హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తమిళనాడు పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నారు. సోమవారం కుటుంబసమేతంగా శ్రీరంగంలోని ప్రఖ్యాత రంగనాథస్వామిని దర్శించుకొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయ ప్రత్యేకతను వివరించారు. సీఎం కేసీఆర్‌ను ఆలయ అధికారులు సన్మానించగా, వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు.
దేవాలయంలోని గజరాజు సీఎం కేసీఆర్ దంపతులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించింది. దేవాలయ నిర్వహణ బాగున్నదని అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. శ్రీరంగానికి రావడం ఇది రెండోసారి అని గుర్తుచేసుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్‌కు తిరుచ్చి విమానాశ్రయంలో అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి శ్రీరంగం దేవాలయానికి చేరుకోగా తమిళనాడు మున్సిపల్‌శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ, జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ సాదర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులు సోమవారం రాత్రి చెన్నైలోని ఐటీసీ చోళలో బస చేశారు. కేసీఆర్ వెంట కేసీఆర్ సతీమణి శోభ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య, తదితర కుటుంబసభ్యులు ఉన్నారు.
నేడు స్టాలిన్‌తో భేటీ
సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ కానున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, భవిష్యత్తు వ్యూహాల గురించి చర్చించనున్నట్టు సమాచారం.
ఫిబ్రవరి 28న సైన్స్ సెమినార్
రాష్ట్రంలోని టీచర్లు, విద్యావంతులు, పరిశోధకుల సౌకర్యార్థం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న సైన్స్ సెమినార్‌ను నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి వెల్లడించారు. ‘రీ డిఫైనింగ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్ సైన్స్’ అనే అంశంపై ఈ సెమినార్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు.