జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 25 (నమస్తేతెలంగాణ) : ‘తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చాలా బాగుంది.. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవిస్తే కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు ఇట్ల ఎన్నో ప్రజోపయోగ పథకాలు అమలు చేస్తున్నడు.. మాకు రాష్ట్రం ఉన్నట్లేగాని ఇక్కడ పాలన ఏమాత్రం బాగలేదు.. ఒక్కటంటే ఒక్కటి సుత సంక్షేమ పథకం లేదు. విద్య, వైద్యం, విద్యుత్, మార్కెటింగ్ ఇట్ల ప్రతిదానికి తెలంగాణ మీదనే ఆధారపడుతున్నం’ అని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా ప్రజలు స్పష్టం చేశారు. ఏడేళ్ల టీఆర్ఎస్ సర్కారు పాలనలో తెలంగాణలోని సరిహద్దు గ్రామాలకు, పక్క రాష్ర్టాల సరిహద్దు గ్రామాలకు ఉన్న తేడాను బేరీజు వేసేందుకు ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం పరిశీలనకు వెళ్లగా అక్కడి ప్రజల దుర్భర పరిస్థితులు కనిపించాయి. ‘నాలుగు నెలలుగా బస్సులు నడవడం లేదని, కేవలం తెలంగాణ నుంచి నడుస్తున్న బస్సుల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నామని వివరించారు. తమకు స్థానికంగా ఉపాధి దొరకదని, తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు బతుకుదెరువు కోసం వలసలు పోక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం కోసం చెరువులు, రిజర్వాయర్లు లేవని, వర్షాలు, బోరు బావులతోనే పంటలు పండించాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. గడ్చిరోలి జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉంటుందని, ఇక్కడ సాగుచేద్దామంటే భూములు కూడా లేవని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లేదంటే తెలంగాణలో కలుపాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిందేనని, ఆ సమయం ప్రస్తుతం ఆసన్నమైందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
కేసీఆర్ పట్టుదల కలిగిన రాజకీయ నాయకుడు. ఆయ న జాతీయ రాజకీయాల్లోకి రావాలె. మాలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు కావాలంటే కేసీఆర్‌లాంటి నా యకుడు ఉండాలె. నిత్యం ప్ర జలకు సేవ చేయాలనే తపన కలిగిన వ్యక్తులతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంతసేపూ మతాల తో రాజకీయాలు చేయడం దేశానికి మంచిది కాదు. మహారాష్ట్ర ప్రభుత్వ పని తీరు అధ్వానంగా ఉంది.
-రాయిల్లా పాపిరెడ్డి, మద్దికుంట, సిరోంచ తాలూకా
వర్షం పడితేనే పంటలు
మాకు సాగుభూములు లేవు.. చెరువులు, ప్రాజెక్టులు లేవు. కొద్దోగొప్పో భూమి ఉన్నోళ్లు వానలు పడితేనే పంటలు వేస్తరు. బోరుబావుల కింద పండిస్తరు. మా గ్రామాలకు రోడ్లు సక్కగుండవు. వానకాలం వస్తే మొత్తానికే కరంటు ఉండదు.
– సిరియా పెంటవెలది, బెజ్జూరుపల్లి, సిరోంచ తాలూకా
తెలంగాణలో కలుపండి
ఎన్నేళ్లయినా మా పరిస్థితులు, బతుకుల్లో మార్పు రావడం లేదు. మా తాలూకాను అభివృద్ధి చేయండి .. లేకుంటే తెలంగాణలో కలుపండి.. అని మా తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినం. మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి పథకాలు అందడం లేదు. సీఎం కేసీఆర్‌లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తేనే మా బతుకులు బాగుపడుతయ్.
-అబ్దుల్ సలాం, సిరోంచ
తెలంగాణ పథకాలు భేష్
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నయ్. కులమతాలకు అతీతంగా మంచి పాలన అందిస్తున్నడు. మహారాష్ట్రలో మూడు ముక్కలాట నడుస్తున్నది. ఎవరు ఎప్పుడు ఏం పిలుపునిస్తరో తెల్వది. ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్నరు. -అట్ల నారాయణ, మద్దికుంట, సిరోంచ తాలూకా