు నెత్తికెక్కినయా.. ఎవరితో మాట్లాడుతున్నవ్ నువ్? ఇంత అహంకారం ఏంది నాకర్థం కాదు.
తప్పులు చేసేది మీరు.. ప్రజల మీద భారం వేసేది మీరు.. రైతులను మోసం చేసేది మీరు.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనంది మీరు. మీ అసమర్థతను, మీ తెలివి తక్కువతనాన్ని, మీ పరిపాలించలేని, శక్తిలేనితనాన్ని రాష్ర్టాల మీద రుద్ది రాష్ర్టాల ముఖ్యమంత్రులను జైలుకు పంపుతం అంటారా? నన్ను జైలుకు పంపుతవా నువ్.. ముడుతవా కేసీఆర్‌ను.. ముట్టి చూడు బిడ్డా! టచ్ చేసి చూడు కేసీఆర్‌ను. కేసీఆర్‌ను జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగట్టి తిరుగుతా అనుకుంటన్నవా! మేం చేతులు ముడుచుకొని కూర్చుంటమ్ అనుకుంటున్నవా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చునా? ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయొచ్చునా? సోషల్ మీడియాలో ప్రచారం, బయట ప్రచారం.. అన్నీ అబద్ధాలు.
బండీ.. నువ్వు మనిషివే అయితే ఆర్డర్ తీసుకురా
యాసంగిలో వరి వేసుకొనే అవకాశం డిసెంబర్ దాకా ఉంటది. ఈ సిల్లీ బీజేపీ, దొంగ బీజేపీ కోటిన్నర టన్నులు బాయిల్డ్ రైస్ తీసుకుంటం అని ఆర్డర్ ఇస్తదా? యాసంగిలో వరి వెయ్యిమని చెప్పినవ్ కదా (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్దేశించి). నువ్వు మనిషివే అయితే, నిజాయతీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీస్కరా. మొత్తం ధాన్యం తీసుకుంటమని కేంద్రం ఆర్డర్ ఇస్తే, నేనే రైతులకు విత్తనాలు సైప్లె చేయించి, బ్రహ్మాండంగా పంట వేయిస్త. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయితరు. నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నయి. కరెంటు ఇస్తం. ఎరువులు ఇస్తం. మొత్తం కొనుగోలు చేసి అప్పజెప్తం. ఆర్డర్ తెస్తరా? ఇలాంటి అల్లాటప్పాగాళ్ల మాటలు వింటే దెబ్బతింటం. వీళ్లు మోసం చేస్తరు. పంట తీసుకోరు. రైతులకు ఒక్కటే మనవి.. మీ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించండి. వరి కాకుండా ఇతర పంటలు వేసుకోండి.
మీరు మంచిగుండాలనే మేము తండ్లాడుతున్నం. రైతులు బతుకాలె.. పంట పండించినందుకు పది రూపాయలు రావాలె.. రైతు జేబులకు డబ్బు రావాలని మేము కొట్లాడుతున్నం. వాళ్లేమో రైతును ముంచి, రాజకీయం చేసి, వాళ్ల డబ్బాలో ఓట్లు పడేసుకోవాలని చూస్తున్నరు. మీ సొల్లుపురాణం, అబద్ధాల ప్రచారం ఇప్పటిదాకా చెల్లింది. ఇక చెల్లదు. వానకాలం పంట ధాన్యం తీసుకొనేదాకా కేంద్రప్రభుత్వాన్ని నిద్రపోనీయం. ఇక్కడి బీజేపోళ్లను బయట తిరుగనీయం. మేం కూడా ధర్నాలు చేస్తం. మెడలు నీయి వంచాల్నో, నాయి వంచాల్నో, ఏ ప్రభుత్వాన్ని వంచాల్నో బజార్ల పెడుతం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాధ్యతారహితంగా పచ్చి అబద్ధాలు చెప్తున్నడు. ‘రైతులంతా వరి పంటనే పండించండి. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి మేము కొనిపిస్తం’ అంటున్నడు. ఎవరి మెడలు వంచుతారు? ఆయన మెడ వంచుకుంటాడా? కేంద్రం మెడ వంచుతాడా? ఇంత దురుసుగా ఎలా మాట్లాడుతాడు? ధాన్యం కొంటామని కేంద్ర ఫ్రభుత్వం ఆర్డర్ ఇస్తదా మరి? ‘మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్లొచ్చేటాలెకు ఇల్లు కాలిపోయింది’ అని తెలంగాణలో ఒక సామెత ఉన్నది. బాధ్యతలేకుండా మాట్లాడేవారి మాటలు నమ్మొద్దు.
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
నిన్న కాక మొన్న కూడా వరి విషయంపై కేంద్ర అగ్రికల్చర్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీని అడిగితే వాళ్లు కాళ్లకు వేస్తే మెడకు, మెడకు వేస్తే కాళ్లకు వేసేలా మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి. చెప్పేవి తప్పుడు మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ నడుచుకోవాలి. ఇప్పటిదాకా క్షమించినం. ఇక ముందు క్షమించం. పిచ్చిపిచ్చి కూతలు కూస్తే, పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే, ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు చెప్తే మాత్రం చీల్చి చెండాడుతాం జాగ్రత్త. ఇప్పటి దాకా మన్నించాం..కానీ ఇక మన్నించం.
నాలుక చీరేస్తాం జాగ్రత్త..
ఇన్ని రోజులుగా మీరు మాట్లాడుతుంటే ఎనుగుపోతుంటే కుక్కలు మొరుగుతుంటయనుకొని క్షమించినం. ఇప్పటినుంచి పిచ్చికూతలు కూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటం, రోడ్లపై నిలబెడతం, ప్రశ్నిస్తం. అడ్డదిడ్డంగ మాట్లాడితే నాలుక చీరేస్తం జాగ్రత్త. ఎస్.. ఇటీజ్ మై డ్యూటీ. నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని. తెలంగాణను అద్భుతమైన శక్తిగ నిలబెట్టిన వ్యక్తిని. నాకు బాధ్యత ఉంది. నాకు బరువు ఉంది. ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది. ఒక లక్ష్యం ఉంది. అక్కడికి తీసుకొని వెళ్తున్నం. అన్ని వర్గాల ప్రజలను బాగుచేయడానికి పనిచేస్తున్నాం. దళితబంధుపై కూడా ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నరు. మీ జీవితంలో ఎక్కడైనా చేశారా ఇటువంటివి? మీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రూ.2,000 పెన్షన్ ఇచ్చే మొఖం ఉందా మీకు? ఒక కల్యాణలక్ష్మి లాంటి స్కీం ఉందా మీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో?
బండికి నెత్తిలేదు.. కత్తి లేదు
కేంద్రాన్ని పాలించే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాయన, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉండి నిర్లక్ష్యంగా, బాధ్యాతారాహిత్యంగా ఏదిపడితే అది మాట్లాడొచ్చా? ఆయనకు నెత్తిలేదు.. కత్తిలేదు. జిమ్మెదారీ లేదు, బాధ్యత లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. చాలా రోజుల నుంచి ఇట్లనే మాట్లాడుతున్నడు. ఇన్నా ళ్లూ ఆయన మాటలను క్షమిస్తూ వచ్చిన. నా స్థాయి మనిషి కాదు, చిన్నవాడు అని పట్టించుకోలేదు. నా మీద వ్యక్తిగతంగా అడ్డదిడ్డంగా మాట్లాడినా పట్టించుకోలేదు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగతవని వదలిపెట్టిన. ఇప్పుడు మొత్తం రైతాంగం బతుకునే ఆగం చేసేలా మాట్లాడుతుంటే ఏమనాలి? నీకేంగావాలె? రైతులు ధాన్యం పండియ్యాలి.. నీవు ఢిల్లీలో తీసుకోవు.. ఇక్కడ రోడ్లమీద కూర్చొని ధర్నా చేయాలి.. రాజకీయ పబ్బం గడుపుకోవాలి.. అంతే గదా? దీని వెనుకున్నదేంది? నిన్న అతడు ఒక స్టేట్మెంట్తో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు కాబట్టి నేను రైతాంగానికి చెప్తున్నా.. ఈ సొల్లు కబుర్లు నమ్మి వరి పంట వేస్తే దెబ్బతింటం. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరిపంట మనకు క్షేమదాయకం కాదు. ధాన్యం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.
రైతులపై బీజేపీ కక్ష
మొదటినుంచీ బీజేపీ రైతుకు వ్యతిరేకంగా పోతున్నది. రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పజెప్తున్నది. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదినుంచి ఢిల్లీలో ఉద్యమాలు చేస్తుంటే, కేంద్రమంత్రులు రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నరు. బీజేపీలోని సీఎం స్థాయి వ్యక్తులే రైతులను కొట్టాలని క్యాడర్‌ను రెచ్చగొడుతున్నరు. రైతులను తొక్కించైనా అణచివేసే పరిస్థితిలో ఉన్నరు. రేపు మనకు కూడా ఇదే పరిస్థితి వస్తదన్న అనుమానంతో రైతులను కాపాడుకొనేందుకు మన వ్యవసాయ మంత్రి స్పష్టంగా ప్రకటన చేసిండు. పంట పండించి రైతులు మునిగినా ఫర్వాలేదన్న ధోరణిలో బండి సంజయ్ సొల్లు పురాణం మాట్లాడిండు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తున్నది. వానకాలం పంటనే తీసుకుంటరో లేదో తెలువదు. అయినా మేము కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినం. ఎట్లనైనాజేసి ఫైట్ చేద్దాం. కాదంటే ఇంకేదైనా చేద్దాం.. కానీ రైతును మాత్రం నష్టపోనీయొద్దు. ఈ వానకాలం పంట కొందామని ధైర్యం చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినం. కొనగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా చేసేది వీళ్లే, ఢిల్లీలో ధాన్యం కొననిదీ వీళ్లే. మళ్లీ యాసంగిలో పంటవేయాలని చెప్పేది వీళ్లే. ఇది బాధ్యత కలిగిన ముచ్చటేనా?
ఢిల్లీ బీజేపీ ఒకలా.. గల్లీ బీజేపీ మరోలా
ఒకవైపేమో పంటల మార్పిడి చేయించండి, వరి వేయించకండి అని రాతపూర్వకంగా మాకు ఆదేశాలు ఇస్తరు. మరోవైపు వరి వేయాలని నువ్ అంటవు. ఢిల్లీ బీజేపీ వరిధాన్యం వేయొద్దంటది. సిల్లీ బీజేపీ వరి వేయాలంటది. ఏది కరెక్టు? ఢిల్లీ బీజేపీ కరెక్టా? సిల్లీ బీజేపీ కరెక్టా? ఇదేం స్టేట్మెంట్ నాకర్థం కాదు అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడిన. ఇట్ల స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంది అని అడిగిన. బాయిల్డ్ రైస్ ఒక కిలో కూడా ఇయ్యబోమని చెప్పి నాతో రాయించుకున్నవ్. ఇంకో ఐదు లక్షల మెట్రిక్ టన్నులు నీదగ్గరే పెండింగ్ పెట్టుకున్నవ్. ఈ సంవత్సరం టార్గెట్ ఇవ్వుమంటే ఇస్తలేవు. మరి మీ అధ్యక్షుడేమో వరి మాత్రమే పండించండి. ఎట్ల కొనరో చూస్తం అంటున్నడు.. ఎవరు కొంటరు.. నువ్వా నేనా కొనేది? అని అడిగిన. ఆయన ఐసా కైసా బోల్తే? అన్నరు. బోలే! టీవీల్లో ఆల్రెడీ వచ్చింది. పేపర్లల్ల వస్తది తెప్పించుకొని చూడుమని చెప్పిన.
కేంద్రాన్ని సాదేది తెలంగాణ
కేంద్రం డబ్బులిస్తే మేం డైవర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నరు. ఇచ్చిండ్రా? డబ్బులు. మిమ్ములను సాదేది తెలంగాణ ఇయ్యాల. అది నేను చెప్తలేను రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. నాట్ మై స్టేట్మెంట్. బెస్ట్ కంట్రిబ్యూట్ స్టేట్‌లో ద బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్.. తెలంగాణ అని చెప్పింది. మేం ఇచ్చే డబ్బుల మీద మీరు నడుపుతున్నరు ఢిల్లీని. మీరు ఇచ్చే డబ్బులతో మేం నడుపుతలేం. మొత్తం మీద ఈ ఏడేండ్లలో రాష్ర్టానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం రూ.42వేల కోట్లు. అన్ని రాష్ర్టాలకు వచ్చినట్టు మనకు వచ్చింది. ప్రధానంగా రెండు, మూడు స్కీంలు ఉంటాయి. ఒకటి నరేగా, రెండోది ఎన్ఆర్హెచ్ఎం, మూడోది సర్వశిక్షాఅభియాన్. ఇంతకుమించి ఇగ రావు డబ్బులు. ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. స్టేట్ రీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం, బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్-బీఆర్జీఎస్ కింద రూ.450 కోట్లు మనకు రావాలి. ఎగ్గొట్టారు. అవి తీసుకొనిరారు వీళ్లు (ఇక్కడి బీజేపీ నేతలు). దాని గురించి మాట్లాడరు. మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద పెద్దంతరం, చిన్నంతరం లేకుండా కండ్లు నెత్తికెక్కి ఎంతపడితే అంత మాట్లాడుతరు.
రాష్ట్ర బీజేపీ ఏం చేస్తున్నది?
రాష్ర్టాన్ని కొత్తగ తెచ్చుకున్నం. ఎందుకులే కేంద్రంతో ఘర్షణ వాతావరణం అని పద్ధతిగా రాష్ర్టాన్ని సెటిల్ చేసుకుందామని ఉన్నం. సంయమనం, ఓపిక పట్టి కేంద్రం సహకరించకున్నా పని చేసుకుంటున్నం. కేంద్రం ఐదేండ్లు హైకోర్టును విభజన చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏం కారణం చేత చేయలేదు? మీది అసమర్థ ప్రభుత్వం కాదా? రాష్ట్రం వస్తది.. రాష్ట్రానికి నీళ్ల వాటా రావాలి అని మేం అడిగినం. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయండి, మాకు నీళ్ల వాటా తేల్చాలి అని చెప్పినం. ఈ రోజుకూ తేల్చరు. ఏం కారణం మీ అసమర్థతనా, మీ అవివేకమా, మీ చేతగానితనమా? అది చేతగాదు మీకు. బీఆర్జీఎస్ కింద రూ.450 కోట్లు రావాలి, దాని గురించి మాట్లాది లేదు. నవోదయ పాఠశాలల గురించి ప్రధానికి ఇప్పటి వరకు నేను 50 దరఖాస్తులు ఇచ్చిన. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టి తీరాలి అని చట్టం ఉన్నది. చట్టప్రకారం మీరు కొత్త జిల్లాలకు ఇవ్వాలి.. అది ధర్మం అని చెప్పి అడిగిన. ఒక్కటి కూడా ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఎక్కడ పోయారు ఈ బీజేపీ నాయకులు? ఇక్కడి నుంచి ఉన్న కేంద్రమంత్రి ఏం చేస్తున్నడు? ఇక్కడ నుంచి ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నరు? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్. మొదలు దీనికి సమాధానం చెప్పు.
కరీంనగర్లో గెలిచి ఒక్క రూపాయి పని చేసిండా!
ఒకటే మాట రైతాంగం అర్థం చేసుకోవాలె. ఏడేండ్లలో దేశంలోనే ఎక్కడా లేని సదుపాయాలు తెలంగాణలో ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? మిషన్ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నయి చెరువులు. పోయిన సంవత్సరం అన్ని వర్షాలు పడినా.. ఒక్క చెరువు తెగలేదు. ఈ సంవత్సరం కూడా అంతే. బోర్లన్నీ మోటర్లు పెట్టకుండానే పోస్తున్నయి కదా. ఊటలు పెట్టినయి కదా. ఇంత అద్భుతాన్ని సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. చిల్లర రాజకీయాల కోసం మీరు వడ్లు పండిస్తే, రోడ్లమీద కూర్చోబెట్టి ధర్నాలు చేయించాలనే పరిస్థితిలో వాళ్లు మాట్లాడుతున్నరు. ఈ అల్లాటప్పాగాళ్లు, పనికిమాలినోళ్లు, రాష్ర్టానికి ఒక్క పదిరూపాయల పని చేయనివాళ్లు వీళ్లు. కరీంనగర్ నుంచి గెలిచిన ఈ మనిషి ఒక్క రూపాయి పనిచేసిండా? ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిండా? ఆయనకు ఇంగ్లిష్, హిందీ వస్తదా? ఢిల్లీల ఏం మాట్లడతరో తెలుస్తదా? ప్రభుత్వ లెటర్లు అర్థమైతయా? దేశాన్ని పాలించే పార్టీ ప్రెసిడెంట్‌గా ఈ లెటర్లను ఎప్పుడన్న చూసినవా? ఈ దుర్మార్గుడు బాధ్యతారహితంగా తెలంగాణ ప్రాజక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లెటర్ రాసిండు. ప్రకాశ్ జవదేకర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన లెటర్ ఇచ్చిండని ఆయనే నాకు చెప్పిండు.