హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఆదివారం మీడియా సమావేశంలో దళితబంధుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘మేము కమిట్మెంట్ ఉన్నోళ్లం. కేసీఆర్ బతికి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో దళితబంధు పథకం వందకు వందశాతం అమలుచేస్తం. నేను చెప్పిన పద్ధతిలోనే అమలుచేస్తం. ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు.. అంతట అమలుచేస్తం. మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఇది మా ఎజెండా అని స్పష్టంగా చెప్పినం. ఉపఎన్నిక రాగానే మీరు దొంగ మాటలు మాట్లాడుతరు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నరు. నోటికొచ్చినట్టు కారుకూతలు కూసిన్రు. ఇన్నిరోజులు మీ ఆటలు చెల్లినయి బిడ్డా.. ఇకమీదట చెల్లవు.’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దళితులు, గిరిజనుల కోసం పెట్టిన అట్రాసిటీ చట్టాన్ని ఒక వెధవ లొట్టపీసు చట్టం అంటడా? మీకు చట్టాలంటే గౌరవం లేదు, దళిత, గిరిజన ప్రజలంటే భయం లేదు. తమాషా చేస్తున్నరా?
రాష్ర్టాలను కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నది
రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఎన్నో రకాల ఒత్తిళ్లు పెడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి బాయికాడ కరెంటు మీటర్ పెట్టాలని అంటు న్నదని ఆయన పేర్కొన్నారు. ‘మీటర్లు వద్దని నేను రెండేండ్ల నుంచి పోరాడుతున్న. మా రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నం, బిల్లులు మేమే కట్టుకుంటం అని చెప్తే, రాష్ర్టానికి వచ్చే రుణాలను బంద్ చేస్తమని బ్లాక్మెయిల్ చేస్తున్నరు. ఇన్నిరోజుల నుంచి మర్యాదగా, పద్ధతిగా, కొత్త రాష్ట్రం కాబట్టి సెటిల్ చేసుకుందాం అనే ధోరణిలో చూసినం. అయినా ప్రతి విషయానికి ఉల్టా పల్టా మాట్లాడుతున్నరు. అబద్ధాలు చెప్తున్నరు. ఇప్పుడు తగులుకుంటం కదా.. మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో మాట్లాడుతం. ప్రజలకు మీరేం చేసిన్రో, మేమేం చేసినమో చెప్తం. ఇప్పటిదాకా ఓపికపట్టినం. ఇకపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎంబడి పడుతం. ఇక్కడున్న బీజేపీ ఎంబడి పడుతం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.